 
															సల్మాన్‌ను ఆ ప్రశ్న అడుగుతా!
సల్మాన్ ఖాన్‌ని సోనాక్షి సిన్హా ఓ ప్రశ్న అడగాలనుకుంటున్నారు.
	సల్మాన్ ఖాన్‌ని సోనాక్షి సిన్హా ఓ ప్రశ్న అడగాలనుకుంటున్నారు. ఆ ప్రశ్న ఏమై ఉంటుందా? అని ఆలోచిస్తున్నారా? మరేం లేదు. ‘మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు?’ అని అడుగుతారట. అసలు సల్మాన్‌ని సోనాక్షి ఈ ప్రశ్న ఎందుకు అడగాలనుకున్నారనే విషయానికొస్తే.. ఆమె లీడ్ రోల్‌లో నటించిన చిత్రం ‘నూర్’. వచ్చే నెల ఈ చిత్రం విడుదల కానుంది. ఇందులో సోనాక్షి సిన్హా జర్నలిస్ట్ రోల్‌లో యాక్ట్ చేశారు. పాకిస్తాన్ రైటర్  సబా ఇంతియాజ్ నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు.
	
	ఈ చిత్రం ప్రమోషనల్ కార్యక్రమాల్లో పాల్గొన్న సోనాక్షీని.. ‘మీరే కనుక రియల్‌గా జర్నలిస్ట్ అయితే మీ నాన్నగారు శతృఘ్న సిన్హాను ఏం ప్రశ్న అడుగుతారు’ అని కొందరు జర్నలిస్టులు అడగ్గా... ‘ఖామోష్ అని మా నాన్న తిరిగి బదులు చెప్పని ప్రశ్న అడుగుతా’ అన్నారు. మరి, సల్మాన్ ఖాన్‌ను ఏ ప్రశ్న అడుగుతారని అడగ్గా.. ‘వేరే ఏం ఉంది. అందరూ అడిగేదే. మీకు తెలిసిందే. అదేనండి. సల్మాన్‌ని మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుం టారు? అని అడుగుతా’ అని సోనాక్షి  సమాధానం ఇచ్చారు. మరి.. సల్మాన్‌ని సోనాక్షీ డైరెక్ట్‌గా ఈ ప్రశ్న అడిగితే ఆయన్నుంచి ఏం సమాధానం వస్తుందో?

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
