నవ్వులు వెలవెలపోయాయి

Comedy legend Crazy Mohan passes away - Sakshi

తమిళ రచయిత క్రేజీ మోహన్‌ మృతి

తమిళ నాటక రచయిత, హాస్యనటుడు, డైలాగ్‌ రైటర్‌ ‘క్రేజీ’ మోహన్‌ సోమవారం తుది శ్వాస విడిచారు. గుండెపోటు రావడంతో చెన్నైలో ఓ ప్రముఖ ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. 1952 అక్టోబర్‌ 16న జన్మించిన ‘క్రేజీ’ మోహన్‌ అసలు పేరు మోహన్‌ రంగాచారి. కాలేజీ రోజుల్లో నుంచే నాటకాలు రాసి, అందులో నటిస్తుండేవారు. అలా రాసిన ‘గ్రేట్‌ బ్యాంక్‌ రోబరీ’ స్కిట్‌కు ఉత్తమ రచయితగా, ఉత్తమనటుడు అవార్డ్‌ను కమల్‌హాసన్‌ చేతులమీదుగా అందుకున్నారు.

ఆయన రాసిన మొదటి నాటకం ‘క్రేజీ థీవ్స్‌ ఇన్‌ పాలవాక్కమ్‌’. ఈ నాటకం సూపర్‌ హిట్‌ అవ్వడమే కాకుండా మోహన్‌ రంగాచారిని, ‘క్రేజీ’ మోహన్‌గా మార్చింది. ఈ నాటకం ఆధారంగా ఓ టీవీ సీరియల్‌ కూడా స్టార్ట్‌ చేశారు. తమ్ముడు మధు బాలాజీ డ్రామా ట్రూప్‌కు ఎక్కువగా నాటకాలు రాసేవారు మోహన్‌. వేరే ప్రొడక్షన్స్‌ వాళ్లకు చాలా నాటకాలు రాసిన తర్వాత 1979లో సొంతంగా ఓ ప్రొడక్షన్‌  హౌస్‌ను స్థాపించి, దానికి ‘క్రేజీ క్రియేషన్స్‌’ అని నామకరణం చేశారు.

30కి పైగా నాటకాలు, 6,500 స్టేజిషోలు చేశారు. మోహన్‌ నాటకాల్లో వాళ్ల అన్నయ్య మధు బాలాజీ హీరోగా నటించేవారు. ‘క్రేజీ’ మోహన్‌ రచించిన ‘మ్యారేజెస్‌ ఆర్‌ మేడిన్‌ సెలూన్‌’ నాటకం ఆధారంగా కె. బాలచందర్‌ ‘పోయికల్‌ కుదిరై’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాతో డైలాగ్‌ రైటర్‌గా సినిమాల్లోకి ప్రవేశించారు మోహన్‌. ఆ తర్వాత తమిళంలో సూపర్‌ హిట్‌ కామెడీ సినిమాలకు తనవంతు మాటల సాయం చేశారాయన. ‘క్రేజీ’ మోహన్‌ ఎక్కువగా కమల్‌ హాసన్‌తో పనిచేశారు.

‘సతీ లీలావతి, కాదలా కాదలా (నవ్వండి లవ్వండి), మైఖేల్‌ మదన కామరాజు, విచిత్రసోదరులు, ఇంద్రన్‌ చంద్రన్‌ (ఇంద్రుడు–చంద్రుడు), భారతీయుడు, భామనే సత్యభామనే, తెనాలి, పంచతంత్రం, వసూల్‌ రాజా ఎంబీబీఎస్‌’ వంటి సినిమాలకు కలసి పనిచేశారు. ‘అరుణాచలం, రక్షకుడు’ సినిమా చేశారు. నటుడిగా కమల్‌హాసన్‌ సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లోనూ మెరిశారు మోహన్‌. తమిళనాడు రాష్ట్రప్రభుత్వం ‘క్రేజీ’మోహన్‌ను ‘కలైమామణి’ అవార్డుతో సత్కరించింది. ఆయన మృతికి పలువురు సినీప్రముఖులు సంతాపం తెలిపారు.

‘‘స్నేహానికి అంతం అనేదే ఉండదు. మనిషి బతికి ఉంటేనే స్నేహం ఉంటుందా? మోహన్‌ కామెడీ ఆయన సినిమాల ద్వారా ఆయన అభిమానులలో నిలిచే ఉంటుంది. మోహన్‌లోనాకు బాగా నచ్చే క్వాలిటీ ఆయన చిన్నపిల్లాడిలాంటి మనస్తత్వం. అందరికీ ఉండేది కాదది. ‘క్రేజీ’ అనే టైటిల్‌ అతనికి సూట్‌ కాదు. అతనో ‘కామెడీ జీనియస్‌’’ అని పేర్కొన్నారు కమల్‌ హాసన్‌.

 
కమల్‌ హాసన్, మోహన్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top