‘మా తల్లిదండ్రుల పాత్రలో ఎవరిని ఊహించలేను’

Namrata Spoke About Her Feelings For The Sanju - Sakshi

సంజయ్‌దత్‌ జీవిత చరిత్ర ఆధారంగా దర్శకుడు రాజ్‌ కుమార్‌ హిరాణీ తెరకెక్కించిన ‘సంజు’ సినిమా సూపర్‌హిట్టయిన సంగతి తెలిసింది. జూన్‌ 29న విడుదలైన ఈ చిత్రం కలెక్షన్‌ల సునామీని సృష్టిస్తూ ప్రస్తుతం 300 కోట్ల రూపాయల క్లబ్‌ వైపు దూసుకుపోతుంది. ఒకప్పటి బాలీవుడ్‌ బ్యాడ్‌బాయ్‌ సంజయ్‌ జీవతంలో ఉన్న ఎత్తుపల్లాలన్నింటిని దర్శకుడు రాజ్‌ కుమార్‌ హిరాణీ ఈ చిత్రంలో చాలా చక్కగా చూపించాడు. మున్నాబాయ్‌ జీవితంలో మత్తు పదార్ధాల దశ, పలువురు హీరోయిన్లతో అతనికి ఉన్న సంబంధాలు, అక్రమాయుధాలు కలిగి ఉన్న కేసులో జైలుకెళ్లడం వంటి పలు అంశాలను వాస్తవికంగా తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నారు.

అయితే ‘సంజు’ చిత్రంలో కేవలం సంజయ్‌ దత్‌ తండ్రి సునీల్‌ దత్‌ పాత్రకు, తల్లి నర్గీస్‌ పాత్రలకే ఎక్కువ ప్రధాన్యం ఇచ్చారని, సంజయ్‌ సోదరిమణులు నమ్రతా దత్‌, ప్రియా దత్‌లను పట్టించుకోలేదనే విమర్శలు వస్తున్నాయి. ఈ విషయం గురించి సంజయ్‌ దత్‌ సోదరి నమ్రతా దత్‌ ‘‘సంజు’ సినిమా నాకు నచ్చింది. కానీ సంజయ్‌ దత్‌ కుటుంబ సభ్యురాలిగా, సంజయ్‌కు అత్యంత ఆప్తురాలిగా సినిమాను విశ్లేషించాలంటే కాస్తా కష్టమే. ఎందుకంటే సంజయ్‌ జీవితంలో ప్రతి క్షణం నేను అతనితో పాటే ఉన్నాను. అతన్ని దగ్గరి నుంచి చూశాను’ అన్నారు.

అలానే సునీల్‌ దత్‌ పాత్రలో నటించిన పరేష్‌ రావల్‌ గురించి మాట్లాడుతూ ‘మా నాన్న చాలా ప్రత్యేకం, ఆయన పాత్రలో నేను ఎవరిని ఊహించుకోలేను. నేను ప్రేక్షకురాలిని కాదు కదా. అందుకే మా నాన్న పాత్రలో నటించిన పరేష్‌ రావల్‌కు నేను అంతగా కనెక్ట్‌ కాలేకపోయాను. అయితే పరేష్‌ రావల్‌ పాత్ర నాకు నచ్చలేదని కాదు. కానీ నేను ఆయన పాత్రకు అంతగా కనేక్ట్‌ కాలేకపోయాను అంతే. ఎందుకంటే నేను సునీల్‌ దత్‌ కూతుర్ని’. అన్నారు.

అలానే తమ తల్లి పాత్రలో నటించిన మనిషా కోయిరాల గురించి మాట్లాడుతూ ‘మా అమ్మ పాత్రకు మనీషా కోయిరాల బాగానే సరిపోయింది. కానీ సునీల్‌ దత్‌, నర్గీస్‌ల కూతురిగా వారి పాత్రలో మరొకరిని ఊహించలేను. అలానే సంజయ్‌ కుటుంబ సభ్యురాలిగా సినిమా గురించి ఎటువంటి కామెంట్‌ చేయలేను. కానీ ప్రేక్షకులు వారి వారి పాత్రలకు బాగానే కనేక్ట్‌ అయ్యారు. అది చాలా గొప్ప విషయం’ అన్నారు. సంజయ్‌ పాత్రలో రణ్‌బీర్‌ కపూర్‌ ఒదిగిపోయాడని మెచ్చుకున్నారు.

ఈ సినిమాలో తనను బాగా కదిలించిన సన్నివేశాలు సంజయ్‌ మత్తుపదార్ధాలకు బానిసవ్వడం, ఆ తర్వాత వాటి నుంచి బయటపడటానికి చేసే ప్రయత్నాలు అని తెలిపారు. ఈ విషయం గురించి ‘అది నిజంగానే చాలా కష్ట సమయం, ముఖ్యంగా మా నాన్న గారికి. కానీ సంజయ్‌కి వీటన్నింటి నుంచి బయటపడేందుకు కావాల్సిన ధైర్యం ఉంది. అందుకే మత్తు పదార్ధాల వ్యసనాన్ని జయించగలిగాడు. మళ్లీ దాన్ని పురావృతం కాకుండా చూసుకోగలిగాడు. అలానే సంజు జైలు జీవితం గడపడం కూడా చాలా కష్టమైన దశే. కానీ వీటన్నింటిని కూడా అతను ఎంతో ధైర్యంగా ఎదుర్కొగలిగాడు’ అని తెలిపింది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top