‘విక్రమ్‌’ ల్యాండ్‌ అయిన ప్లేస్‌ ఇదే.. నాసా ఫొటోలు

NASA Releases Images of Chandrayaan 2 landing site - Sakshi

అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థం (నాసా) శుక్రవారం చంద్రయాన్‌-2కు సంబంధించిన కీలక ఫొటోలను విడుదల చేసింది. నాసాకు చెందిన లునార్‌ రికనైజాన్స్‌ ఆర్బిటర్‌ కెమెరా (ఎల్‌ఆర్‌వోసీ) చంద్రుడి సమీపంలో తిరుగుతున్న సమయంలో ఈ ఫొటోలను తీసింది. చంద్రుడి దక్షిణ ధ్రువంలో చంద్రయాన్‌-2ను సాఫ్ట్‌ ల్యాండింగ్‌ చేయాలని ఇస్రో భావించిన సంగతి తెలిసిందే. చంద్రయాన్‌-2 నుంచి వేరయిన విక్రమ్‌ ల్యాండర్‌ చంద్రుడిపై హార్డ్‌ ల్యాండింగ్‌ చేసిందని పేర్కొంటూ.. అది హార్డ్‌ ల్యాండ్‌ అయిన ప్రదేశానికి సంబంధించిన హై-రిజల్యూషన్‌ ఫొటోలను నాసా విడుదల చేసింది. 

చంద్రుడి ఉపరితలంపైనున్న ఎత్తైన మైదానప్రాంతంలో విక్రమ్‌ ల్యాండర్‌ను సుతిమెత్తగా ల్యాండ్‌ చేసేందుకు ఇస్రో ప్రయత్నించింది. అయితే, సెప్టెంబర్‌ 7వ తేదీన చంద్రుడికి చేరువుగా వెళ్లినప్పటికీ.. చివరి నిమిషంలో ల్యాండర్‌తో ఇస్రో గ్రౌండ్‌ సెంటర్‌కు సంబంధాలు తెగిపోయాయి. తిరిగి ల్యాండర్‌తో సంబంధాలు పునరుద్ధరించేందుకు ఇస్రో శాయశక్తులా కృషి చేసినా.. అది వీలుపడలేదు. విక్రమ్‌ ల్యాండర్‌ చంద్రుడిపై హార్డ్‌ ల్యాండింగ్‌ అయిన విషయాన్ని ఇస్రో కూడా ఇప్పటికే నిర్ధారించింది. విక్రమ్‌ ల్యాండ్‌ కావాల్సిన నిర్ధారిత ప్రదేశాన్ని ఎల్‌ఆర్‌వోసీ తన కెమెరాలో బంధించింది. చంద్రుడిపై 150 కిలోమీటర్ల పరిధిమేర చిత్రించింది. అయితే, విక్రమ్‌ కచ్చితంగా ఎక్కడ హార్డ్‌ ల్యాండ్‌ చేసిందనేది ఇంకా గుర్తించాల్సి ఉందని నాసా తెలిపింది. 

ఈ నెల 7న చంద్రుడి దక్షిణ ధ్రువానికి చేరువలో దిగుతూ విక్రమ్‌ ల్యాండర్‌ గల్లం‍తైన సంగతి తెలిసిందే. చంద్రుడి ఉపరితలంపై దిగుతున్న సమయంలో కేవలం 2.1 కిలోమీటర్ల దూరంలో విక్రమ్‌ ల్యాండర్‌తో సంబంధాలు తెగిపోయాయి. దానితో తిరిగి కమ్యూనికేషన్‌ పునరుద్ధరించేందుకు ఇస్రో, అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ప్రయత్నించినప్పటికీ.. అది సఫలం కాలేదు. ఆ ప్రదేశంలో 14 రోజుల పగటి సమయం శనివారం ఉదయంతో ముగిసిపోయింది. చంద్రుడిపై పగటివేళ 130 డిగ్రీల సెల్రియస్‌ ఉష్ణోగ్రతలు ఉండగా.. రాత్రి వేళ దాదాపు మైనస్‌ 200 డిగ్రీలకు అక్కడి ఉష్ణోగ్రతలు పడిపోతాయి. విక్రమ్‌ ల్యాండర్‌.. అందులోని రోవర్‌ ఇంతటి చల్లటి వాతావరణాన్ని తట్టుకోలేవు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top