నటుడు కెప్టెన్‌ రాజు కన్నుమూత

Kerala actor Captain Raju dead - Sakshi

మలయాళ నటుడు కెప్టెన్‌ రాజు (68) సోమవారం ఉదయం కేరళ రాష్ట్రం కొచ్చిలో కన్నుమూశారు. మెదడుకు సంబంధించిన సమస్యతో బాధపడుతున్న కెప్టెన్‌ రాజు ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి న్యూయార్క్‌కు విమానంలో వెళ్తుండగా గుండెపోటుకు గురయ్యారు. విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్‌ చేసి, మస్కట్‌లోని ఓ ఆస్పత్రిలో ఆయన్ను చేర్చారు. అక్కడ ప్రథమ చికిత్స పొందిన కెప్టెన్‌ రాజు అనంతరం కొచ్చిలోని ఆస్పత్రిలో చేరి వైద్య చికిత్స పొందారు. సోమవారం అనారోగ్యానికి గురై తుదిశ్వాస విడిచారు. మొదట్లో భారత సైనిక దళంలో సేవలందించారు. రిటైర్‌మెంట్‌ తర్వాత నటనపై ఆసక్తితో సినిమాల్లోకి వచ్చారు. తొలిసారిగా 1981లో ‘రక్తం’ అనే మలయాళ చిత్రంలో నటించారు. అనంతరం మలయాళంతో పాటు తమిళం, తెలుగు, హిందీ భాషల్లో నటించారు.

తెలుగులో ‘శత్రువు, కొండపల్లి రాజా, రౌడీ అల్లుడు, జైలర్‌గారి అబ్బాయి’ తదితర చిత్రాల్లో నటించారు. తమిళంలో రజనీకాంత్‌ హీరోగా నటించిన ధర్మత్తిన్‌ తలైవన్, కమలహాసన్‌ నటించిన సూరసంహారం, శివాజీ గణేశన్, సత్యరాజ్‌ నటించిన జల్లికట్టు తదితర 20 చిత్రాల్లో నటించారు. అన్ని భాషల్లో 500 చిత్రాలకు పైగా నటించారు. ప్రతినాయకుడి పాత్రల్లో నటించి ప్రాచుర్యం పొందారు.  మలయాళంలో ‘ఒరు స్నేహగథా’ (1997)తో దర్శకుడిగా మారారు. అనంతరం ‘పవనాయి 99.99’ (2012) చిత్రానికి దర్శకత్వ వహించడమే కాక ఆ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించారు. కెప్టెన్‌ రాజుకు భార్య ప్రమీల, కుమారుడు రవిరాజ్‌ ఉన్నారు. ఆయన మృతికి పలువురు చిత్రరంగ ప్రముఖులు సంతాపం తెలిపారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top