
కబాలిలో రంజిత్ స్టయిల్
ఈ సీన్ దర్శకుడు పా రంజిత్ అభిమానులను ఏమాత్రం ఆశ్చర్యానికి గురిచేయలేదు.
సూపర్‌స్టార్ రజనీకాంత్ సినిమా.. అందులోనూ ఇంట్రడక్షన్ సీన్ అంటే స్పెషల్ ఎఫెక్ట్‌లు, సూపర్ హీరో స్టైల్ మేకింగ్ ఎక్స్‌పెక్ట్ చేస్తారు ఫ్యాన్స్. కానీ కబాలి సినిమాలో రజనీ ఇంట్రడక్షన్ చాలా సాదాసీదాగా ఉంటుంది. అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూసిన కబాలి సినిమా తొలి షాట్‌లో రజనీ ఓ పుస్తకం చదువుతూ కనిపిస్తారు. కెమెరా జైలు ఊచల నుంచి మెల్లగా కదులుతూ వెళ్లి చివరగా రజనీకాంత్ నటించిన కబాలి క్యారెక్టర్‌పై ఫోకస్ అవుతుంది. ఆ సమయంలో రజనీ చేతిలో ఓ పుస్తకం ఉంటుంది.
ఆ పుస్తకం పేరు ‘మై ఫాదర్ బాలయ్య’. తెలంగాణకు చెందిన దళిత రచయిత వైబీ సత్యనారాయణ రచించిందే ఈ పుస్తకం. స్వాతంత్య్రానికి ముం దు, ఆ తర్వాత దళితుల జీవన పోరాటం.. చదువు కోసం వారుపడిన పాట్లే ఇతివృత్తంగా ఈ పుస్తక రచన సాగింది. ఈ సీన్ దర్శకుడు పా రంజిత్ అభిమానులను ఏమాత్రం ఆశ్చర్యానికి గురిచేయలేదు. వారంతా ఇదీ రంజిత్ మార్కు షాట్ అని ముక్త కంఠంతో చెపుతున్నారు.
కబాలి డెరైక్టర్ రంజిత్ 2014లో రూపొందించిన సినిమా మద్రాస్. తమిళ సినిమాల్లో దళితుల ప్రాతినిథ్యానికి ‘మద్రాస్’ సినిమాను ఓ సాధనంగా వాడుకున్నారని పెద్ద చర్చే నడిచింది. ఇప్పుడు కబాలి విషయంలోనూ అదే పంథా అనుసరించారు రంజిత్. కబాలి చిత్రానికి ప్రొడక్షన్ విభాగంలో పనిచేసిన చాలామంది దళిత సామాజిక వర్గానికి చెందిన వారే. డెరైక్టర్ రంజిత్‌తో మొదలుపెడితే సినిమాటోగ్రాఫర్ జి.మురళి, ఆర్ట్, కాస్ట్యూమ్ డెరైక్టర్ థా రామలింగమ్, పాటల రచయితలు ఉమాదేవి, అరుణ్‌రాజా కామరాజ్, ఎం.బాలమురుగన్ ఇలా అందరూ దళితులే.
వీరిలో కొందరు తమను కులం పేరుతో గుర్తించడాన్ని వ్యతిరేకిస్తున్నారు. సినిమా అనేది ఓ కళ అని, ఇక్కడ కళలో నైపుణ్యం మాత్రమే గుర్తింపును ఇస్తుందని, దీనికి ఇతర గుర్తింపులేమీ అవసరం లేదని చెపుతున్నారు. మరికొందరు గతంలో తాము ఎదుర్కొన్న ఇబ్బందులే ఇప్పుడు తమను ఈ స్థానానికి ఎదిగేలా చేశాయని చెపుతున్నారు.
మద్రాస్ సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలా ఇంటర్వ్యూల్లో రంజిత్ మాట్లాడుతూ.. తనకు కులం గురించి మాట్లాడటంపై నమ్మకం లేదని చెప్పారు. ‘మద్రాస్’లో కుల వ్యవస్థ గురించి నిర్భయంగా చూపించారు. తమిళ మెయిన్ స్ట్రీమ్ సినిమాల్లో ఇలాంటి బోల్డ్ అటెంప్ట్ చేయడం అదే తొలిసారి. రంజిత్ సినిమాల్లో ప్రధాన పాత్రలు దళిత సాహిత్యం చదువుతూనో.. లేదా అంబేడ్కర్ చెప్పిన మాటలను అండర్‌లైన్ చేసి చూపిస్తూనో కనిపిస్తుంటాయి. మలేసియాలో అణచివేతకు గురవుతున్న తమిళుల కోసం పోరాటం చేసే ఓ వ్యక్తి ఇతివృత్తంతోనే కబాలిని రూపొందించాడు రంజిత్.