500 ఏళ్లుగా.. ‘నేకెడ్‌ ఫెస్టివల్‌’.. ఈసారి..!

Japan Hadaka Matsuri Festival Approx 10000 People Gathered - Sakshi

జపాన్‌ సంప్రదాయ ఉత్సవం ‘హడకా మట్సూరీ’

ఒకయామా/జపాన్‌: ‘హడకా మట్సూరీ’ సంబరాల్లో పాల్గొన్న జపాన్‌ వాసులు ఈసారి పెద్దగా గాయాలేమీ కాకుండానే బయటపడ్డారు. అంతేకాదు ఈ ఉత్సవంలో ‘అదృష్ట కర్రలు’ సంపాదించిన ఇద్దరు వ్యక్తులు సంబరాల్లో మునిగిపోయారు. ‘హడకా మట్సూరీ’ అనేది జపాన్‌లో తరతరాలుగా ఆచరిస్తున్న ఓ సంప్రదాయం. ఏటా ఫిబ్రవరి మూడో శనివారం.. హోన్షు ద్వీపకల్పంలోని సైదీజీ కొన్నినిన్‌ అనే ఆలయ ప్రాంగణంలో ఈ వేడుక జరుగుతుంది. కేవలం గోచీ గుడ్డలు ధరించి.. వేలాది మంది మగవాళ్లు ఇక్కడికి చేరుకుంటారు. పరిసర ప్రాంతాల్లో లభించే మద్యాన్ని ఫూటుగా తాగేసి ఆలయం చుట్టూ పరిగెత్తుతారు. అనంతరం పూజారి.. వారిపై చల్లని నీళ్లు చిలకరించగా.. పునీతులైనట్లుగా భావిస్తారు. 

కాగా పంటలు కోతకు వచ్చిన సమయంలో జరిగే ఈ వేడుక సందర్భంగా పూజలు నిర్వహించిన అనంతరం... లైట్లు ఆర్పివేసి.. పూజకు వినియోగించిన కర్రల్లో తాయెత్తులు(గంధపు చెక్కలాంటివి) ఉంచి పూజారి ఆ గుంపుపైకి విసురుతాడు. వీటిని దొరకబుచ్చుకున్న వారిని అదృష్టం వరిస్తుందని జపాన్‌ వాసుల నమ్మకం. అందుకే అదృష్ట కర్రలను దక్కించుకోవడానికి.. దాదాపు 30 నిమిషాల పాటు హోరాహోరీగా పోరాడతారు. ఈ క్రమంలో కొంత మందికి స్వల్పగాయాలైతే... మరికొంత మందికి ఆస్పత్రిపాలుకాగా.. ఒకరిద్దరు చనిపోయిన దాఖలాలు సైతం ఉన్నాయి. అయినప్పటికీ దాదాపు 5 శతాబ్దాలుగా జపాన్‌ వాసులు ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు.(ఉచితంగా 2 వేల ఐఫోన్లు పంచిన జపాన్‌!)

ఇక తాజాగా శనివారం జరిగిన వేడుకలో భాగంగా దాదాపు 10 వేల మంది గోచీలతో ఆలయంలోకి ప్రవేశించారు. అందులో ఇద్దరికి మాత్రమే.. 20 సెంటీమీటర్ల పరిణామం కలిగిన అదృష్ట కర్రలు లభించాయి. ఈ ఏడాది వేడుక విశేషాల గురించి ఓ స్థానికుడు మాట్లాడుతూ... ‘‘చలి విపరీతంగా ఉన్న ఫిబ్రవరి మాసంలో.. ఏడాదికోసారి ఇలా అందరం ఇక్కడికి వస్తాం. ఫండోషీ(గోచీ చుట్టుకుని), టాబి(తెల్లని రంగు గల సాక్సులు) ధరించి ఈ ఉత్సవంలో పాల్గొంటాం. హడకా మస్తూరి అనేది పంటలు కోతకు వచ్చిన సమయంలో జరిగే ఉత్సవం. ఈ సంప్రదాయాన్ని కొనసాగించడం ద్వారా భవిష్యత్తు తరాలకు కూడా వ్యవసాయం గురించి అవగాహన కల్పించినట్లు అవుతుంది. ఈ పండుగకు చాలా ప్రాశస్త్యం ఉంది’’అని చెప్పుకొచ్చాడు. ఇందుకు సంబంధించిన వార్తలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టడంతో నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ‘‘నేకెడ్‌ ఫెస్టివల్‌(నగ్న ఉత్సవం)లో ఈసారి అంతా బాగానే జరిగినట్లు ఉంది కదా’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.


  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top