పూరీకి విమర్శకులు ఉండరు.. అభిమానులే ఉంటారు

Puri Jagannadh Birthday Gift To Aspiring Filmmakers - Sakshi

‘‘ఎవరు సినిమా తీస్తే దిమ్మతిరిగి మైండ్‌ బ్లాక్‌ అయ్యే హిట్‌ వస్తుందో అతనే ఇస్మార్ట్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌. ఆయన డైలాగ్స్, డైరెక్షన్, టైటిల్స్‌ అన్నీ ఒక బ్రాండ్‌. హీరో క్యారెక్టర్స్‌ సృష్టించడంలో మేధావి’’ అన్నారు దర్శకులు కాశీవిశ్వనాథ్‌. సెప్టెంబర్‌ 28 దర్శకుడు పూరి జగన్నాథ్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా దర్శకత్వ విభాగంలో 30 మంది సభ్యులకు 50 వేల చొప్పున 15 లక్షలు సహాయం చేశారు పూరి జగన్నాథ్, చార్మి. శనివారం ‘హెల్పింగ్‌ హ్యాండ్‌’ పేరుతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దర్శకత్వ శాఖలోని 30 మందికి చెక్‌లను అందజేశారు. ఈ సందర్భంగా చార్మీ మాట్లాడుతూ – ‘‘ఇస్మార్ట్‌ శంకర్‌’ సినిమా ముందు  ఆర్థికంగా కొంచెం ఇబ్బంది పడ్డాం. ఎవ్వరికీ ఆ విషయం చెప్పలేదు. ఆ సమయంలో రామ్‌ మమ్మల్ని నమ్మారు. ‘పూరీగారి సినిమాలో నటించాలి’ అనే ఒక్క కారణంతో వచ్చి సినిమా చేశారు. అతనికి చాలా థ్యాంక్స్‌. మేం బ్యాడ్‌ ఫేజ్‌లో ఉన్నప్పుడు కూడా ‘డబ్బులు వస్తాయి.. పోతాయి.

మళ్లీ వస్తాయి.. పోతాయి. వాటి గురించి ఆలోచించకూడదు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుంటూ కష్టపడదాం’ అని మా అందరిలో ధైర్యం నింపేవారు పూరీగారు. మాకు కుదిరితే ప్రతి ఏడాది పూరీగారి పుట్టినరోజున ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ‘‘ఇతరులను చూసి పోటీ ఫీల్‌ అవ్వడు, ఈర్ష్య పడడు పూరి. ఆయనకు విమర్శకులు ఉండరు. అభిమానులే ఉంటారు. దర్శకులకు సహాయం చేయాలనే ఆలోచన రావడం అభినందనీయం. ఎన్నో కుటుంబాల ఆశీస్సులు వీళ్ళతో ఉంటాయి’’ అన్నారు కాశీ విశ్వనాథ్‌. ‘‘పూరీగారు ఇండస్ట్రీలో ఒక కెరటం. పడటం తెలుసు. పడి లేవటం తెలుసు. ఎవరైనా సక్సెస్‌ వస్తే స్వీట్స్‌ పంచుతారు. ఆయన సహాయాన్ని అందిస్తున్నారు. ఈ సంప్రదాయం కొనసాగాలి’’ అన్నారు దర్శకుల సంఘం సభ్యులు సుబ్బారెడ్డి. ‘‘పూరి అంటేనే పాజిటివిటీ. ఆయనకు వరుసగా 24 హిట్స్‌ రావాలి. 24 శాఖల వారికి సహాయపడాలని కోరుకుంటున్నాను.

దాసరిగారిని ఓ సందర్భంలో మీ వారసుడు ఎవరని అడిగితే పూరి జగన్నాథ్‌ అని చెప్పారు’’ అన్నారు జర్నలిస్ట్‌ ప్రభు. ‘‘గతంలో దాసరిగారు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసేవారు. పూరీగారు ఈ సహాయాలను ఇలానే కొనసాగించాలి. చార్మీగారికి ధన్యవాదాలు’’ అన్నారు రాంప్రసాద్‌. ‘‘జగ్గు (పూరి), నేను కలసి పెరిగాం. తనకి మనుషులను, మొక్కలను, జంతువులను ప్రేమించడం తెలుసు. తనో అడవి. అప్పుడప్పుడు కారుచిచ్చులు అంటుకోవచ్చు. కానీ అడవి ఎప్పుడూ అడవే. పూరీగారికి సినిమాను ప్రేమించడం మాత్రమే తెలుసు. ఇలాంటి సహాయ కార్యక్రమం చేయాలని ఐడియా ఇచ్చి నందుకు చార్మీగారికి ధన్యవాదాలు’’ అన్నారు నటుడు ఉత్తేజ్‌. అనంతరం కేక్‌ కట్‌ చేశారు. ఈ కార్యక్రమంలో దర్శక సంఘం సభ్యులు గంగాధర్, సుబ్బారెడ్డి, విషు రెడ్డి, అనిల్‌ పాల్గొన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top