నాకిక్కడ రక్షణ లేదు

Meera Mithun Commnets on Tamil nadu Police - Sakshi

పోలీసులు లంచాలతో తప్పుడు కేసులు పెడుతున్నారు

నటి మీరామిథున్‌ ఆరోపణలు

తమిళనాడు, పెరంబూరు:  ‘నాకిక్కడ రక్షణ లేదు.. పోలీసులు లంచాలు పుచ్చుకుని నాపై తప్పుడు కేసులు పెడుతున్నారు. తాను వేరే రాష్ట్రానికి వెళ్లిపోతాను. త్వరలో రాజకీయాల్లోకి వస్తాను’ అని సంచలన వ్యాఖ్యలు చేసంది నటి మీరామిథున్‌. మోడలింగ్‌ రంగం నుంచి సినీరంగానికి పరిచయం అయిన నటి మీరామిధున్‌. అందాల పోటీల్లో విస్‌ సౌత్‌ ఇండియా కిరీటాన్ని గెలుచుకున్న ఈ అమ్మడు, ఆ తరువాత తనే సొంతంగా అందాల పోటీలను నిర్వహించడానికి సిద్ధం అయ్యి పలు విమర్శలను ఎదుర్కొనడంతో పాటు గెలుచుకున్న మిస్‌ సౌత్‌ ఇండియా కిరీటాన్ని కోల్పోయింది. అదేవిధంగా అందాల పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పి పలువురి వద్ద డబ్బు వసూలు చేసి, ఆ పోటీలను నిర్వహించకపోవడంతో ఈ అమ్మడిపై పోలీస్‌స్టేషన్‌లో పలు ఫిర్యాదులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఆ కేసులను ఎదుర్కొంటున్న నటి మీరా మిథున్‌ ఇటీవలే ముగిసిన నటుడు కమలహాసన్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించిన బిగ్‌బాస్‌ సీజన్‌ 3లో పాల్గొంది.

ఆ హౌస్‌లోనూ దర్శకుడు చేరన్‌పై ఆరోపణలు చేసి వివాదాస్పదంగా మారిన మీరామిథున్‌ తాజాగా బిగ్‌బాస్‌ రియాలిటీ గేమ్‌ షో నిర్వాహకులపై ఆరోపణలు గుప్పించింది. శనివారం సాయంత్రం చెన్నైలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఈ అమ్మడు మాట్లాడుతూ తాను బిగ్‌బాస్‌ సీజన్‌ 3లో పాల్గొని అందులోంచి బయటకు వచ్చి రెండు నెలలు కావొచ్చిందని అంది. అయినా తాను బిగ్‌బాస్‌ రియాలిటీ గేమ్‌ షోలో పాల్గొనందుకు గానూ, ఆ గేమ్‌ షో నిర్వాహకులు తనకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదని ఆరోపించింది. ఈ విషయమై విజయ్‌ టీవీ నిర్వాహ సంస్థకు వెళ్లి అడగ్గా అక్కడ ఎవరూ సరిగా బదులివ్వలేదని చెప్పింది. అది మోసపూరిత చర్యగా అనిపించిందని అంది. అదేవిధంగా తన గురించి తప్పుడు ప్రచారం చాలానే జరుగుతోందని ఆరోపించింది. మొత్తం మీద తమిళనాడులో నివశించడానికి తనకు రక్షణ లేని పరిస్థితి నెలకొందని వాపోయ్యింది. అందుకే వేరే రాష్ట్రానికి వెళ్లితేనే సురక్షితంగా జీవించగలనంది. ఇక్కడ పోలీసులు లంచం తీసుకుని తనపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆరోపించింది. కాగా  సామాజిక అవగాహన కలిగించాలనీ, అందుకోసం త్వరలోనే రాజకీయాల్లోకి రానున్నానని చెప్పింది. అయితే ఏ పార్టీలో చేరతానన్నది ఇప్పుడే చెప్పనని నటి మీరామిథున్‌ పేర్కొంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top