భాషతో పనేంటి?

Sayesha Saigal Says Language Nothing Problem In  Film Industry - Sakshi

చెన్నై : భాషతో పనేంటి? అని ప్రశ్నిస్తోంది నటి సాయేషా సైగల్‌. ఈ బాలీవుడ్‌ బ్యూటీ తొలుత టాలీవుడ్‌కు దిగుమతి అయినా, ఆ తరువాత కోలీవుడ్‌లో సెటిల్‌ అయింది. ఇప్పుడు నటిగానే కాదు చెన్నైని తన అత్తిల్లుగా మార్చేసుకుంది. కోలీవుడ్‌లో ‘వనమగన్‌’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన సాయేషాసైగల్‌ తొలి చిత్రంతోనే ప్రశంసలు అందుకుంది. ఆ తరువాత వరుసగా అవకాశాలు రాబట్టుకుంది. కడైకుట్టిసింగం, జూంగా, గజనీకాంత్‌ తదితర చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు పొందింది. ఈ అమ్మడు రెండు చిత్రాలకు కృతజ్ఞతలు చెప్పుకునే తీరాలి. అందులో ఒకటి వనమగన్‌. నటిగా మలుపు తిప్పిన చిత్రం ఇదే. ఇక రెండోది గజనీకాంత్‌. ఇది ఇంకా సాయేషాకు మరిచిపోలేని చిత్రం. కారణం నటుడు ఆర్యతో పరిచయాన్ని, సాన్నిహిత్యాన్ని పెంచిన చిత్రమే కాకుండా వారి ప్రేమను పండించిన చిత్రం గజనీకాంత్‌. ఇక కాప్పాన్‌ చిత్రం కూడా సాయేషా సైగల్‌ చిత్రంలో గుర్తిండిపోయే చిత్రమే అవుతుంది. ఈ చిత్ర షూటింగ్‌ సమయంలోనే ఆర్యతో ఏడడుగులు వేసి అర్ధాంగిగా మారిపోయింది. కాగా చివరిగా ఈ బ్యూటీ నటించిన చిత్రం కాప్పాన్‌. సూర్య కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంలో ఆర్య కూడా కీలక పాత్రను పోషించారు. ప్రస్తుతం తన భర్త ఆర్యకు జంటగా టెడ్డీ అనే చిత్రంలో నటిస్తోంది.

ఈ సందర్భంగా సాయోషా ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో.. హిందీలో అజయ్‌దేవగన్‌ సరసన నటించిన శివాయ్‌ చిత్రం విజయం సాధించడం కారణంగానే నటిగా తనకు పలు అవకాశాలు వచ్చాయని తెలిపింది. ఇప్పుడు సూర్యకు జంటగా కాప్పాన్‌ చిత్రంలో నటించే స్థాయికి ఎదిగానని అంది. నటననూ నేర్చుకున్నానని చెప్పింది. ఇంకో విషయం ఏమిటంటే నటనకు కళ్లు చాలని పేర్కొంది. ఆ రెండు కళ్లు ఎన్ని భావాలనైనా పలికిస్తాయంది. అందుకు భాషతో పనే లేదని పేర్కొంది. తాను సినిమా కుటుంబం నుంచి వచ్చినా ఇంట్లో సినిమా గురించి మాట్లాడటం తక్కువేనని చెప్పింది. తమ కుటుంబానికంతా ప్రయాణం చేయడం ఇష్టం అని తెలిపింది. దక్షిణభారత సినిమా సాంకేతిక పరంగా చాలా అభివృద్ధి చెందిందని చెప్పారు. అది  కాప్పాన్‌ చిత్రంలో చూశానని చెప్పింది. సూర్యకు జంటగా నటిస్తానని కలలో కూడా ఊహించలేదని పేర్కొంది. ఆయన నుంచి నేర్చుకున్న విషయాలను భవిష్యత్‌లో తనకు ఉపకరిస్తాయని అంది. ఇప్పుడు పాత చిత్రాలను రీమేక్‌ చేసే ట్రెండ్‌ నడుస్తోందని, అలా హిందీ చిత్రం రామ్‌ లక్కన్‌ను ఎవరైనా రీమేక్‌ చేస్తే అందులో మాధురీదీక్షిత్‌ పాత్రలో నటించాలని ఆశపడుతున్నట్లు చెప్పింది. అందులో డాన్స్‌కు ఎక్కువ అవకాశం ఉందని, తాను డాన్స్‌లో శిక్షణ పొందిన నటినని తెలిపింది. తనలోని నాట్యకళాకారిణిని ఆవిష్కరించేలా పూర్తి నాట్యభరిత కథా చిత్రంలో నటించాలని కోరుకుంటున్నానని నటి సాయేషా సైగల్‌ పేర్కొంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top