సంగీతంలో నాకెవరు సాటి!

One Cannot Learn Music From The Book Says Ilayaraja - Sakshi

సంగీతంపై తనతో చర్చించేంత ప్రతిభావంతుడు ఇంకా తారస పడలేదని సంగీత దర్శకుడు ఇళయరాజా అన్నారు. 75వ వసంతంలోకి అడుగు పెట్టిన ఈయనకు పలువురు అభినందన సభలను, సత్కారాలను నిర్వహిస్తున్నారు. ఇటీవలే సినీ నిర్మాతల మండలి ఘనంగా సన్మానించిన విషయం తెలిసిందే. పలు కళాశాలల్లో ఇళయరాజా జన్మదిన కార్యక్రమాలను నిర్వహిస్తూ సన్మానిస్తున్నారు.

మంగళవారం విరుదునగర్‌లోని సెంధిల్‌ కుమర్‌ నాడార్‌ కళాశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఇళయరాజా మాట్లాడుతూ విరుదునగర్‌లో తాను కాలు పెట్టని ప్రాంతమే లేదన్నారు. 1969లో మాసట్ర మనం అనే నాటకానికి సంగీ తాన్ని అందించడానికి తొలిసారిగా హార్మోనియంతో వచ్చానని తెలిపారు. అలా తనకు, తన హార్మోనియంకు పరిచయం అయిన ప్రాంతం విరుదునగర్‌ అని పేర్కొన్నారు.

కామరాజర్‌ పథకంతో విద్యార్థులకు తాను చెప్పేదొక్కటే. అనవసర ఆలోచనలతో కాలాన్ని వృథా చేసుకోవద్దని హితవు పలికారు. బాగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని తన సంగీతంతో ఆశీర్వదిస్తున్నానన్నారు. ముఖ్యంగా మిమ్మల్ని ఎవరితోనూ పోల్చుకోవద్దని చెప్పారు. తనకు చదువు అంటే ఆసక్తి మక్కువనీ, అప్పట్లో కామరాజర్‌ ప్రవేశపెట్టిన మధ్యాహ్నం ఆహారం పథకంతో 6 నుంచి 8 వ తరగతి వరకూ చదువుకున్నానని ఇళయరాజా గుర్తు చేసుకున్నారు.

విద్యార్థల ప్రశ్నలకు ఇళయరాజా బుదులిచ్చారు. అపూర్వసహోదరగళ్‌ చిత్రంలోని పుదుమాయ్‌ పిళ్‌లైక్కు నల్ల యోగమడా పాట ఎలా రూపొందిందన్న ఒక విద్యార్థిని ప్రశ్నకు ఆయన బదులిస్తూ, అది ఎంజీఆర్‌ పాటలు మాదిరిగా ఉండాలని నటుడు కమలహాసన్‌ కోరారన్నారు. అందుకే నాన్‌ పార్తదిలే అవళ్‌ ఒరుత్తిౖయెదాన్‌ నల్ల అళగి యన్భేన్‌ పాట బాణీలో అపూర్వ సహోదర్‌గళ్‌ చిత్రంలోని పాటను రూపొందించినట్లు తెలిపారు.

సాహిత్యం, నాటక పుస్తకాలు ఉన్నాయి గానీ, సంగీతం గురించి పుస్తకాలు లేవు మీరు సంగీతం గురించి పుస్తకాలు రాయవచ్చుగా అన్న ప్రశ్నకు బదులిస్తూ సంగీతానికీ పుస్తకాలు ఉన్నాయనీ, అయితే అవన్నీ  కాలగర్భంలో కలిసిపోయాయనీ చెప్పారు. సంగీతానికి సంబంధించి ఏ ఏ పుస్తకాలు ఉండేవో  తాను సంగీతాన్ని అందించిన ఒళియిన్‌ ఓసై చిత్రంలో చెప్పాననీ అన్నారు.

ఇకపోతే సంగీతం గురించి తనతో పాటు కూర్చుని చర్చించే ప్రతిభావంతుడు తనకింకా తారస పడలేదనీ, ఇలా అనడంతో తాను గర్విష్టినని కొందరు అనుకుంటారనీ, మరి కొందరు తన నుంచి దూరం అవుతున్నారనీ అన్నారు.అదే విధంగా సంగీతం గురించి పుస్తకం రాయాలన్న ఆలోచన తనకింత వరకూ రాలేదనీ పేర్కొన్నారు.అయినా పుస్తకాలు చదవడం ద్వారా సంగీతాన్ని అర్ధం చేసుకోవడమో, నేర్చుకోవడమో సాధ్యం కాదని ఇళయరాజా అన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top