తూర్పు చైనా సముద్రంలో నౌకల ఢీ

Dozens missing after tanker collision in East China Sea  - Sakshi

32 మంది గల్లంతు

బీజింగ్‌ : తూర్పు చైనా సముద్రంలో ఆయిల్‌ ట్యాంకర్‌ నౌక, సరకు రవాణా నౌక ఢీకొన్న ప్రమాదంలో ట్యాంకర్‌కు చెందిన మొత్తం 32 మంది సిబ్బంది గల్లంతయ్యారు. వీరిలో 30 మంది ఇరాన్‌ దేశస్తులు కాగా ఇద్దరు బంగ్లాదేశీయులు. ఇరాన్‌ నుంచి 1.36 లక్షల టన్నుల ముడి చమురుతో వెళ్తున్న సాంచీ అనే రవాణా నౌక శనివారం సాయంత్రం షాంఘైకి 160 నాటికల్‌ మైళ్ల దూరంలో చైనాకు చెందిన, 64 వేల టన్నుల ధాన్యంతో అమెరికా నుంచి వస్తున్న సీఎఫ్‌ క్రిస్టల్‌ అనే మరో సరకు రవాణా నౌకను ఢీకొట్టింది. ముడిచమురు కావడంతో వెంటనే మంటలు ఎగిసిపడ్డాయి.

ట్యాంకర్‌కు చెందిన 32 మంది సిబ్బంది గల్లంతవ్వగా, క్రిస్టల్‌ నౌకలోని మొత్తం 21 మందిని సహాయక బృందాలు రక్షించాయి. ముడి చమురు వ్యాపించడంతో సముద్ర జలాలు కలుషితమయ్యాయని చైనా రవాణా మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆదివారం ఉదయానికి కూడా సాంచి ఇంకా నీటిపై తేలుతూ, మండుతూనే ఉందనీ, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పింది. గల్లంతైన వారిని వెతికేందుకు చైనా సముద్రతీర విభాగం అధికారులు 8 ఓడలను పంపించారు. దక్షిణ కొరియా కూడా ఓ విమానాన్ని, తీర ప్రాంత రక్షణ దళానికి చెందిన ఓ నౌకను పంపించి గాలింపు చర్యలు చేపడుతోంది. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top