అందమైన భామల మధ్య వేలంవెర్రి పోటీ!

Unlicensed Boxing Event In Britain - Sakshi

‘వరల్డ్‌ రెజ్లింగ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌’ పోటీలను వేలంవెర్రిలాగా చూస్తున్న జనాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారనే విషయం తెల్సిందే. అదే తరహాలో ఇప్పుడు బ్రిటన్‌ విద్యార్థులకు వేలం వెర్రిలాగ ఓ ఆట పట్టుకుంది. అదే బాక్సింగ్‌. డబ్లూడబ్లూఎఫ్‌ పోటీల్లో పాల్గొనే కండల వీరులు కదం తొక్కుతు రింగ్‌లోకి వస్తుంటే అందమైన భామలు కరతాల ధ్వనులతో హావభావాలతో వారికి స్వాగతం చెప్పడం, నిర్వాహకులు హంగామా చేయడం తెల్సిందే. అదే తరహాలో లండన్‌లో జరుగుతున్న బాక్సింగ్‌లో పాల్గొనే విద్యార్థులు చొక్కా లేకుండా వేదికపైకి వస్తుంటే పొగ గొట్టాలు చిమ్మడం, గాలి బుడగల నురుగు ఎగిసి పడటం, స్వర్ణ కాంతులు విరజిమ్మడం చూడముచ్చటగా ఉంటుంది. అంతకన్నా ముచ్చటగా ఉండే ముద్దుగుమ్మలు హొయలుపోతూ పోటీదారులకు స్వాగతం చెప్పడం, కరతాళ ధ్వనులతో తోటి విద్యార్థినులే  వారిని ప్రోత్సహించడం అంతా ఓ మ్యూజిక్‌ ఫెస్టివల్లా ఉంటుంది. 

అదిరిపోయే సంగీత హోరు మధ్య బాక్సర్‌లు ఒకరికొకరు తలపడుతుంటే తాగుతున్న విద్యార్థి, కుర్రకారులోకం తన్మయులై చూస్తుంటారు. తెల్లారాక తీరిగ్గా ఇల్లు వెతుక్కుంటూ వెళతారు. డబ్లూడబ్లూఎఫ్‌ పోటీలు లైసెన్స్‌తో నడుస్తున్నాయి. కానీ విద్యార్థులు పాల్గొంటున్న ఈ బాక్సింగ్‌ పోటీలకు మాత్రం ఎలాంటి లైసెన్స్‌లు లేవు. పర్యవసానంగా కొన్నిసార్లు విద్యార్థులు మత్యువాత కూడా పడుతున్నారని తెలుస్తోంది. లైసెన్స్‌డ్‌ బాక్సింగ్‌ పోటీలు ప్రభుత్వ హయాంలో నడుస్తుంటే లైసెన్స్‌ లేకుండా చాటుమాటుగా రాత్రిపూట నడుస్తున్న బాక్సింగ్‌ పోటీలను ప్రైవేటు కంపెనీలు నిర్వహిస్తున్నాయి. 

కార్డిఫ్‌ నగరంలో ఇలాంటి పోటీలను ‘పేపర్‌ ఏజెన్సీ యూకే’  కంపెనీ నిర్వహిస్తోంది. ఈ పోటీలకు విద్యార్థులనే ఎన్నుకోవడానికి కారణం. గ్యాధరింగ్‌ ఎక్కువగా ఉంటుందని, ప్రచారం ఎక్కువగా లభిస్తుందని. ఇదే విషయమై పేపర్‌ ఏజెన్సీని మీడియా ప్రశ్నించగా, తాము టాలెంట్‌ హంట్‌లాగా విద్యార్థులకు ఉపయోగపడుతున్నామని, ప్రభుత్వ బాక్సింగ్‌ పోటీల్లో పాల్గొనే అవకాశం అందరికి రాదని, అందుకనే తాము మున్ముందు బాక్సింగ్‌లో రాణించగల జాతి రత్నాలను ఇప్పటి నుంచే వెలికి తీస్తున్నామని చెప్పారు. పోటీల్లో పాల్గొంటున్న విద్యార్థులకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా తగిన జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని కంపెనీ ప్రతినిధి తెలిపారు. తలకు రక్షణగా హెల్మెట్, చేతికి సరైన గ్లౌజులతోనే పోటీకి అనుమతిస్తామని, పోటీదారులకు కూడా ప్రొఫెషనర్స్‌తోనే శిక్షణ ఉంటుందని, పోటీదారులకు  భారత కరెన్సీలో 20 కోట్ల రూపాయల వరకు జీవిత బీమా చేసినట్టు చెప్పారు. 

ఈ పోటీలతో కార్డిఫ్‌ యూనివర్శిటీ, కార్డిఫ్‌ మెట్రోపాలిటన్‌ యూనివర్శిటీలకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. తమకు కూడా ఎలాంటి సంబంధం లేదని ఇగ్లండ్‌ బాక్సింగ్, వేల్ష్‌  అమెచ్యూర్‌ బాక్సింగ్‌ అసొసియేషన్‌ స్పష్టం చేశాయి. ఈ ప్రైవేటు పోటీలు సురక్షితం కావని, బాక్సింగ్‌ పోటీలకు అనవసరంగా చెడ్డ పేరు తెచ్చే అవకాశం ఉందని ఇంగ్లండ్‌ బాక్సింగ్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ గెతిన్‌ జెన్‌కిన్స్‌ హెచ్చరించారు. తాను మాత్రం గత ఏడు వారాలుగా ప్రొఫెషనల్‌ బాక్సర్‌తోనే శిక్షణ తీసుకుంటున్నానని కార్డిఫ్‌ బాక్సింగ్‌ పోటీల్లో పాల్గొనబోతున్న 22 ఏళ్ల క్రిస్‌ కాన్వే తెలిపారు. బాక్సింగ్‌ పోటీలప్పుడు వైద్యులు అందుబాటులో ఉంటారని, అయితే పోటీదారులకు ముందుగానే హెల్త్‌ చెకప్‌లు చేయడం ఏమీ ఉండదని గతంలో ఈ పోటీల్లో పాల్గొన్న ఎక్సెటర్, బాత్, న్యూకాజల్, గ్లాస్‌గో, సెయింట్‌ ఆండ్రీస్‌ తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పోటీలకు ముందుగా బాక్సర్లు వైద్య పరీక్షలు చేసుకొని ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ తీసుకోవాల్సి ఉంటుంది. అనధికారికంగా జరుగుతున్న పోటీలు రేపు  ‘ఐపీఎల్‌ బాక్సింగ్‌’ పోటీలకు దారితీయవచ్చేమో!

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top