ఉ.కొరియాను ధ్వంసం చేస్తాం | Sakshi
Sakshi News home page

ఉ.కొరియాను ధ్వంసం చేస్తాం

Published Fri, Dec 1 2017 1:12 AM

US warns North Korean leadership that it would be 'utterly destroyed' if war breaks out - Sakshi

ఐక్యరాజ్యసమితి/మాస్కో: ఉత్తర కొరియా చేస్తున్న క్షిపణి పరీక్షలు ఒకవేళ యుద్ధానికి దారితీస్తే మాత్రం ఆ దేశాన్ని పూర్తిగా నాశనం చేస్తామని అమెరికా తీవ్రంగా హెచ్చరించింది. అన్ని దేశాలు కలసి ఉత్తర కొరియాతో ఆర్థిక, రాజకీయ సంబంధాలను తెంచుకోవాలని పిలుపునిచ్చింది. అప్పుడు ఆ దేశానికి శిక్ష విధించినట్లు అవుతుందని పేర్కొంది.

ఉత్తర కొరియా తాజాగా జరిపిన క్షిపణి ప్రయోగంపై ఐక్యరాజ్యసమితిలోని భద్రతా మండలిలో జరిగిన అత్యవసర సమావేశంలో అమెరికా రాయబారి నిక్కీ హేలీ మాట్లాడుతూ.. అమెరికాను లక్ష్యంగా చేసుకుని తాజాగా జరిపిన క్షిపణి ప్రయోగంతో ఉత్తర కొరియా ప్రపంచాన్ని యుద్ధపు అంచుల్లోకి తెచ్చిందని మండిపడ్డారు. మంగళవారం ఉత్తర కొరియాలోని సేయిన్‌నీ అనే ప్రాంతం నుంచి ఓ క్షిపణిని ప్రయోగించగా, దాదాపు 1000 కి.మీ. ప్రయాణించి జపాన్‌కు చెందిన సముద్రంలో పడిపోయింది.

‘ఒకవేళ యుద్ధం సంభవించిందో.. దానికి ఉత్తర కొరియా దుందుడుకు చర్యలే కారణం. నిజంగా యుద్ధమే వస్తే రెండో మాట లేకుండా ఉత్తర కొరియా సామ్రాజ్యం నేలమట్టం అవడం తథ్యం’ అని హేలీ అన్నారు. తామెప్పుడు ఆ దేశంతోతో యుద్ధాన్ని కోరుకోలేదని ఆమె చెప్పారు. ఉత్తర కొరియాతో సంబంధాలు తెంచుకోవాలన్న అమెరికా పిలుపును రష్యా వ్యతిరేకించింది.

ఇది సూపర్‌ పవర్‌!
సియోల్‌: ఉత్తర కొరియా బుధవారం పరీక్షించిన హవాసాంగ్‌–15 క్షిపణి... గత జూలైలో పరీక్షించిన హవాసాంగ్‌–14తో పోలిస్తే ఎంతో శక్తిమంతమైనది. హవా సాంగ్‌–15 ఫొటోలు, వీడియోలను ఉ.కొ రియా గురువారం విడుదల చేసింది. దీంతో ప్రపంచంలో ఏ ప్రాంతంపైనైనా దాడి చేయగల సామర్థ్యాన్ని ఉ.కొరియా మరింత పెంపొందించుకున్నట్లయింది.

Advertisement
Advertisement