యూకేలో ‘పాయింట్స్‌ బేస్డ్‌ వీసా’

UK gets ready for new points-based visa system - Sakshi

కొత్త వీసా విధానాన్ని ప్రారంభించిన కేబినెట్‌ మంత్రి ప్రీతి పటేల్‌

లండన్‌:  ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ, అత్యంత తెలివైన నిపుణులను తమ దేశంలోకి ఆహ్వానించే నూతన పాయింట్స్‌ ఆధారిత వీసా విధానాన్ని బ్రిటన్‌ బుధవారం ఆవిష్కరించింది. నిపుణులు కాని, చవక కార్మికుల వలసలను నిరోధించే దిశగా ఈ విధానాన్ని రూపొందించామని భారత సంతతికి చెందిన యూకే హోం మంత్రి ప్రీతి పటేల్‌ పేర్కొన్నారు. ఈ తాజా వీసా విధానం వచ్చే సంవత్సరం జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందన్నారు. విద్యార్హతలు, ప్రత్యేక నైపుణ్యాలు, వృత్తులు, వేతనాలు.. మొదలైన వాటికి పాయింట్లను కేటాయించి, అవసరమైన అర్హత పాయింట్లు సాధించిన వారికే వీసా ఇచ్చేలా ఈ విధానాన్ని రూపొందించారు. ‘ఈ రోజు చరిత్రాత్మకం. ఈ దేశ పౌరులు కోరుకుంటున్నట్లుగా, పాయింట్ల ఆధారిత వీసా విధానాన్ని ప్రారంభిస్తున్నాం’ అని ఈ సందర్భంగా ప్రీతి పటేల్‌ పేర్కొన్నారు.

తాజా వీసా విధాన ప్రకారం యూకేకి రావాలనుకునేవారు కచ్చితంగా ఆంగ్లం మాట్లాడగలగాలి. అర్హత ఉన్న యాజమాన్యం నుంచి తమ నైపుణ్యానికి సంబంధించిన ఉద్యోగ ఆహ్వానం పొంది ఉండాలి. నైపుణ్యాల ద్వారా వారికి పాయింట్లు వస్తాయి.  యూకేలో నిపుణులైన ఉద్యోగుల కొరత అధికంగా ఉన్న రంగాలకు ఉపాధి కోసం వచ్చేవారికి ప్రత్యేక పాయింట్లు ఉంటాయి. వివిధ రంగాల్లో అత్యుత్తమ నైపుణ్యత కలిగినవారికి వెంటనే వీసా ఇచ్చే ఫాస్ట్‌ ట్రాక్‌ గ్లోబల్‌ టాలెంట్‌ స్కీమ్‌ శుక్రవారం నుంచి ప్రారంభమవుతుందని హోం శాఖ వెల్లడించింది. యూకేలోని కంపెనీలు, విద్యా సంస్థల నుంచి ఉద్యోగ ఆహ్వానం లేని ఈయూ దేశాల్లోని నిపుణులైన శాస్త్రవేత్తలు, పరిశోధకులకు ఈ ఫాస్ట్‌ ట్రాక్‌ వీసా విధానం వచ్చే సంవత్సరం నుంచి అమలు చేస్తామన్నారు.  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top