ఆదివాసీ ఆచారాలతోనే..

జాతరను గౌరవంగా జరుపుకోవాలి

పూజారుల మనోభావాలను కాపాడాలి

పూజారుల సంఘం అధ్యక్షుడు జగ్గారావు

ఎస్‌ఎస్‌ తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మ జాతరను ఆదివాసీ ఆచారాలతోనే భక్తులు గౌరవంగా జరుపుకోవాలని పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు అన్నారు. జాతరలో ఆధునిక టెక్నాలాజీ అందుబాటులోకి తీసుకువచ్చినప్పటికీ ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు, కట్టుబాట్లతోనే   జాతర నిర్వహించడం జరుగుతుందన్నారు. వనదేవతలపై ఉన్న నమ్మకం, విశ్వాసంతో జాతరకు కోటి మంది భక్తులు తరలివస్తున్నారన్నారు. భక్తులకు ప్రశాంతమైన దర్శనం కల్పించేందుకు అధికార యంత్రాంగం కృషి చేయాలని తెలిపారు. జాతరలో భక్తులు, అధికారులు, ప్రజలు పాటించాల్సిన సమన్వయంపై ఆయన ‘సాక్షి’తో ముచ్చటించారు. వివరాలు ఆయన మాటల్లోనే..

తొక్కిసలాటకు గురికావొద్దు..
జాతర సమయంలో కన్నెపల్లి నుంచి సారలమ్మ, మేడారం చిలుకలగుట్ట నుంచి సమ్మక్క దేవతలను తీసుకువచ్చేటప్పుడు భక్తులు దూరం నుంచి దేవతలను తనవితీరా చూడాలి. కాని ఆరాటంతో రోడ్లపై వచ్చి తొక్కిసలాటకు గురికావొద్దు. పోలీసులు పనిభారంతో భక్తులపై దురుసుగా ప్రవర్తించొద్దు. గద్దెల వద్ద భక్తులకు అధికారులు సహకరించాలి. 

మనోభావాలు దెబ్బతీయొద్దు
సమ్మక్క సారలమ్మ జాతర అంటేనే ఆదివాసీ సంస్కృతి, ఆచారాల మధ్య సాగుతుంది. ఆచారాలను భక్తులు, అధికారులు గౌరవించాలి. ఆచార పద్ధతి ప్రకారం జాతర నిర్వహించడం వల్లే రాష్ట్రాలు, దేశాల నుంచి భక్తులకు దేవతల చల్లని చూపుల కోసం వ్యయప్రయాసలకోర్చి మేడారం తరలివస్తున్నారు. పూజారుల మనోభావాలను దెబ్బతీయొద్దు. 

అధికారులను గౌరవించాలి..
జాతరలో భక్తులకు సేవలందించే అధికారులకు తల్లుల దీవెనలు ఉంటాయి. కోట్లమంది భక్తజనంలో నాలుగు రోజులు 24 గంటల పాటు ఓపికగా భక్తులకు సేవలందించడం.. అధికారుల పనితనం చాలా గొప్పది. జాతరలో సేవలందించే అధికారులను భక్తులు ఎంతో గౌరవంగా చూడాలి. భక్తులు అధికారుల సూచనలను పాటించి ప్రశాతంగా అమ్మలను దర్శించుకోవాలి. 

ఫ్రెండ్లీగా పనిచేస్తాం.. 
జాతరలో భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, ఇబ్బందులు కలగకుండా పోలీసులు, అధికారులు ఆదివాసీలు, పూజారులందరం ప్రెండ్లీగా పని చేసి జాతరను సక్సెస్‌ చేసేందుకు కృషి చేస్తాం. జాతరలో విధులు పనిచేసే అధికారులతో మర్యాదపూర్వకంగా మెదలాలి. ఆదివాసీ యువకులకు, సంఘాల నాయకులకు పూజా రుల సంఘం తరఫున కోరినాం. జాతరలో ఎన్నో ఇబ్బందులు తట్టుకుని భక్తుల భద్రత, సేవల కోసం పని చేసే అధికారుల మనసు నొప్పించకుండా జాతరను విజయవంతం చేసి ప్రభుత్వం నుంచి ప్రశంసలు పొందాలని పూజారుల సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తున్నా.  

Read latest Jayashankar News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top