
అభిమాని భౌతికకాయం వద్ద కార్తీ(ఫొటో కర్టెసీ: ఇండియా టుడే)
చెన్నై : అభిమాని మరణాన్ని తట్టుకోలేక తమిళ హీరో కార్తీ కన్నీటి పర్యంతమయ్యాడు. అతడి భౌతిక కాయాన్ని చూసి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. డైరెక్టర్ అవ్వాలన్న ఆశయంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కార్తీ యుగానికొక్కడు సినిమాతో హీరోగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆవారా, నా పేరు శివ, శకుని వంటి సినిమాలతో నటుడిగా గుర్తింపు పొంది.. ఎంతో మంది అభిమానం చూరగొన్నాడు. ప్రస్తుతం తన అన్న, హీరో సూర్య భార్య జ్యోతికతో కలిసి కార్తీ నటించిన తంబి(తెలుగులో దొంగ) సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో శనివారం ఈ సినిమా ఆడియో లాంచ్ కార్యక్రమం సత్యం సినిమాస్‌లో ఘనంగా జరిగింది. అయితే ఈ వేడుకకు హాజరు కావడానికి ముందే కార్తీకి తన వీరాభిమాని వ్యాసై నిత్య మరణించాడనే చేదు వార్త తెలిసింది. కార్తీ మక్కల్ నాలా మండ్రం పేరిట ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహించిన వ్యాసై అంటే కార్తీకి కూడా ఎంతో అభిమానం.
కాగా శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యాసై మరణించడంతో కార్తీ.. అతడి భౌతిక కాయానికి నివాళులు అర్పించాడు. అతడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపాడు. అనంతరం తంబి సినిమా ఆడియో లాంచ్‌కు హాజరై వేదిక మీద ఈ విషయాన్ని అభిమానులకు తెలిపి మౌనం పాటించాల్సిందిగా కోరాడు. ఇక కార్తీ తన అభిమానులతో సరదాగా ఉంటాడన్న సంగతి తెలిసిందే. అభిమానుల కుటుంబాల్లో జరిగే శుభకార్యాలకు కూడా తరచుగా హాజరవుతూ వారి మనసును గెలుచుకుంటాడు.