breaking news
UK Home Department
-
యూకేలో ‘పాయింట్స్ బేస్డ్ వీసా’
లండన్: ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ, అత్యంత తెలివైన నిపుణులను తమ దేశంలోకి ఆహ్వానించే నూతన పాయింట్స్ ఆధారిత వీసా విధానాన్ని బ్రిటన్ బుధవారం ఆవిష్కరించింది. నిపుణులు కాని, చవక కార్మికుల వలసలను నిరోధించే దిశగా ఈ విధానాన్ని రూపొందించామని భారత సంతతికి చెందిన యూకే హోం మంత్రి ప్రీతి పటేల్ పేర్కొన్నారు. ఈ తాజా వీసా విధానం వచ్చే సంవత్సరం జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందన్నారు. విద్యార్హతలు, ప్రత్యేక నైపుణ్యాలు, వృత్తులు, వేతనాలు.. మొదలైన వాటికి పాయింట్లను కేటాయించి, అవసరమైన అర్హత పాయింట్లు సాధించిన వారికే వీసా ఇచ్చేలా ఈ విధానాన్ని రూపొందించారు. ‘ఈ రోజు చరిత్రాత్మకం. ఈ దేశ పౌరులు కోరుకుంటున్నట్లుగా, పాయింట్ల ఆధారిత వీసా విధానాన్ని ప్రారంభిస్తున్నాం’ అని ఈ సందర్భంగా ప్రీతి పటేల్ పేర్కొన్నారు. తాజా వీసా విధాన ప్రకారం యూకేకి రావాలనుకునేవారు కచ్చితంగా ఆంగ్లం మాట్లాడగలగాలి. అర్హత ఉన్న యాజమాన్యం నుంచి తమ నైపుణ్యానికి సంబంధించిన ఉద్యోగ ఆహ్వానం పొంది ఉండాలి. నైపుణ్యాల ద్వారా వారికి పాయింట్లు వస్తాయి. యూకేలో నిపుణులైన ఉద్యోగుల కొరత అధికంగా ఉన్న రంగాలకు ఉపాధి కోసం వచ్చేవారికి ప్రత్యేక పాయింట్లు ఉంటాయి. వివిధ రంగాల్లో అత్యుత్తమ నైపుణ్యత కలిగినవారికి వెంటనే వీసా ఇచ్చే ఫాస్ట్ ట్రాక్ గ్లోబల్ టాలెంట్ స్కీమ్ శుక్రవారం నుంచి ప్రారంభమవుతుందని హోం శాఖ వెల్లడించింది. యూకేలోని కంపెనీలు, విద్యా సంస్థల నుంచి ఉద్యోగ ఆహ్వానం లేని ఈయూ దేశాల్లోని నిపుణులైన శాస్త్రవేత్తలు, పరిశోధకులకు ఈ ఫాస్ట్ ట్రాక్ వీసా విధానం వచ్చే సంవత్సరం నుంచి అమలు చేస్తామన్నారు. -
బ్రిటన్లో భారతీయుల అరెస్టు
లండన్: అక్రమంగా నివసిస్తున్న వారిపై బ్రిటన్ వ్యాప్తంగా చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్లో అరెస్టయిన సుమారు 200 మందిలో ఎక్కువ మంది భారతీయులున్నట్లు ఆ దేశ హోం శాఖ వెల్లడించింది. వీసా గడువు ముగిసినా అక్కడే నివసిస్తూ పట్టుబడిన వారిలో పాకిస్తాన్, చైనా, అఫ్గానిస్తాన్, ఆల్బేనియా పౌరులు కూడా ఉన్నట్లు తెలిపింది. జనవరి నుంచి జూన్ మధ్య నిర్వహించిన ఈ ఆపరేషన్లో పరిమితికి మించి నివాసం ఉంటున్న 253 ఇళ్లపై అధికారులు దృష్టిసారించారు. యూకేలోకి అక్రమంగా ప్రవేశించిన, వీసా గడువు ముగిసినా అక్కడే నివసిస్తున్న మొత్తం 200 మందిని అదుపులోకి తీసుకుని, 24 మంది ఇంటి యజమానులకు జరిమానా విధించారు. అయితే ఈ ఆపరేషన్లో దొరికిపోయి, స్వచ్ఛందంగా తిరిగి తమ దేశం వెళ్లిపోతామనుకునే వారికి సాయం చేస్తామని బ్రిటన్ హోం శాఖ ప్రకటించింది.