జర్నలిస్టులపై జరిగిన దాడికిగానూ స్టార్ డైరెక్టర్ శంకర్ క్షమాపణ చెప్పారు.
చెన్నై: జర్నలిస్టులపై జరిగిన దాడికిగానూ స్టార్ డైరెక్టర్ శంకర్ క్షమాపణ చెప్పారు. ఈ ఘటన తనకు తెలియకుండా జరిగిందని, మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం అవకుండా చూస్తానని శంకర్ అన్నారు. చెన్నైలోని ప్రెస్ క్లబ్‌లో శంకర్ మాట్లాడారు. 2.0 మూవీ యూనిట్ జర్నలిస్టులపై దాడికి పాల్పడిందని, అందుకుగానూ వారి తరఫున తాను క్షమాపణ చెబుతున్నానని ఆయన పేర్కొన్నారు. జర్నలిస్టులు తమ మూవీ ప్రొడక్షన్ మేనేజర్, ఓ బౌన్సర్, శంకర్ సన్నిహితుడిపై ఇచ్చిన ఫిర్యాదును వెనక్కి తీసుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు.
సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తోన్న 2.0 మూవీ షూటింగ్ చెన్నైలో జరుగుతోంది. షూటింగ్ స్పాట్ రోడ్డును రాత్రి మొత్తం బ్లాక్ చేశారు. ఇద్దరు జర్నలిస్టులు మూవీ యూనిట్‌తో ఈ విషయంపై గొడవకు దిగారు. దీంతో చెర్రెత్తుకొచ్చిన మూవీ యూనిట్ కొందరు ఇద్దరు జర్నలిస్టులపై దాడికి పాల్పడ్డారు. రంగనాథన్, భరత్ అనే జర్నలిస్టులపై బౌన్సర్, మూవీ యూనిట్ దాడి చేయడంతో పాటు వారి కెమెరాలు లాగేసుకున్నారు. దీంతో ఆగ్రహించిన జర్నలిస్టులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా వారు ఈ విషయాన్ని శంకర్ దృష్టికి తీసుకెళ్లారు.
వెంటనే డైరెక్టర్ శంకర్ చెన్నై ప్రెస్ క్లబ్‌లో బహిరంగంగా జర్నలిస్టులకు క్షమాపణ చెబుతూ.. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా చూస్తామన్నారు. చెన్నై నగరంలో రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు షూటింగ్ కు అనుమతి ఉందని, అయితే జర్నలిస్టులు వేసిన ప్రశ్నలతో విసిగిపోయిన మూవీ యూనిట్ వారిపై దాడి చేసింది.