మన చుట్టే గ్రహాంతర వాసులు!

We are surrounded by Aliens - Sakshi

ఈ విశాల విశ్వంలో మనిషి లాంటి బుద్ధిజీవి ఒక్కరే ఉన్నారా? కాదంటున్నారు సిల్వానో కొలంబానో! మన చుట్టే  గ్రహాంతర వాసులు ఉన్నారంటున్నారు.అదెలా... టెక్నాలజీ ఇంత అభివృద్ధి చెందినా.. వాళ్లు మన కళ్లు ఎలా కప్పగలిగారు?

చాలా సింపుల్‌. వాళ్లు ఇప్పటివరకూ మనం ఊహించినట్టు... కథల్లో సినిమాల్లో చూపినట్లు చిత్రవిచిత్రమైన ఆకారాల్లో లేకపోవడమే అంటారు నాసా ఇంటెలిజెంట్‌ సిస్టమ్‌ డివిజన్‌లో పనిచేస్తున్న కొలంబానో! అర్థం కావడం లేదా? కొంచెం వివరంగా తెలుసుకుందాం. మనిషి వ్యవసాయం చేయటం మొదలుపెట్టి ఓ పది వేల ఏళ్లు అవుతోందని అంచనా. ఆ తరువాత గత 500 ఏళ్లలో సైన్స్‌ కూడా బాగా అభివృద్ధి చెందింది. గ్రహాలను చూడగలుగుతున్నాం. వాటితో మనకున్న దూరాలను లెక్కకట్టగలుగుతున్నాం. అవెలా ఉన్నాయో... వాటిల్లో ఏ రకమైన వనరులున్నాయో కూడా అంచనా వేయగలుగుతున్నాం. అయినప్పటికీ కథల్లో, సినిమాల్లో కూడా గ్రహాంతర వాసి అనగానే మన కళ్లముందు.. చారడేసి కళ్లేసుకుని.. పచ్చటి ఒళ్లుతో కాళ్లు చేతుల్లాంటి ఆకారాలు మాత్రమే మెదులుతాయి! సపోజ్‌.. ఫర్‌ సపోజ్‌... ఆ గ్రహాంతర జీవులు ఇలా ఉండకపోతే? కంటికి కనిపించని సైజులో, రీతిలో ఉండి ఉంటే? మనం అస్సలు చూడలేం. కొలంబానో చెబుతున్న లాజిక్‌ కూడా ఇదే. 

యూఎఫ్‌ఓలనూ పట్టించుకోలేదు.. 
గ్రహాంతర వాసుల అంతరిక్ష నౌకలుగా చెప్పుకునే యూఎఫ్‌వోల గురించి శాస్త్రవేత్తలు పెద్దగా పట్టించుకోకపోవడం.. చాలా సందర్భాల్లో వాటిని కొట్టిపారేయడం కూడా గ్రహాంతర జీవుల వెతుకులాటలో ఒక అవరోధంగా చూడాలని కొలంబానో అంటారు. సుదూర అంతరిక్షం నుంచి అందే కొన్ని రకాల రేడియో తరంగ సంకేతాలను ఉపయోగించుకుని శాస్త్రవేత్తలు ఈ విశ్వ నిర్మాణం.. పరిణామాల గురించి మరింత స్పష్టమైన అవగాహన పెంచుకోవాలని కొలంబానో  సూచించారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే.. గ్రహాంతర వాసులను చూసే దృష్టి మారాలన్నమాట! 

మనచుట్టూ వాళ్లే!
కొలంబానో చెప్పింది నిజం అని అనుకుంటే గ్రహాంతర జీవులు ఈ క్షణంలోనూ మన చుట్టూ తిరుగుతూ ఉండాలి. మనలాగే వాళ్లూ కర్బన ఆధారిత జీవాలై ఉంటారని.. మనిషి ఊహకు అందని టెక్నాలజీ, గ్రహాంతర ప్రయాణ సామర్థ్యాలు కలి గి ఉంటారని ఆయన అంచనా. దశాబ్దాలుగా మనిషి అంతరిక్షంలోకి కొన్ని సంకేతాలు, గుర్తులు పంపుతున్నా.. సెర్చ్‌ ఫర్‌ ఎక్‌స్ట్రా టెరస్ట్రియల్‌ ఇంటెలిజెన్స్‌ (సెటీ) పేరుతో రేడియో తరంగాలను ప్రసారం చేస్తున్నా.. ఇప్పటికీ ఎలాంటి ప్రత్యుత్తరంలేని నేపథ్యంలో కొలంబానో ఈ కొత్త ప్రతిపాదన చేస్తున్నారు. దీనిపై ఆయన రాసిన పరిశోధన వ్యాసంపై మార్చిలో చర్చ చేపట్టనున్నారు. గ్రహాంతర వాసులను వెతికే ప్రయత్నం చేస్తున్న శాస్త్రవేత్తలు మనం అభివృద్ధి చేసిన టెక్నాలజీలపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారని.. ఫలితంగా గ్రహాంతర జీవులు ఇతర రూపాల్లో సంకేతాలు పంపుతున్నా గుర్తించని పరిస్థితి ఏర్పడుతోందని కొలంబానో అంచనా.
– సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top