
ఒసాకా : ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి స్కాట్ మోరిసన్ ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించారు. జీ 20 సదస్సులో భాగంగా మోదీతో సెల్ఫీ తీసుకున్న ఆయన.. ‘మోదీ ఎంత మంచివారో(బాగున్నారో)!!’ అంటూ ఆ ఫొటోను ట్వీటర్‌లో షేర్ చేశారు. ఇందుకు స్పందనగా.. ‘మేట్, ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరచుకునే చర్చకై ఎంతో ఉత్సుకతతో ఎదురుచూస్తున్నా’ అంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ఇద్దరు ప్రధానుల సెల్ఫీపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.
కాగా ఈనెల 27 నుంచి 29 వరకు జపాన్‌లోని ఒసాకాలో జీ20 దేశాల సదస్సు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం సమావేశమయ్యారు. ఇరాన్ వ్యవహారాలు, 5జీ నెట్‌వర్క్, వాణిజ్య, రక్షణ రంగాలకు సంబంధించి పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. రక్షణ సహకారం పెంపుదల, శాంతి సుస్ధిరతలను కాపాడటం, వర్తక లోటును అధిగమించడం సహా పలు అంశాలపై ఇరువురు నేతలు పరస్పరం అభిప్రాయాలు పంచుకున్నారు. ఇక ఈరోజు ఆస్ట్రేలియా ప్రధానితో నరేంద్ర మోదీ సమావేశం కానున్నారు. అదే విధంగా చైనా, అమెరికా అధ్యక్షుల మధ్య చర్చలు జరుగనున్నాయి. ఈ రెండు దేశాల మధ్య వాణిజ్యయుద్ధం ముదిరిన నేపథ్యంలో చర్చలు ఎంతమేరకు ఫలిస్తాయో వేచి చూడాల్సిందే.
Kithana acha he Modi! #G20OsakaSummit pic.twitter.com/BC6DyuX4lf
— Scott Morrison (@ScottMorrisonMP) June 28, 2019