టీబీఎస్‌ సంస్థది భారీ కుంభకోణం

TBS company Rs.450 crore scam - Sakshi

ప్రజల సొమ్ము అప్పనంగా దోచుకున్నారు 

పెద్ద పరికరాలన్నీ మూలకు... 

సంస్థ దోచుకున్నది కక్కిస్తాం 

కర్నూలు ఎంపీ  డాక్టర్‌ సంజీవకుమార్‌

సాక్షి,కర్నూలు(హాస్పిటల్‌): వైద్యపరికరాలు మరమ్మతులు చేయకుండా రూ.450 కోట్ల ప్రజల సొమ్మును  టీబీఎస్‌ సంస్థ అప్పనంగా దోచుకుందని కర్నూలు పార్లమెంటు సభ్యుడు డాక్టర్‌ ఎస్‌. సంజీవకుమార్‌ అన్నారు. దోచుకున్న ఆ సొమ్మును ఆ సంస్థ నుంచి  రికవరీ చేయిస్తామని  చెప్పారు. ‘టీబీఎస్‌ నిర్వహణ తుస్‌’ అనే శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించి సోమవారం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల తనిఖీ చేశారు. ముందుగా రేడియాలజీ విభాగంలోని మూలనపడ్డ ఎక్స్‌రే యూనిట్లను పరిశీలించారు.

మొత్తం పది యూనిట్లు పనిచేయడం లేదని, ఈ విషయాన్ని టీబీఎస్‌ సంస్థకు చెప్పినా పట్టించుకోవడం లేదని రేడియాలజీ హెచ్‌ఓడీ డాక్టర్‌ గఫూర్‌ ఎంపీకి చెప్పారు. ఈ విభాగంలో సిబ్బంది సంఖ్య కూడా తక్కువగా ఉందని చీఫ్‌ రేడియోగ్రాఫర్‌ కృష్ణమూర్తి విన్నవించారు. ఒకవైపు ఎక్స్‌రే యూనిట్లు పనిచేయకపోవడం, మరోవైపు సిబ్బంది తక్కువగా ఉండటంతో అధిక భారం పడుతోందన్నారు. అనంతరం ఆయన ఏఎంసీ విభాగాన్ని పరిశీలించారు.

అనారోగ్యంతో బాధపడుతున్న గోనెగండ్ల మండలం గంజిహళ్లి గ్రామానికి చెందిన బడేసాహెబ్‌ను పరామర్శించారు. ఏఎంసీలో ఎన్ని వెంటిలేటర్లు పనిచేస్తున్నాయని ఆరా తీశారు.  పడకల సంఖ్య తక్కువగా ఉండటంతో రోగులకు ఇబ్బందిగా ఉందని, ఈ మేరకు పాత గైనిక్‌ విభాగంలో ఏఎంసీ, క్యాజువాలిటీ నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ పి. చంద్రశేఖర్‌ వివరించారు.  

విద్యుత్‌ అంతరాయంపై ఆగ్రహం 
ఎంపీ సంజీవ్‌కుమార్‌ మేల్‌ పోస్టు ఆపరేటివ్‌ వార్డును సందర్శించారు. ఆ సమయంలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయి ఆపరేషన్‌ చేయించుకున్న రోగులు ఇబ్బందులు పడుతుండటాన్ని చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే విద్యుత్‌ సరఫరా లేక పది మందికి ఆపరేషన్లు ఆగిపోయాయని తెలుసుకుని ఆపరేషన్‌ థియేటర్లు పరిశీలించారు. ఆసుపత్రిలో ట్రాన్స్‌ఫార్మర్‌ బ్రేక్‌డౌన్‌ అయ్యిందని, త్వరలో పునరుద్ధరిస్తామని అధికారులు వివరణ ఇచ్చారు.

కాగా ఆపరేషన్‌ థియేటర్‌కు జనరేటర్‌ లేకపోతే ఎలాగని, ఆపరేషన్‌ చేసే సమయంలో విద్యుత్‌ సరఫరా ఆగిపోతే పరిస్థితి ఏమిటని అధికారులను ఎంపీ ప్రశ్నించారు. ఆ సమయంలో ఏఈ వెంకటేష్, టీబీఎస్‌ సంస్థ ప్రతినిధులు రాకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. టీబీఎస్‌లో అనర్హులతో పనిచేయిస్తున్నారని, మొత్తం ఇప్పటి వరకు ఎన్ని పరికరాలు రిపేర్‌ చేశారు, ఎన్ని ఉన్నాయో, మీ ఎంఓయు తదితర వివరాలు తీసుకుని రావాలని ఆలస్యంగా వచ్చిన ఆ సంస్థ ప్రతినిధిని ఆదేశించారు.  

రైతు ఆత్మహత్యలపై ఆవేదన
అనంతరం పోస్టుమార్టం వద్ద సి.బెళగల్‌ మండలం పోల్‌కల్‌ గ్రామానికి చెందిన రైతు లాజర్‌ (35) మృతదేహాన్ని సందర్శించి, అతని కుటుంబ సభ్యులను పరామర్శించారు. పశ్చిమ ప్రాంతానికి నీటి కేటాయింపులు న్యాయబద్ధంగా జరగలేదని, అందుకే రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.  పశ్చిమ ప్రాంతంలో రైతుల ఆత్మహత్యలు ఆగాలంటే 20 టీఎంసీల నీరు నిల్వ చేసే రిజర్వాయర్లు నిర్మించాల్సిన అవసరం ఉందని చెప్పారు. 

నాసిరకంగా నిర్మాణ పనులు 
ఆసుపత్రిలోని మేల్‌ పోస్టు ఆపరేటివ్‌ వార్డులో వేసిన టైల్స్‌ కుంగిపోయి ఉండటంపై ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాది క్రితమే వేసిన టైల్స్‌ ఎలా కుంగిపోతాయని, మీ ఇంట్లో కూడా ఇలాగే వేసుకుంటారా అని ఇంజినీరింగ్‌ అధికారులను ప్రశ్నించారు. బండలు వేసేటప్పుడు ప్రాథమిక సూత్రాలు కూడా పాటించినట్లుగా లేదని మండిపడ్డారు. నిబంధనల ప్రకారమే వేశామని డీఈ రాజగోపాల్‌రెడ్డి చెప్పేందుకు ప్రయత్నించగా ఆ మాటకు కట్టుబడి ఉండండి, దీనిపై నేను లోతుగా పరిశీలిస్తానని చురకలంటించారు.   

Read latest Kurnool News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top