గుర్తుపట్టకుండా ప్లాస్టిక్‌ సర్జరీ!

Nirav Modi planned plastic surgery to evade arrest - Sakshi

చిన్నదేశాల పౌరసత్వానికి యత్నం

విచారణ నుంచి తప్పించుకునేందుకు నీరవ్‌ మోదీ ఎత్తుగడలు

లండన్‌/న్యూఢిల్లీ: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు (పీఎన్‌బీ)కు దాదాపు రూ.13,500కోట్లు ఎగ్గొట్టి లండన్‌ పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ భారత్‌లో కేసుల దర్యాప్తు నుంచి తప్పించుకునేందుకు అనేక ప్రయత్నాలు చేసినట్లు తేలింది. ఇందులోభాగంగా తొలుత ఆస్ట్రేలియాకు 1,750 కిలోమీటర్ల తూర్పున ఉన్న వనౌతు ద్వీప దేశపు పౌరసత్వం కోసం నీరవ్‌ దరఖాస్తు చేసుకున్నారు. సింగపూర్‌లో శాశ్వత పౌరసత్వం కోసం ప్రయత్నించారు. అయితే ఈ ప్రయత్నాలు సఫలం కాకపోవడంతో మూడో దేశంలో ఆశ్రయం పొందేందుకు వీలుగా బ్రిటన్‌లోని ప్రముఖ న్యాయసంస్థలను నీరవ్‌ సంప్రదించారు.

అంతేకాకుండా భారత అధికారులకు చిక్కకుండా ఉండేందుకు ఆయన ముఖానికి ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకోవాలని  భావించారట. అయితే మెట్రో బ్యాంకు క్లర్క్‌ నీరవ్‌ను గుర్తుపట్టడంతో ఆయన ప్రణాళికలన్నీ బెడిసికొట్టాయి. మరోవైపు హోలీ పర్వదినం రోజున నీరవ్‌ మోదీ లండన్‌ శివార్లలోని వాండ్స్‌వర్త్‌లో ఉన్న ‘హర్‌ మెజెస్టీ జైలు’లో గడిపారు. మార్చి 28 వరకూ నీరవ్‌ ఇదే జైలులో ఉండనున్నారు. ఈ జైలులో అత్యవసర సమయంలో రోగులకు చికిత్స అందించే పరికరాలు లేవనీ, మౌలిక సదుపాయాలు కూడా అధ్వానంగా ఉన్నాయని గతంలో బ్రిటన్‌ జైళ్ల శాఖ విడుదల చేసిన నివేదికలు స్పష్టం చేశాయి.

నీరవ్‌ కదలికలపై దృష్టి..
నీరవ్‌ మోదీ 2018, జనవరిలో భారత్‌ను విడిచిపెట్టి పారిపోయాక ఆయన ప్రతీ కదలికపై భారత విచారణ సంస్థలు దృష్టిసారించాయి. యూరప్, యూఏఈకి నీరవ్‌ సాగించిన రాకపోకలు, ఆయన ఆర్థిక వ్యవహారాలు, సమావేశాలను పరిశీలించాయి. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ..‘నీరవ్‌ మోదీ తన మామయ్య మెహుల్‌ చోక్సీ అంత తెలివైనవాడు కాదు. ఎందుకంటే వీరిద్దరి పరారీ అనంతరం సీబీఐ, ఈడీలు రెడ్‌కార్నర్‌ నోటీసులు ఇవ్వాల్సిందిగా ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించాయి. దీంతో వెంటనే చోక్సీ స్పందిస్తూ.. ఇది రాజకీయ ప్రేరేపితమైన కేసు అని తన ప్రతిస్పందనను దాఖలుచేశారు. కానీ భారత అధికారులు దేశం బయట తనను పట్టుకోలేరన్న ధైర్యంతో నీరవ్‌ ఈ విషయమై స్పందించలేదు’ అని వ్యాఖ్యానించారు.

మాల్యా కేసుతో అవగాహన..
నీరవ్‌ మోదీకి వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాలు అంతర్జాతీయంగా ఏ న్యాయస్థానాల్లో అయినా చెల్లుబాటు అవుతాయని కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ‘అంటిగ్వాలో తలదాచుకుంటున్న నీరవ్‌ మోదీ మామయ్య చోక్సీని ఆ దేశం భారత్‌కు అప్పగిస్తుందని భావిస్తున్నాం. నీరవ్‌ను పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుడిగా ప్రకటించాలన్న పిటిషన్‌ కోర్టులో పెండింగ్‌లో ఉంది. ఇది త్వరలోనే ఆమోదం పొందుతుందని అనుకుంటున్నాం. నీరవ్‌ మోదీని త్వరలోనే బ్రిటన్‌ భారత్‌కు అప్పగిస్తుంది.

ఎందుకంటే ఆయనకు వ్యతిరేకంగా బలమైన ఆధారాలను అందించాం. కింగ్‌ ఫిషర్‌ అధినేత విజయ్‌మాల్యా కేసులో ఎదురైన అనుభవాలతో బ్రిటన్‌ అప్పగింత చట్టాలపై భారత విచారణ సంస్థలకు ఓ అవగాహన వచ్చింది. అందుకు అనుగుణంగానే భారత అధికారులు నీరవ్‌ కేసు విషయంలో జాగ్రత్తగా వ్యవహరించారు’ అని వెల్లడించారు. ఈ కేసు దర్యాప్తులో పాల్గొనాలని భారత సంస్థలకు బ్రిటన్‌ నుంచి ఇంకా ఆహ్వానం రాలేదన్నారు. ఈ కేసులో ఇతర నిందితులుగా ఉన్న నీరవ్‌ సోదరుడు నిషాల్, సోదరి పూర్వీలకు వ్యతిరేకంగా సాక్ష్యాలను సేకరిస్తున్నట్లు పేర్కొన్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top