భారత్‌–పాక్‌ ప్రధానులతో భేటీ అవుతా 

Trump says He Will Meet narendra modi and imran khan - Sakshi

ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు కృషి చేశా: ట్రంప్‌

వాషింగ్టన్‌: భారత్, పాకిస్తాన్‌ల ప్రధాన మంత్రులతో త్వరలోనే భేటీ అవుతానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మంగళవారం ప్రకటించారు. భారత్, పాకిస్తాన్‌ల  మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు తాను ఎంతో ప్రయత్నించానని చెప్పుకొచ్చారు. సెప్టెంబర్‌ 22న హ్యూస్టన్‌లో 50 వేల మంది భారత సంతతికి చెందిన అమెరికన్లు హాజరయ్యే ‘çహౌడీ.. మోదీ’ కార్యక్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, ట్రంప్‌ పాల్గొననున్నారు. అయితే పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ను ట్రంప్‌ ఎక్కడ.. ఎప్పుడు కలుస్తారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. సోమవారం వైట్‌హౌజ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ట్రంప్‌ ఈ వివరాలు వెల్లడించారు. కాగా, ఈ నెలాఖరున జరిగే ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌తో భేటీ కానున్నట్లు ట్రంప్‌ పర్యాటక షెడ్యూల్‌ ద్వారా తెలుస్తోంది. కశ్మీర్‌ పేరును నేరుగా ప్రస్తావించకుండా ‘అక్కడ చాలా అభివృద్ధి జరుగుతోంది’అని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. కశ్మీర్‌ అంశంపై మూడో వ్యక్తి మధ్యవర్తిత్వం అవసరం లేదని గత నెలలో ఫ్రాన్స్‌లో ట్రంప్‌తో జరిగిన సమావేశంలో ప్రధాని మోదీ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ‘కశ్మీర్‌ పూర్తిగా భారత్, పాకిస్తాన్‌ మధ్య ద్వైపాక్షిక అంశం మాత్రమే. మూడో పార్టీని అనవసరంగా ఇబ్బంది పెట్టబోం. మేమే దీనిపై ద్వైపాక్షికంగా చర్చించి పరిష్కరించుకుంటాం’అని మోదీ పేర్కొన్నారు. 

ఇది సరైన సమయం కాదు
తాను ఉత్తర కొరియాలో పర్యటించేందుకు ఇది సరైన సమయం కాకపోవచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యాఖ్యానించారు. అయితే సమీప భవిష్యత్తులో తప్పనిసరిగా ప్యాంగాంగ్‌ పర్యటన చేస్తానని స్పష్టం చేశారు. తమ మధ్య మంచి సంబంధాలే ఉన్నాయని, ఇరు దేశాల మధ్య సమావేశానికి ఇంకా సన్నద్ధం కాలేదని పేర్కొన్నారు. అంతేకాదు ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ జాన్‌ ఉన్‌ అమెరికాలో పర్యటించేందుకు ఇష్టపడుతున్నాడని కచ్చితంగా చెప్పగలనన్నారు. ప్యాంగాంగ్‌లో పర్యటించాల్సిందిగా గత నెలలో ట్రంప్‌ను కిమ్‌ ఆహ్వానిస్తూ లేఖ పంపినట్లు ఉత్తరకొరియాలోని ఓ పత్రికలో వార్తా కథనం ప్రచురితమైంది. ఉత్తర కొరియా అణు నిరాయుధీకరణ చేసేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌.. ఆ దేశ అధినేతతో చర్చలు జరిపిన విషయం తెలిసిందే. అయితే రెండు సమావేశాల్లోనూ ఈ అంశం ఓ కొలిక్కి రాలేదు. తాజాగా భేటీకి రావాల్సిందిగా అమెరికా అధ్యక్షుడికి ఉత్తర కొరియా ఆహ్వానం పంపింది. ఇదిలా ఉండగా.. ఉత్తరకొరియా తిరిగి పలు అణ్వాయుధాల పరీక్షలు జరుపుతోంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల అధినేతల మధ్య సమావేశం ఇప్పట్లో జరిగేలా కనిపించట్లేదు.  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top