దక్షిణాఫ్రికాలో తన్నీర్‌ తన్నీర్‌!

Water problems in the South Africa - Sakshi

చేతిలో బిందెలు.. పొడవాటి క్యూ.. ముఖాల్లో ఆందోళన! 
ఇలాంటి సీన్లు మామూలుగా ఎక్కడ కనిపిస్తుంటాయి? 
ఇంకెక్కడ.. భారత్‌లో.. లేదంటే ఇతర ఆసియా దేశాల్లో! 
వాతావరణ మార్పుల ప్రభావమనండి.. ఇంకోటి ఏదైనా అనండి.. 
అచ్చం ఇలాంటి సీన్లే దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌లోనూ కనిపించనున్నాయి! 
ఇంకో రెండు నెలల్లో.. కచ్చితంగా చెప్పాలంటే ఏప్రిల్‌ 16 నుంచి 
నల్లా నీళ్లు బంద్‌ అని అక్కడి ప్రభుత్వం ప్రకటించేసింది కూడా! 
ఎందుకొచ్చింది ఈ కష్టం.. మనకేంటి చెబుతోంది పాఠం..?

పోగొట్టుకుంటేగానీ.. ఒక వస్తువు అసలు విలువ తెలియదంటారు. మిగిలిన వాటి మాటెలా ఉన్నా.. మన మనుగడకు ప్రాణాధారమైన నీటి విషయంలో మాత్రం ఇది అక్షరాలా వర్తిస్తుంది. నెలకు రెండు వానలు కురిసే కాలం ఎప్పుడో పోయింది కాబట్టి నీటి విషయంలో ఇప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. పాపం ఈ విషయం కేప్‌టౌన్‌ ప్రజలకు కొంచెం ఆలస్యంగా తెలిసొచ్చింది. వరుసగా మూడేళ్లపాటు కాటేసిన వర్షాభావం పుణ్యమా అని దక్షిణాఫ్రికాలోనే రెండో అతిపెద్ద నగరమైన కేప్‌టౌన్‌కు మంచినీరు అందించే రిజర్వాయర్లన్నీ నిండుకున్నాయి.. పొదుపుగా వాడుకోండర్రా అని ప్రజలకు రెండేళ్ల నుంచి చెవినిల్లు కట్టుకుని పోరినా ఫలితం లేకపోవడంతో కేప్‌టౌన్‌ కార్పొరేషన్‌ కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఏప్రిల్‌ 16 నుంచి నల్లాలో నీళ్లు రావని ప్రకటించేసింది. బదులుగా నగరం మొత్తమ్మీద అక్కడక్కడా వాటర్‌ ట్యాంకర్ల వంటివి ఏర్పాటు చేస్తామని.. ఒక్కో వ్యక్తి రోజుకు 25 లీటర్ల నీళ్లు పట్టుకునేందుకు ఇక్కడ అనుమతిస్తారు. నల్లాలు బంద్‌ అయ్యే రోజుకు కేప్‌టౌనీయులు పెట్టుకున్న పేరు ‘డే–జీరో’! 

మన పరిస్థితి ఏంటి! 
కేప్‌టౌన్‌ జనాభా నలభై లక్షలే కానీ.. దానికి రెండున్నర రెట్లు ఎక్కువ జనాభా ఉన్న హైదరాబాద్‌ స్థాయిలో నీటి వాడకం ఉంటుంది. సరే.. వారి గోల మనకెందుకు అనుకుంటే.. హైదరాబాద్‌ సహా తెలుగు రాష్ట్రాలు, భారతదేశంలోని మహానగరాల్లోనూ డే–జీరో తరహా పరిస్థితులు ఏర్పడే రోజులు ఎక్కువ దూరంగా ఏమీ లేవు. ఇప్పటికే మహానగరాల్లో నీళ్లొచ్చేది రెండు రోజులకు ఒకసారి. అదీ ఒకట్రెండు గంటలు మాత్రమే. హైదరాబాద్‌కైతే వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న గోదావరి, కృష్ణా నదుల నుంచి నీటిని మళ్లించుకుంటున్నాం. బెంగళూరుకు కావేరి నుంచి.. చెన్నైకు ఇంకో నది నుంచి నీరు తెచ్చుకుంటున్న విషయం తెలిసిందే. వాతావరణ మార్పుల కారణంగా ఒకట్రెండేళ్లు వర్షాలు తగ్గితే.. నీటి కోసం అలమటించాల్సిందే!

