
ఫ్యాన్స్‌కి స్వీట్ షాకివ్వాలని దీప్‌వీర్ (దీపికా పదుకోన్, రణ్‌వీర్ సింగ్) ఫిక్సయినట్లున్నారు. ఇటలీలో చేసుకున్న పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫొటోలను ఒకేసారి కాకుండా కొన్ని కొన్నిగా రిలీజ్ చేస్తున్నారు. నిజానికి ఈ జోడీ అధికారికంగా పెళ్లి ఫొటోలు విడుదల చేసేవరకూ ఒక్క ఫొటో కూడా బయటికి రాలేదు. అంత సెక్యూర్టీ ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు తమంతట తాము ‘ఫొటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్’ అన్నట్లు సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తున్నారు.
మెహందీ వేడుక అప్పుడు దిగిన ఫొటోలు, పెళ్లిలో దీపికా నుదుట రణ్‌వీర్ బొట్టు పెడుతుంటే, భర్తకు ఆమె పెడుతున్న ఫొటో, ఆత్మీయంగా రణ్‌వీర్‌కి దీపిక తినిపిస్తున్న ఫొటో.. ఇలా అన్ని దృశ్యాలూ చూడముచ్చటగా ఉన్నాయి. మంగళవారం ఈ జంట బెంగళూరు చేరుకుంది. నేడు అక్కడ పెళ్లి రిసెప్షన్ జరుగుతుంది. ఈ నెల 28న ముంబైలో మరో రిసెప్షన్ ఏర్పాటు చేశారు.