ఒబామా కేర్ ఒక పీడకల : ట్రంప్

Trump signs executive order to undermine Obamacare - Sakshi

అమెరికా పౌరులందరూ తప్పనిసరిగా ఆరోగ్యబీమా పాలసీ కలిగి ఉండేలా నిర్దేశించిన ఒబామాకేర్‌ చట్టాన్ని(అఫర్డబుల్‌ కేర్‌ యాక్ట్‌) తొలగించి, దాని స్థానంలో కొత్తది అమల్లోకి తేవడానికి అమెరికా కాంగ్రెస్ లో జరిగిన అన్ని ప్రయత్నాలు విఫలమవ్వడంతో ట్రంప్ తనకున్న విశేష అధికారాలను ఉపయోగించి కొత్త హెల్త్ కేర్ విధానంపై సంతకం చేశారు. 2010లో ఒబామాకేర్‌ బిల్లు చట్ట రూపందాల్చి నాలుగేళ్లకు అమల్లోకి వచ్చింది. అప్పటి వరకూ ఆరోగ్య బీమా కవరేజీలేని అమెరికన్లు లక్షలాది మందికి ఇది ఆసరా అయింది. అయితే, ఈ చట్టంలోని కొన్ని నిబంధనలు వివాదాస్పదమయ్యాయి. కిందటేడాది అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ఈ చట్టాన్ని రద్దుచేసి కొత్త బిల్లు తెస్తామని రిపబ్లికన్లు ప్రచారం చేశారు. ఎన్నికల్లో గెలిచిన ఈ పార్టీ నేత డొనాల్డ్‌ ట్రంప్‌ తన హామీ మేరకు ఒబామాకేర్‌ రద్దుకు చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. దీంతో హెల్త్ కేర్పై కాంగ్రెస్లో కలిసికట్టుగా చట్టం చేయడంలో వీలుకాకపోవడంతో, మరింత మందికి హెల్త్ కేర్ ప్రయోజనాలు చేకూరడానికి తనకున్న విశేషాధికారలను ఉపయోగించి కొత్త విధానం అమలులోకి తెస్తున్నట్టు ట్రంప్ తెలిపారు.

ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేసిన సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ ఒబామా కేర్ అమెరికన్లకు ఒక పీడకల అని విమర్శలు గుప్పించారు. బీమా పాలసీ లేని వారు ట్యాక్స్ పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుందనే నియమంతోపాటు ఇంకా అనేక నిబంధనలు ఒబామాకేర్‌ చట్టంలో పౌరులకు, సంస్థలకు ఇబ్బంది కలిగించేలా ఉన్నాయని, పాలసీలేని ప్రజలు అపరాధసుంకం చెల్లించాలనే రూలును ప్రత్యామ్నాయ హెల్త్ కేర్లో తొలగిస్తున్నట్టు ట్రంప్ ప్రకటించారు. అలాగే, 50 మందికి పైగా సిబ్బంది ఉన్న కంపెనీలు తమ ఉద్యోగులకు ఆరోగ్యబీమా పథకాలు కల్పించకపోతే పెనాల్టీ కట్టాలనే నిబంధనను కూడా రిపబ్లికన్ల హెల్త్ కేర్లో తొలగించారు. తక్కువ ప్రీమియం ప్లాన్స్తో అందరికీ ఆరోగ్య బీమా అందుబాటులో ఉండటమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ట్రంప్ తెలిపారు. ఈ నిర్ణయంతో ఆరోగ్య బీమా చేసుకునే వారి సంఖ్య అమెరికాలో మరింత పెరుగుతుందన్నారు. రాష్ట్రాలతో సంబంధంలేకుండా దేశంలో అమెరికా పౌరులు ఎక్కడైనా  ఆరోగ్య బీమాని తీసుకోవొచ్చని వైట్ హౌస్ కార్యాలయం పేర్కొంది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top