ఆమె ఎలా తప్పించుకోగలిగారో? | Sakshi
Sakshi News home page

ఆమె ఎలా తప్పించుకోగలిగారో?

Published Sun, Sep 4 2016 8:59 AM

ఆమె ఎలా తప్పించుకోగలిగారో? - Sakshi

వాషింగ్టన్: డెమోక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి హిల్లరీ క్లింటన్ ఈ మెయిల్ వ్యవహారంలో ఎఫ్‌బీఐ శుక్రవారం విడుదల చేసిన విచారణ పత్రాలు ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు మరో ఆయుధంగా మారాయి. మంత్రిగా ఉన్న సమయంలో ఆమె ప్రైవేట్ ఈమెయిల్ సర్వర్‌ను ఉపయోగించారన్న అభియోగంలో తమకు ఎలాంటి ఆధారాలూ లభించలేదని దర్యాప్తు సంస్థ తన 58 పేజీల డాక్యుమెంటులో పేర్కొంది.

దీనిపై స్పందించిన రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి ట్రంప్... హిల్లరీ జాతి భద్రతను ప్రమాదంలోకి నెట్టారని ధ్వజమెత్తారు. ఎఫ్‌బీఐకి ఇచ్చిన వివరణలో తనకు సదరు ఈమెయిల్స్‌కు సంబంధించిన విషయాలేమీ గుర్తుకు రావడం లేదని క్లింటన్ చెప్పారు. 2013లో తాను మంత్రిగా ఉన్నప్పుడు రికార్డుల భద్రతపై ప్రభుత్వం నుంచి తనకెలాంటి సూచనలూ అందలేదని పేర్కొన్నారు. క్లింటన్ తన రెండు నంబర్ల నుంచి మెయిల్స్ పంపించడానికి 13 మొబైల్ ఫోన్లను ఉపయోగించినట్టు గుర్తించామని ఎఫ్‌బీఐ వెల్లడించింది.

‘దర్యాప్తు సంస్థకు హిల్లరీ ఇచ్చిన సమాధానం దిగ్భ్రాంతికి గురిచేసింది. విచారణ నుంచి ఆమె ఎలా తప్పించుకోగలిగారో నాకు అంతుపట్టడం లేదు. ఎఫ్‌బీఐకి హిల్లరీ ఇచ్చిన వివరణ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయేలా చేసింది. క్లింటన్ రహస్య ఈమెయిల్ సర్వర్ వ్యవహారం వల్ల దేశ భద్రతకు ముప్పు వాటిల్లుతుంది. చట్టాల్లో పారదర్శకతను ప్రశ్నిస్తోంది. దౌత్యపరంగానూ ఇది ప్రభావం చూపుతుంది’ అని ట్రంప్ ఓ ప్రకటనలో వ్యాఖ్యానించారు.  
 

Advertisement
Advertisement