శ్రీలంకకు 450 మిలియన్‌ డాలర్ల సాయం

narendra Modi Announces Financial Assistance To sri Lanka - Sakshi

న్యూఢిల్లీ : శ్రీలంక అభివృద్ధికి భారత్‌ పూర్తి సహకారం అందిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. దేశ ఆర్థిక అభివృద్ధికి, ఉగ్రవాదాన్ని ధీటుగా ఎదుర్కొనేందుకు శ్రీలంకకు 450 మిలియన్‌ డాలర్ల ఆర్థిక సాయం అందజేయనున్నట్టు మోదీ ప్రకటించారు. ఇటీవల శ్రీలంక అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన గొటబాయా రాజపక్స.. తన తొలి విదేశీ పర్యటనలో భాగంగా గురువారం ఢిల్లీ చేరుకున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం ప్రధాని మోదీతో రాజపక్స భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరుదేశాల అభివృద్ధి, ఉగ్రవాదం నివారణకు చేపట్టాల్సిన చర్యలపై ఇరువురు నేతలు చర్చించారు. 

అనంతరం మోదీ మాట్లాడుతూ.. శ్రీలంకతో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి భారత్‌ ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఏప్రిల్‌ 21 ఈస్టర్‌ రోజున శ్రీలంకలో జరిగిన దాడులను ఖండించిన మోదీ.. ఉగ్రవాదం పోరులో భాగంగా శ్రీలంకకు 50 మిలియన్‌ డాలర్లు అందజేయనున్నట్టు తెలిపారు. అలాగే  శ్రీలంక ఆర్థిక వృద్ధి కోసం 400 మిలియన్‌ డాలర్ల సాయం ప్రకటించారు. ఇండియన్‌ హౌసింగ్‌ ప్రాజెక్టు కింద శ్రీలకంలో ఇప్పటికే 46,000 గృహాలు నిర్మించామని.. భవిష్యత్తులో మరో  14,000 గృహాలు నిర్మిస్తామని తెలిపారు. శ్రీలంక ఎన్నికల్లో విజయం సాధించిన రాజపక్సకు అభినందనలు తెలిపారు. 

రాజపక్స మాట్లాడుతూ.. శ్రీలంక అభివృద్ధికి భారత్‌ ముందుకు వచ్చినందుకు మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. నిఘా వర్గాలను మరింత శక్తివంతం చేసేందుకు ప్రధాని మోదీ 50 మిలియన్‌ డాలర్ల సాయం ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు. ఇరు దేశాల మధ్య   ద్వైపాక్షిక సంబంధాలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి కృషి చేస్తానని తెలిపారు. కాగా, శుక్రవారం ఉదయం రాజపక్సకు రాష్ట్రపతి భవన్‌ వద్ద రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోదీ సాదర స్వాగతం పలికారు. అనంతరం భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్‌ను రాజపక్స కలిసి చర్చలు జరిపారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top