డయాబెటీస్‌కు కరోనా యమ డేంజర్‌! | Sakshi
Sakshi News home page

డయాబెటీస్‌కు కరోనా యమ డేంజర్‌!

Published Mon, Jun 8 2020 4:11 PM

How Coronavirus Impact On Diabetes Patients - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ బారిన పడి మరణిస్తున్న వారిలో ఎక్కువ మంది మధుమేహ రోగులే ఉన్నారంటూ తొలుత వార్తలు వచ్చాయి. ఆ వార్తల్లో సమాధానాలకన్నా ప్రశ్నలే ఎక్కువగా ఉన్నాయి. కరోనా మృతుల కేసుల్లో మధుమేహంతో బాధ పడుతున్నవారు ఎంత మంది ఉన్నారు ? వారి శాతం ఎంత ? వారిలో టైప్‌ వన్‌ మధుమేహ రోగులు ఎక్కువ మంది ఉన్నారా ? టైప్‌–2 మధుమేహ రోగులు ఎక్కువ మంది ఉన్నారా ? వారు మధుమేహంతో బాధ పడుతూనే కరోనా బారిన పడి మరణించారా? లేదా మధుమేహం కారణంగా సంక్రమించిన ఇతర జబ్బులకు గురై కరోనాను తట్టుకోలేక మరణించారా? లాంటి ప్రశ్నలకు నాడు సమాధానాలు దొరకలేదు. (చదవండి : వాటి ద్వారా కరోనా సోకే అవకాశం తక్కువ!)
 
నాటి ప్రశ్నలకు నేటి సమాధానాలు చూస్తే ఆశ్చర్యం కలుగుతోంది.  
ఫిబ్రవరి నెల నుంచి ఏప్రిల్‌ నెల మధ్య ‘ఎన్‌హెచ్‌ఎస్‌’ నుంచి సేకరించిన డేటా ప్రకారం బ్రిటన్‌లో కరోనా వైరస్‌ బారిన పడి మరణించిన వారిలో 25 శాతం మంది మధుమేహ (డయాబెటిక్స్‌) రోగులో ఉన్నారు. ఇది సాధారణ జనాభాలో మధుమేహ రోగుల సంఖ్యకన్నా నాలుగింతలు ఎక్కువ. కరోనా వైరస్‌ సోకిన వారికి మధుమేహం ఉన్నట్లయితే వారిని ‘సీరియస్‌ కేసు’గానే పరిగణించి ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్లలోనే చేరుస్తున్నారు. అయినప్పటికీ వారిలో ప్రతి నలుగురు మధుమేహ రోగుల్లో ఒకరు మరణిస్తున్నారు. (చదవండి : ఇక ‘ఆరోగ్య సేతు’  బాధ్యత వారిదే..)

కరోనా బారిన పడి టైప్‌–2 మధుమేహంతో మరణిస్తున్న వారి సంఖ్య రెట్టింపుకాగా, టైపు–వన్‌ మధుమేహంతో మర ణిస్తున్న వారి సంఖ్య మూడున్నర రెట్లు ఎక్కువ కావడం మరింత ఆశ్చర్యం కలిగిస్తోంది. టైప్‌ వన్‌ అంటే చిన్నప్పుడే వచ్చే మధుమేహం. దానికి ఇన్సులిన్‌ ఇంజెక్షన్లు వాడుతారు. టైప్‌–టు మధుమేహం అంటే పెద్దయ్యాక లేదా లేట్‌ వయస్సులో వచ్చేది. శరీరంలో సహజసిద్ధంగా ఇన్సులిన్‌ ఉత్పత్తి పెంచేందుకు మాత్రలను, చివరకు ఇన్సులిన్‌ ఇంజెక్షన్‌ను వాడతారు.

టైప్‌–2 లేట్‌ వయస్సులో వస్తుందికనుక, అప్పటికి వారిలో రోగ నిరోధక శక్తి తగ్గిపోవడమే కాకుండా, ఇతర జబ్బులకు గురయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుందని, అలాంటప్పుడు వారిలో మరణాల సంఖ్య ఎక్కువ ఉండాల్సింది, తక్కువ ఉండడం ఆశ్చర్యంగా ఉందని, టైప్‌ వన్‌ కేసుల్లో ఎప్పటి నుంచో జబ్బుతో బాధ పడుతుండడం, టైప్‌–2లో అప్పుడప్పుడే జబ్బు బారిన పడిన వారు ఎక్కువగా ఉండడం అందుకు కారణం కావచ్చని వైద్య నిపుణులు అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో మరింత లోతుగా విశ్లేషణలు జరపాల్సిన అవపరం ఉందని వారన్నారు.

Advertisement
Advertisement