తాగునీరు కాకుండా మిగిలిన అవసరాల కోసం మనం పాటిస్తున్న పద్ధతులు మాత్రం ఏదో ఒకరోజు కేప్‌టౌన్‌ కంటే అధ్వానమైన పరిస్థితులు సృష్టించక మానవు. ఇంటింటికి ఒక బోరుబావి.. లెక్కాపత్రం అస్సలు లేని విధంగా వాడకంతో ఇప్పటికే నగరాల్లో భూగర్భ జలాలు పాతాళానికి చేరుకున్న విషయం తెలిసిందే. గత ఏడాది అక్టోబర్‌ నాటికి హైదరాబాద్‌లో భూగర్భ జలమట్టం ఉపరితలం నుంచి సుమారు 8 మీటర్ల దిగువకు పడిపోయాయి. ఆ నెలలో భారీ వర్షాలు కురిసినా.. తక్కువ కాలంలో ఎక్కువ వానలు పడటంతో నీళ్లేవీ భూమిలోకి ఇంకలేదు. నగరంలో కొన్నిచోట్ల వెయ్యి అడుగుల లోతు వరకూ బోర్లు వేస్తున్నా నీళ్లు రాకపోవడం చూస్తూనే ఉన్నాం. ఇంకోవైపు.. ప్రభుత్వాలు కోట్లకు కోట్లు ఖర్చు పెట్టి ఎక్కడెక్కడి నుంచో నీళ్లు తరలిస్తూండటం వల్ల ప్రజలకు అసలు సమస్య తెలియడం లేదు. వాతావరణ మార్పుల కారణంగా రానున్న రోజుల్లో నీటికి మరింత కటకట తప్పదని శాస్త్రవేత్తలు ఇప్పటికే ఎన్నోసార్లు హెచ్చరించారు. అరకొర వానలు.. అకాల వరదలతో రిజర్వాయర్లలో నీటి నిల్వలకు గ్యారంటీ లేకుండా పోయిందన్నది మన ఇటీవలి అనుభవమే.  
 – సాక్షి, హైదరాబాద్‌

మరి తరుణోపాయం? 
చాలా సింపుల్‌. ఉన్ననీటిని వీలైనంత పొదుపుగా వాడుకోవడమే. రెండేళ్ల క్రితం అమెరికాలోని కాలిఫోర్నియాలో వర్షాభావం ఏర్పడినప్పుడు అక్కడి రిజర్వాయర్లలోకి కోట్లకు కోట్ల ప్లాస్టిక్‌ బంతులు గుమ్మరించారు. ఆవిరైపోయే నీటిని కొంతైనా మిగిల్చుకునేందుకు చేసిన ప్రయత్నం అది. ఇక 75 శాతం ఎడారి ప్రాంతమున్నప్పటికీ వినూత్న పద్ధతుల్లో వ్యవసాయం చేస్తూ పండ్లు, కాయగూరలను ఎగుమతి చేసుకుంటున్న ఇజ్రాయెల్‌ విజయగాథలు అందరికీ తెలిసినవే. ఇంకోవైపు చైనాలో నీటి ఆవిరిని అడ్డుకోవడంతోపాటు కాలుష్యరహితమైన సౌర విద్యుత్తు ఉత్పత్తి కోసం అక్కడి ప్రభుత్వం ఓ సరస్సు మొత్తాన్ని సోలార్‌ ప్యానెల్స్‌తో కప్పేసింది. అంతెందుకు గుజరాత్‌లోని నర్మదా డ్యామ్‌ కాలువలపై సోలార్‌ ప్యానెల్స్‌ ఏర్పాటు చేయడంపై ఎన్నో కథనాలు వెలువడ్డాయి. ఇలాంటి వినూత్న, ఆచరణ సాధ్యమైన పద్ధతులు అనేకం వాడకంలోకి రావాలి. ఇప్పటివరకూ నిర్లక్ష్యం చేసిన వాటర్‌ రీసైక్లింగ్‌నూ పెద్ద ఎత్తున చేపట్టాలి. డిమాండ్‌ లేకపోవడంతో హైదరాబాద్‌ నగర పాలక సంస్థ నీటి రీసైక్లింగ్‌ను ఆపేసే పరిస్థితులు ఏర్పడ్డాయి. మొత్తమ్మీద చూస్తే.. పొదుపు మంత్రం.. రీసైక్లింగ్‌ మాత్రమే సుస్థిర జల భవిష్యత్తుకు ఉన్న ఏకైక మార్గం!

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top