ఫోన్‌ స్విచ్చాఫ్‌.. దేవుడా ఆమెను ఏమైనా చేశారా?

Hrithik Roshan sister Sunaina phone is off, tweets Rangoli - Sakshi

ముంబై: బాలీవుడ్‌ నటుడు హృతిక్‌ రోషన్‌ సోదరి సునయన వ్యవహారంలో నటి కంగనా రనౌత్‌ సోదరి రంగోలీ చందేల్‌ వరుస ట్వీట్లు చేస్తున్నారు. ముస్లిం వ్యక్తిని ప్రేమించినందుకు తనను తండ్రి రాకేశ్‌ రోషన్‌, సోదరుడు హృతిక్‌ రోషన్‌ హింసిస్తూ కొడుతున్నారని సునయన ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఆమె గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ తాజాగా రంగోలీ ట్వీట్లు చేశారు. ప్రస్తుతం సునయన ఫోన్‌ స్విచ్చాఫ్‌ వస్తోందని, ఆమెను సంప్రదించడానికి ఎంత ప్రయత్నించినా కుదరడం లేదని రంగోలీ తన ట్వీట్‌లో ఆందోళన వ్యక్తం చేశారు. ‘దేవుడా.. ఆమెకు వాళ్లు (రాకేశ్‌, హృతిక్‌) ఏదైనా కీడు తలపెట్టారా? ఏమైనా చేశారా? ఆమె గురించి తలుచుకుంటే చాలా భయంగా ఉంది’ అని రంగోలీ పేర్కొన్నారు.
(చదవండి: మా తమ్ముడు కూడా వేధిస్తున్నాడు : హృతిక్‌ సోదరి)

తన ఇంట్లో ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటే.. సునయన పోలీసులను ఆశ్రయించాలి? కానీ, ఇలా సొంత కుటుంబసభ్యులపై ఆరోపణలు చేయవద్దంటూ సినీ ట్రేడ్‌ అనలిస్ట్‌ సుమిత్‌ కదేల్‌ వ్యాఖ్యానించగా.. దీనికి స్పందనగా ఆమె ఈమేరకు ట్వీట్లు చేశారు.  సునయన కుటుంబసభ్యుల మీద ఆధారపడుతూ.. వారి ఇంట్లో ఉందని,  వారికి వ్యతిరేకంగా పోలీసులను ఆశ్రయించడం అంత సులభం కాదని, పైగా పోలీసులతో రాకేశ్‌ రోషన్‌కు మంచి సంబంధాలు ఉన్నాయని తెలిపారు. కంగనా వారిని సమర్థంగా ఎదుర్కోగలిగింది కానీ, 16 ఏళ్ల వయస్సులోనే పెళ్లి చేసుకొని.. పెద్దగా చదువుకోకుండా కుటుంబసభ్యుల మీద ఆధారపడిన సునయన వారిని ఎదుర్కోలేదని రంగోలి పేర్కొన్నారు. 

సునయన రోషన్‌ తన ఇంట్లోనే వేధింపులకు గురవుతున్నారంటూ రంగోలి ఇంతకుముందు కూడా వరుస ట్వీట్లు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ వెబ్‌సైట్‌తో మాట్లాడిన సునయన.. ‘ ఎప్పటిలాగానే నరకంలో జీవిస్తున్నా. రంగోలి ట్వీట్లు చదివాను. ఆమె చెప్పినవన్నీ నిజాలే. తన ద్వారానైనా నాకు సంబంధించిన విషయాలు బయటకు వచ్చాయి. నేను ఈరోజు కంగనా, రంగోలీలను కలుస్తున్నాను. వారు మాత్రమే నాకు న్యాయం చేయగలరు’ అని పేర్కొన్నారు.

తన ప్రేమ విషయం గురించి మాట్లాడుతూ..‘ గతేడాది రుహైల్‌ అమీన్‌ అనే వ్యక్తితో ప్రేమలో పడ్డాను. కానీ అతడు ముస్లిం అన్న కారణంగా మా నాన్న మా రిలేషన్‌షిప్‌ను అంగీకరించలేదు. నన్ను తీవ్రంగా కొట్టారు. అతడు ఒక ఉగ్రవాది అతడిని పెళ్లి చేసుకుంటావా అంటూ హింసించారు. తను ఒక జర్నలిస్టు అని చెప్పినా వినలేదు. ఈ విషయంలో హృతిక్‌ కూడా నాకు సహాయం చేయలేదు. తను కూడా నన్ను వేధిస్తున్నాడు. రుహైల్‌తో ప్రేమ అతడికి ఇష్టం లేదు. మా నాన్న గైడెన్స్‌లో తను కూడా ఆయన లాగే ప్రవర్తిస్తున్నాడు. నా పరిస్థితిని అర్థం చేసుకోవడం లేదు. ఇంట్లో వాళ్లంతా నన్ను తీవ్రంగా వేధిస్తున్నారు అని కుటుంబ సభ్యులపై సునయన సంచలన ఆరోపణలు చేశారు. కాగా గతంలో హృతిక్‌- కంగనాల మధ్య విభేదాలు తలెత్తిన సమయంలో సునయన కంగనాకు మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top