నింగికేగిన దిగ్గజాలు.. చారిత్రక నిర్ణయాలు..మహిళా విజయాలు

International Affairs 2018 Flashback - Sakshi

అనేక ఘటనలు, సంఘటనలు - ఆయా దేశాల్లోని పరిణామాలు ఆందోళన కలిగించాయి. అనేక ఆటుపోటుల మధ్య అంతర్జాతీయంగా 2018 సంవత్సరం పలు చేదు జ్ఞాపకాలను మిగిల్చడంతో పాటు పలు చారిత్రక ఘటనలకు వేదికగా నిలిచింది. కీలకమైన అంతర్జాతీయ పరిణామాలపై సాక్షి రౌండప్...!!!

అఫ్గాన్‌లో మారణహోమం
(జనవరి 30) అఫ్గానిస్తాన్‌ రాజధాని కాబూల్‌లో తాలిబన్లు మారణహోమం సృష్టించారు. నగరంలో రద్దీగా ఉన్న ప్రాంతంలో జరిగిన ఆత్మాహుతి దాడిలో 95 మంది ప్రాణాలు కోల్పోగా 151 మంది గాయపడ్డారు. అంతర్యుద్ధంతో తీవ్రంగా దెబ్బతిన్న కాబూల్‌లో ఇటీవల కాలంలో చోటుచేసుకున్న అతిపెద్ద దాడి ఇదే.

స్వీడన్‌తో బంధం బలోపేతం
(ఫిబ్రవరి 5) రక్షణ, భద్రత రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని భారత్, స్వీడన్‌లు నిర్ణయించాయి. సరికొత్త  వ్యూహాత్మక భాగస్వామ్యంతో పటిష్ట సహకారానికి ఇరు దేశాలు అంగీకరించాయి. 5 రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈమేరకు ఒప్పందాలు కుదుర్చుకున్నారు.

ఘోర విమాన దుర్ఘటన
(మార్చి 13) నేపాల్‌లోని ఖట్మాండు విమానాశ్రయంలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఢాకా నుంచి అమెరికాకు బయలుదేరిన బంగ్లాదేశ్‌ విమానం ఖట్మాండు అంతర్జాతీయ విమానాశ్రయంలో కుప్పకూలింది. ఈ ఘటనలో 50మంది ప్రయాణికులు మరణించారు.

విశ్వవిజేత స్టీఫేన్‌ హాకింగ్‌ మరణం
(మార్చి 14) మన కాలపు మహా మేధావి... ఐన్‌స్టీన్‌కు మాత్రమే సాటిరాగల విజ్ఞానఖని స్టీఫెన్‌ హాకింగ్ ‌(76) కన్నుమూశారు. ఆధునిక శాస్త్ర విజ్ఞానానికి ఆద్యుడైన గెలీలియో పుట్టిన జనవరి 8 న జన్మించి, మరో విఖ్యాత శాస్త్రవేత్త ఐన్‌స్టీన్‌ జన్మదినం రోజైన మార్చి 14న కన్నుమూశారు. విశ్వాంతరాళంలో మనిషిని పోలిన జీవులుండొచ్చునని పదేళ్ల క్రితం జోస్యం చెప్పి వారివల్ల ప్రమాదం ముంచుకు రావొచ్చునని ఆయన హెచ్చరించారు.

సిరియాలో మరో విష దాడి
(ఏప్రిల్‌ 8) అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న సిరియాలో మరో విష రసాయన దాడి జరిగింది. తిరుగుబాటుదారుల అధీనంలో ఉన్న డౌమా పట్టణంపై జరిగిన ఈ దాడిలో 42 మందికి పైగా ప్రజలు మృత్యువాతపడ్డారు. వందలాది పౌరులు శ్వాస, కంటిచూపు సమస్యలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తిరుగుబాటుదారులు లక్ష్యంగా సిరియా ప్రభుత్వమే ఈ దారుణానికి పాల్పడిందన్న ఆరోపణలు వచ్చాయి. 

257 మంది దుర్మరణం
(ఏప్రిల్‌ 11) ఆఫ్రికా ఖండంలోని ఉత్తరాది దేశమైన అల్జీరియాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్మీ సిబ్బంది, వారి కుటుంబాలతో వెళ్తున్న సైనిక విమానం గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో 257 మంది మృతిచెందారు. రాజధాని అల్జీర్స్‌కి దగ్గరలోని బౌఫరిక్‌ సైనిక కేంద్రం నుంచి టేకాఫ్‌ అయిన విమానం.. సమీపంలోని పొలాల్లో కూలడంతో పెద్ద ఎత్తున మంటలు రేగాయి. ఆ మంటల్లో చాలా మంది సజీవదహనమయ్యారు.

కూచిభోట్ల దోషికి జీవిత ఖైదు
(మే 6) అమెరికాలోని కన్సాస్‌ సిటీలో భారతీయ ఇంజనీరు కూచిభొట్ల శ్రీనివాస్‌ హత్య కేసులో నిందితుడికి యూఎస్‌ ఫెడరల్‌ కోర్టు జీవిత ఖైదు విధించింది. 2017, ఫిబ్రవరి 22 న కన్సాస్‌లోని ఒక బార్‌లో కూచిభొట్ల, అతని స్నేహితుడిపై.. నిందితుడు ఆడం ప్యూరింటన్‌ (52) కాల్పులు జరిపాడు. ‘మా దేశం విడిచి వెళ్లండి’ అని అరుస్తూ ఈ ఘాతుకానికి పాల్పడి అక్కడి నుంచి పారిపోయాడు.

ప్రిన్స్‌ హ్యారీ, మేఘన్‌ మార్కల్‌ వివాహం
(మే 19) బ్రిటన్‌ రాజకుమారుడు ప్రిన్స్‌ హ్యారీ (33), అమెరికా నటి మేఘన్‌ మార్కల్ ‌(36)లు వివాహం బంధంతో ఒక్కటయ్యారు. కొత్త జంట ప్రిన్స్‌ హ్యారీ-మేఘన్‌ మార్కల్‌కు రాణి ఎలిజబెత్‌ 2 సస్సెక్స్‌ డ్యూక్, సస్సెక్స్‌ డచెస్‌ బిరుదులు ప్రదానం చేశారు. వివాహానికి మన దేశం నుంచి నటి ప్రియాంక చోప్రా, మైనా మహిళా ఫౌండేషన్‌ వ్యవస్థాపకురాలు సుహానీ జలోటా, తన ఫౌండేషన్‌ సభ్యులతో హాజరయ్యారు.

ట్రంప్ ‌- కిమ్‌ చారిత్రాత్మక భేటీ
(జూన్ 12) కొరియా ద్వీపకల్పంలో అణు నిరాయుధీకరణే లక్ష్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌– ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ల మధ్య జరిగిన చరిత్రాత్మక శిఖరాగ్ర సదస్సు విజయవంతమైంది. ట్రంప్‌ ఆశించినట్లుగానే అణు నిరాయుధీకరణకు ఉత్తర కొరియా అంగీకరించగా.. అందుకు ప్రతిగా ఉత్తర కొరియా భద్రతకు అమెరికా నుంచి కిమ్‌ హామీ పొందారు.

సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్ 
(జూన్‌ 24) కట్టుబాట్లకు మారుపేరైన సౌదీలో దశాబ్దాలుగా మహిళల డ్రైవింగ్‌పై ఉన్న నిషేధాన్ని ఆ దేశ యువరాజు బిన్‌ సల్మాన్‌ ఎత్తివేసిన సంగతి తెలిసిందే. ఈ ఉత్తర్వులు 2018, జూన్‌ 24 నుంచి అమల్లోకి వచ్చాయి. మహిళల డ్రైవింగ్‌పై నిషేధాన్ని ఎత్తివేయడంతో ఆదివారం తెల్లవారుజామున అధిక సంఖ్యలో మహిళలు కార్లతో రోడ్లపైకి చేరి సంబరాలు చేసుకున్నారు. తొలిసారి డ్రైవింగ్‌కు బయలుదేరినవారికి కొందరు మహిళలు పూలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. 

నవాజ్‌ షరీఫ్‌కు 10 ఏళ్ల జైలు శిక్ష
(జూలై 6) అవెన్‌ఫీల్డ్‌ అవినీతి కేసులో పాకిస్తాన్‌ మాజీ ప్రధానమంత్రి నవాజ్‌ షరీఫ్‌కు 10 ఏళ్ల జైలు శిక్ష పడింది. షరీఫ్‌ తనయ మర్యమ్‌, అల్లుడు కెప్టెన్‌ సర్దార్‌లు కూడా ఈ కేసులో దోషులుగా తేలారు. కానీ సెప్టెంబర్‌లో షరీఫ్‌ జైలు శిక్షను రద్దు చేసి.. అతన్ని విడుదల చేశారు.

నాటో దేశాల సరసన భారత్‌
(ఆగస్టు 1) భారతదేశానికి వ్యూహాత్మక రక్షణ, హైటెక్‌ ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చే దిశగా అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌కు  వ్యూహాత్మక భాగస్వామ్య హోదా కల్పించే ‘స్ట్రేటజిక్‌ ట్రేడ్‌ ఆథరైజేషన్‌-1 (ఎస్‌టీఏ- 1)’  ప్రతిపత్తిని మంజూరు చేసింది. ప్రధానంగా ‘నాటో’లోని తన మిత్రదేశాలకు మాత్రమే కల్పించే అవకాశాన్ని తాజాగా భారత్‌కు కూడా వర్తింపచేస్తున్నట్లు అమెరికా ప్రభుత్వం ప్రకటించింది.

పాక్‌ ప్రధానిగా ఇమ్రాన్‌ఖాన్‌
(ఆగస్టు 18) పాకిస్తాన్‌ క్రికెట్‌ దిగ్గజం,  తెహ్రీక్‌-ఇ-న్సాఫ్‌ (పీటీఐ) చైర్మన్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ ఆ దేశ 22 వ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. 

ప్రకృతి విలయం.. 832 మంది మృతి
(సెప్టెంబరు 29) ఇండోనేసియాలోని సులవేసి ద్వీపంలో భూకంపం, సునామీ కారణంగా భారీగా ప్రాణనష్టం సంభవించింది. ఈ ఘటనలో 832 మంది చనిపోయారు. ప్రజలు భారీగా మృత్యువాత పడిన నేపథ్యంలో అంటువ్యాధులు వ్యాపించకుండా అధికారులు శవాలను సామూహికంగా ఖననం చేశారు.

నోబెల్‌ శాంతి బహుమతి విజేతలు
(అక్టోబరు 5) ప్రపంచ వ్యాప్తంగా చెలరేగుతున్న యుద్ధాలు, అంతర్యుద్ధాల కారణంగా కల్లోలంగా మారిన ప్రాంతాల్లో చోటుచేసుకుంటున్న లైంగిక హింసపై అలుపెరుగని పోరాటం జరుపుతున్న... కాంగో వైద్యుడు డెనిస్‌ మక్వీజ్‌ (63), ఇరాక్‌లోని యాజిది తెగకు చెందిన యువతి నదియా మురాద్‌ (25) లకు నోబెల్‌ శాంతి పురస్కారం దక్కింది. కాగా డెనిస్‌ లైంగిక బానిసలకు బాధితులకు అండగా నిలిస్తే నదియా స్వయంగా ఆ బాధలన్నీ అనుభవించారు. 
 
మలేసియాలో మరణశిక్ష రద్దు
(అక్టోబరు 10) తీవ్రమైన నేరాలకు పాల్పడిన దోషులకు విధించే మరణశిక్షను త్వరలోనే రద్దు చేస్తామని మలేసియా ప్రభుత్వం ప్రకటించింది. ఆ దేశ ప్రధాని మహతీర్‌ మొహమ్మద్‌ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. మలేసియా ప్రభుత్వ నిర్ణయాన్ని అమ్నెస్టీ ఇంటర్నేషనల్, మానవహక్కుల సంస్థ ‘లాయర్స్‌ ఫర్‌ లిబర్టీ’ స్వాగతించాయి.

సెనెట్‌ నీది హౌస్‌ నాది
(నవంబర్‌ 8) అమెరికా మధ్యంతర ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలొచ్చాయి. ప్రతినిధుల సభ డెమొక్రటిక్‌ పార్టీ వశం కాగా.. ఎగువ సభ సెనెట్‌లో అధికార రిపబ్లికన్‌ పార్టీ తన మెజారిటీని నిలబెట్టుకుంది. ప్రతినిధుల సభకు ఎన్నికైన తొలి ముస్లిం మహిళలుగా రషిదా త్లాయిబ్, సోమాలియాకు చెందిన ఇల్హాన్‌ ఒమర్‌లు గుర్తింపు పొందారు.

సీనియర్‌ బుష్‌ కన్నుమూత
(డిసెంబరు 1) పార్కిన్‌సన్‌ వ్యాధితో బాధపడుతున్న అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్‌ హెర్బర్ట్‌ వాకర్‌ బుష్ ‌(94) శుక్రవారం కన్నుమూశారు. సీనియర్‌ బుష్‌గా సుపరిచితులైన ఆయన 1989- 1993 మధ్య కాలంలో అమెరికా 41వ అధ్యక్షుడిగా పనిచేశారు. 

మిస్‌ వరల్డ్‌గా మెక్సికన్‌ సుందరి
(డిసెంబరు 8) ఈ ఏడాది ప్రపంచ సుందరిగా మెక్సికోకు చెందిన వెనెస్సా పోన్స్‌ డీ లియోన్ ‌(26) ఎంపికయ్యారు. చైనాలో జరిగిన ఈ అందాల పోటీల్లో థాయ్‌లాండ్‌కు చెందిన నికోలేనే పిచప లిమ్‌స్నుకన్‌ మొదటి రన్నరప్‌గా నిలిచారు. ఇక మిస్‌ ఇండియా 2018 అనుకృతి వ్యాస్‌ టాప్ ‌- 30లో చోటు దక్కించుకున్నారు. 

ఐర్లాండ్‌లో.. ఇక అబార్షన్‌ చట్టబద్ధం
(డిసెంబరు 13) అబార్షన్‌ను చట్టబద్ధం చేస్తూ ఐర్లాండ్‌ పార్లమెంట్‌ రాజ్యాంగ సవరణ చేసింది. 80 శాతం క్యాథలిక్‌లు ఉండే ఆ దేశంలో ఇదొక చరిత్రాత్మక నిర్ణయం. కాగా ఆరేళ్ల క్రితం అనారోగ్య కారణాల వల్ల గర్భస్రావానికి అనుమతివ్వాలంటూ భారతీయురాలు సవిత చేసిన విన్నపాన్ని ఐరిష్‌ ప్రభుత్వం తిరస్కరించడంతో ఆమె ప్రాణాలు కోల్పోయారు.

మిస్‌ యూనివర్స్‌గా ఫిలిప్పిన్స్‌ సుందరి
(డిసెంబరు 17) మిస్‌ యూనివర్స్‌ 2018 కిరీటాన్ని ఫిలిప్పీన్స్‌ యువతి కాట్రియానా గ్రే సొంతం చేసుకుంది. బ్యాంకాక్‌లో జరిగిన ఫైనల్లో తొలి రన్నరప్‌గా దక్షిణాఫ్రికాకు చెందిన తామరిన్‌ గ్రీన్, రెండో రన్నరప్‌గా వెనెజులాకు చెందిన స్టీఫనీ గుటీరెజ్‌ నిలిచారు.

సిరియాపై ట్రంప్‌ సంచలన ప్రకటన
(డిసెంబరు 19) సిరియా నుంచి అమెరికా దళాలను ఉపసంహరించుకుంటున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంచలన ప్రకటన చేశారు. ‘సిరియాలో ఐఎస్‌ను ఓడించాం. నా అధ్యక్ష కాలంలో పూర్తిచేయాలనుకున్న లక్ష్యం అది’ అని ఆయన ట్వీట్‌ చేశారు. కాగా సిరియాలో ఐఎస్‌ సృష్టిస్తున్న అలజడి కారణంగా మారణహోమం చెలరేగుతున్న సంగతి తెలిసిందే.

మృత్యు సునామీ (సాక్షి 2018 రౌండప్)
(డిసెంబర్ 23) ఇండోనేషియాను మళ్లీ జల విలయం ముంచెత్తింది. సముద్రం నుంచి ఉప్పెనలా దూకొచ్చిన మృత్యు అలల కారణంగా... ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపే దాదాపు 400 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. మరో వంద మంది జాడ ఇంకా తెలియరాలేదు. ఈ అలల సునామీకి పశ్చిమ జావా, దక్షిణ సుమత్రా దీవులు అతలాకుతలం కాగా 15 వందలకుపైగా క్షతగాత్రులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top