
దావోస్: వాన రాకడ, ప్రాణం పోకడ తెలుసుకోలేమని అంటారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చాక వాతావరణాన్ని కచ్చితంగా అంచనా వేయడానికి ప్రయత్నాలైతే సాగుతున్నాయి. అయితే ఈ అంచనాలు ఎంతవరకు నిజమవుతాయన్న దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గ్లోబల్ వార్మింగ్ పరిస్థితుల నేపథ్యంలో వాతావరణ శాస్త్రం పట్ల సగానికి సగం దేశాలు విశ్వాసం కోల్పోతున్నట్టు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) తాజా సర్వేలో వెల్లడైంది. అయితే భారతీయులు మాత్రం వాతావరణ శాస్త్రం పట్ల అత్యంత విశ్వాసంతో ఉన్నారు. ఈ శాస్త్రాన్ని నమ్మిన దేశాల్లో భారత్ మొదటి స్థానంలో ఉంటే, బంగ్లాదేశ్ రెండో స్థానంలో ఉన్నాయి. ఇక గ్లోబల్ వార్మింగ్ పరిస్థితులకు మానవ కార్యకలాపాలే కారణమని అత్యధికులు నిందిస్తున్నట్టు డబ్ల్యూఈఎఫ్ సర్వే వెల్లడించింది.
సర్వే ఇలా..: శాప్, క్వాలట్రిక్స్ సంస్థలతో కలిసి వరల్డ్ ఎకానమిక్ ఫోరం ఈ సర్వే నిర్వహించింది. మొత్తం 30 దేశాల్లో, 10,500 మందిని ప్రశ్నించింది. ప్రపంచ ఆర్థిక సమాఖ్య 50వ వార్షిక సదస్సుని పురస్కరించుకొని ఈ అధ్యయనం చేసింది. సమైక్య ప్రపంచం దిశగా నివేదికలో అమెరికా, దక్షిణాసియా మినహా మిగిలిన ప్రాంతాల ప్రజలు నాణ్యమైన విద్య ఎండమావిగా మారిందని అభిప్రాయపడ్డారు. చాలా దేశాల్లో విద్యావిధానం, విద్యార్థులకు ఇచ్చే శిక్షణ వారిని నిపుణులుగా తీర్చిదిద్దడం లేదన్న అభిప్రాయాలే వ్యక్తమయ్యాయి.
చేయి చేయి కలపాలి: డబ్ల్యూఈఎఫ్
వాతావరణంలో వస్తున్న అనూహ్య మార్పుల కారణంగా ఆర్థికంగా, సామాజికంగా పడుతున్న తీవ్రమైన ఒత్తిళ్లను ఎదుర్కోవడానికి ప్రపంచదేశాల్లో అన్ని వర్గాలు చేయి చేయి కలపాల్సిన అవసరం ఉందని డబ్ల్యూఈఎఫ్‌పేర్కొంది. ప్రభుత్వాలు,పారిశ్రామిక వర్గాలు, శాస్త్రవేత్తలు, స్వచ్ఛంద సంస్థలు కలసికట్టుగా ఈ సవాళ్లను ఎదుర్కోవాలని తెలిపింది.