భారత్‌లో ఏకంగా 927 ఉగ్రదాడులు..

భారత్‌లో ఏకంగా 927 ఉగ్రదాడులు.. - Sakshi


న్యూఢిల్లీ: భారత్‌కు ఉగ్రముప్పు రోజురోజుకు పెరుగుతోంది. 2016లో ప్రపంచంలో ఉగ్ర పీడిత దేశాల జాబితాలో భారత్ మూడో స్థానానికి వచ్చింది. భారత్‌ కంటే పాకిస్తాన్‌ మెరుగైన స్థానంలో ఉంది. అమెరికా విదేశాంగ శాఖ వివరాల ప్రకారం భారత్‌లో 2016లో దాడులు పెరిగాయి. ఉగ్రవాద బాధిత దేశాల్లో మొదటి రెండు స్థానాల్లో ఇరాక్‌, ఆఫ్ఘనిస్తాన్‌ ఉండగా మూడో స్థానంలో ఇండియా ఉంది. ప్రపంచంలో ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌ భారత్‌ కంటే వెనుకుండటం విశేషం. 2016లో ప్రపంచం మొత్తం మీద 11,072 ఉగ్రదాడులు జరిగాయి. 2015లో భారత్‌లో 798 ఉగ్రదాడులు జరగ్గా 2016లో ఏకంగా 927 (16శాతం) దాడులు జరిగాయి.



ఈదాడుల్లో 2015లో 289 మంది మృత్యువాత పడగా 2016లో మాత్రం వారి సంఖ్య 337కు చేరింది. తీవ్రంగా గాయపడిన వారి సంఖ్య 500 నుంచి 636కు పెరిగింది. దాయాది దేశం పాకిస్తాన్‌లో మాత్రం 2015లో 1010 ఉగ్రదాడులు నమోదవ్వగా, 2016లో మాత్రం గణనీయంగా 734కు తగ్గింది. ఆశ్చర్యకరంగా అమెరికా పర్యవేక్ష సంస్థ ప్రమాదకర ఉగ్రవాద జాబితాలో నక్సలిజంను చేర్చింది. అత్యంత ప్రమాదకర ఉగ్రవాద సంస్థలైన ఐసిస్‌, తాలిబన్‌ల తర్వాత నక్సలిజం ద్వారా ఎక్కువ దాడులు జరిగినట్టు తెలిపింది.



భారత్‌లో జరిగిన ఈ దాడుల్లో 93శాతం ఒక్క జమ్మూ కశ్మీర్‌లో జరిగినట్టు ప్రకటించింది. 2016-17 భారత హోంమంత్రిత్వ శాఖ నివేదికి ప్రకారం జమ్మూ కశ్మీర్‌లో ఏకంగా 54.81శాతం ఉగ్రదాడుల పెరిగాయి. అంతేకాకుండా ఉగ్రవాదులు చేసే కిడ్నాప్‌ల సంఖ్య 866 నుంచి 317కు చేరింది. మోడీ ప్రభుత్వం ఉగ్రదాడులపై కఠినంగా వ్యవహరిస్తోంది. అయితే ప్రాణనష్టం దేశంలో 0.4 శాతంగా ఉంది. ఇది ప్రపంచ వ్యాప్తంగా 2.4గా ఉంది. భారత్‌లో జరిగిన ఉగ్రదాడుల్లో 73శాతం వాటిలో ప్రాణనష్టం తక్కువగా ఉంది. 104 ఉగ్రపీడిత దేశాల్లో జరిగిన దాడుల్లో ఏకంగా 55శాతం దాడులు ఇరాక్‌, ఆఫ్ఘనిస్తాన్‌, ఇండియా, పాకిస్తాన్‌లో జరిగినవే.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top