
ఎన్టీఆర్ కోసం గజిని డైరెక్టర్
ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో నాన్నకు ప్రేమతో సినిమా షూటింగ్లో పాల్గొంటున్న ఎన్టీఆర్ తరువాత.. తమిళ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ సినిమాలో నటించబోతున్నాడని టాక్.
టాలీవుడ్ యంగ్ హీరోలు స్పీడు పెంచుతున్నారు. ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాకు రెడీ అయిపోతున్నారు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో 'నాన్నకు ప్రేమతో' సినిమా షూటింగ్లో పాల్గొంటున్న ఎన్టీఆర్.. తరువాత తను చేయబోయే సినిమా కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నాడు.
కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ తదుపరి సినిమా ఉంటుందన్న టాక్ చాలా రోజులుగా వినిపిస్తున్నా, ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రాలేదు. తాజాగా తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ ఎన్టీఆర్ కోసం ఓ కథ రెడీ చేస్తున్నాడన్న టాక్ బలంగా వినిపిస్తోంది. గతంలోనే ఈ ఇద్దరి కాంబినేషన్లో కత్తి రీమేక్ తెరకెక్కాల్సి ఉన్నా, అది వర్కవుట్ కాలేదు.
ప్రస్తుతం మురుగదాస్ ఎన్టీఆర్ కోసం ఓ కమర్షియల్ ఎంటర్టైనర్ను రెడీ చేస్తున్నాడట. ఎన్టీఆర్ మార్క్ మాస్ ఎలిమెంట్స్తో పాటు మురుగదాస్ ప్రతి సినిమాలో కనిపించే సోషల్ మెసేజ్ కూడా ఈ సినిమాలో ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు మురుగదాస్ కథా కథనాలు మాత్రమే అందిస్తున్నాడు. దర్శకత్వ బాధ్యతలను తన శిష్యుడు గోపిచంద్ మలినేనికి అప్పగించనున్నాడు.
ఎన్టీఆర్ 25వ సినిమాగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'నాన్నకు ప్రేమతో' జనవరి 8న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా తరువాత చిన్న గ్యాప్ తీసుకొని 2016 మార్చిలో సినిమాను సెట్స్ మీదకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు.