ఓటమి అనేది సంఘటన మాత్రమే

Anupam Kher completes 36 years in film industry - Sakshi

‘‘36 ఏళ్ల క్రితం సిమ్లా నుండి ఎన్నో ఆశలతో ముంౖబైలో అడుగుపెట్టాను. నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ డ్రామాలో శిక్షణ తీసుకుని, ప్రపంచ సాహిత్యాన్ని చదువుకుని ఎంతో ఆత్మవిశ్వాసంతో సినిమా ప్రపంచంలోకి వచ్చాను. నా మొదటి సినిమా ‘సారాన్ష్‌’ (1984)లో నటించినప్పుడు నా వయసు 29. ఆ చిత్రంలో నేను చేసిన తండ్రి పాత్ర వయసు 65’’ అని అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు ప్రముఖ హిందీ నటుడు అనుపమ్‌ ఖేర్‌.

ఆయన వయసు ప్రస్తుతం 65. కెరీర్‌ ప్రారంభించినప్పటి విశేషాలను అనుపమ్‌ ఖేర్‌ చెబుతూ – ‘‘36 ఏళ్ల క్రితం బాలీవుడ్‌కు ఎన్నో కలలను మోసుకొని వచ్చాను. నా మొదటి సినిమా చేసినప్పుడు చాలామంది నాతో ‘అంత పెద్ద వయసున్న పాత్ర చేయటం వల్ల నీ జీవితం సర్వనాశనం కావడం ఖాయం’ అన్నారు. వాళ్లు అన్నట్లుగానే ఆ సినిమా అంతగా ఆడలేదు. వాళ్లు అన్న మాటలను పట్టించుకుని నేను నిరాశపడి ఉంటే ఈ రోజు అనుపమ్‌ ఖేర్‌ ఉండేవాడు కాదు. నా చిన్నప్పుడు మా నాన్న ఎప్పుడూ ఓ మాట చెప్పేవారు. అదేంటంటే..  ఓటమి అనేది జీవితంలో ఓ సంఘటన మాత్రమే.

జీవితమే ఓటమి కాదు అని. ఆ మాటను నేనెప్పుడూ గుర్తు పెట్టుకుంటాను. ‘సారాన్ష్‌’ తర్వాత రెండున్నరేళ్లకు తొలి విజయం వచ్చింది. కష్టాలు వచ్చినా నవ్వుతూ దిగమింగేవాడిని కానీ నిరాశకు లోనయ్యేవాడిని కాదు. రాజ్‌కపూర్‌ సాబ్, అమితాబ్‌గారు, రాబర్ట్‌ డి నిరో లాంటి నటులతో పని చే సినందుకు ఎంతో గర్వంగా ఉంటుంది. ఓ 515 చిత్రాలు చేసిన తర్వాత కొత్తగా నిరూపించుకోవటానికి ఏముంటుంది? కానీ కెమెరా ముందుకు వెళ్లిన ప్రతిసారీ  ‘మనం న్యూకమర్‌’ అనుకుని పనిచేస్తాను. అది వృత్తిపరంగా నాకెంతో తృప్తినిస్తుంది’’ అన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top