
ఆ సమయంలో ట్వీట్లతో ఎంతో మేలు!
ట్వీట్లు, ఇతర సోషల్ మీడియా పోస్టింగులు విపత్కర పరిస్థితుల్లో ఎంతో మేలు చేస్తున్నాయని అమెరికాలోని పెన్సిల్వేనియా యూనివర్సిటీ పరిశోధకుల బృందం వెల్లడించింది.
న్యూయార్క్: ట్వీట్లు, ఇతర సోషల్ మీడియా పోస్టింగులు విపత్కర పరిస్థితుల్లో ఎంతో మేలు చేస్తున్నాయని అమెరికాలోని పెన్సిల్వేనియా యూనివర్సిటీ పరిశోధకుల బృందం వెల్లడించింది. సోషల్ మీడియా ద్వారా విపత్తు తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలను తక్షణమే గుర్తించి సహాయ కార్యక్రమాలు అందించడానికి వీలవుతోందని ప్రోఫెసర్ సెర్వోనే తెలిపారు. 2013లో అమెరికాలోని కొలరాడో ప్రాంతంలో సంభవించిన వరదల సహాయ కార్యక్రమాలపై పరిశీలన జరిపిన సెర్వోనే బృందం ఈ మేరకు ప్రకటించింది.
కోలరాడోలో వరదలు సంభవించిన సమయంలో కేవలం తొమ్మిది రోజుల్లోనే సంవత్సరకాలానికి సమానమైన వర్షపాతం నమోదైంది. అధికారులు సుమారు 10,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆ తక్షణ చర్యలకు శాటిలైట్ల ద్వారా అందే చిత్రాల కంటే.. సోషల్ మీడియాలో బాధితులు, సహాయం అందించే వారు చేసినటువంటి ట్వీట్లు, పోస్టింగులే ఎక్కువగా ఉపయోగపడినట్లు తమ పరిశీలనలో తేలిందని సెర్వోనే తెలిపారు. ఇటీవల సంభవించిన చెన్నై వరదల సమయంలో సైతం సోషల్ మీడియా ద్వారా సహాయ కార్యక్రమాలు వేగవంతంగా జరిగిన విషయం తెలిసిందే.