ప్రతి గడపలోకి వస్తున్నా

Mammootty Yatra Movie First Look In YSR Biopic - Sakshi

దివంగత మహానేత వై.ఎస్‌. రాజశేఖర్‌ రెడ్డి జీవితం ఆధారంగా ‘యాత్ర’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వైఎస్‌ పాత్రలో మలయాళ స్టార్‌ హీరో మమ్ముట్టి నటిస్తున్నారు. ‘ఆనందో బ్రహ్మ’ ఫేమ్‌ మహీ వి. రాఘవ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ‘భలే మంచి రోజు, ఆనందో బ్రహ్మ’ వంటి విజయవంతమైన చిత్రాలను అందించిన 70 ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా ఈ నెల 9న ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా వైయస్సార్‌ గెటప్‌లో ఉన్న మమ్ముట్టి మొదటి లుక్‌ని చిత్రబృందం విడుదల చేసింది.

ఫస్ట్‌ లుక్‌లో మమ్ముట్టి అచ్చం వై.ఎస్‌. లాగా ఉన్నారు. ‘కడప దాటి ప్రతీ గడపలోకి వస్తున్నాను.. మీతో కలిసి నడవాలనుంది.. మీ గుండె చప్పుడు వినాలనుంది’  అని ఫస్ట్‌ లుక్‌పై ఉన్న మాటలు సినిమాపై ఆసక్తి పెంచుతున్నాయి. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘60 రోజుల్లో 1500 కిలోమీటర్లు కాలి నడకతో ప్రతి గడపకు వెళ్లి పేదవాడి కష్టాన్ని, అక్కచెల్లెళ్ల బాధల్ని, రైతుల ఆవేదనని స్వయంగా తెలుసుకున్న మహానేత వైఎస్‌ గారు.ప్రజల కష్టాలను తీర్చి వారి హృదయాల్లో స్థానం సంపాదించిన ఏకైక నాయకుడు రాజశేఖర్‌ రెడ్డిగారు.

ఉచిత కరెంటు, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ.. లాంటి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టారాయన. అలాంటి మహానేత జీవిత చరిత్రను మేం తెరకెక్కిస్తుండటం, ఈ పాత్రలో జాతీయ అవార్డు గ్రహీత మమ్ముట్టిగారు నటిస్తుండటం చాలా సంతోషంగా ఉంది. వైఎస్‌గారి రియల్‌ పాదయాత్ర 2003 ఏప్రిల్‌ 9న ప్రారంభమైంది. రీల్‌ పాదయాత్ర ఈ నెల 9న ప్రారంభం అవుతోంది. ఈ చిత్రంలో కొన్ని కీలక సన్నివేశాల్లో వై.ఎస్‌గారి తండ్రి రాజారెడ్డిగారి, తనయుడు జగన్‌ మోహన్‌రెడ్డిగారి పాత్రలు కనిపిస్తాయి’’ అన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: శివ మేక.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top