కోవిడ్‌ కేసులు లక్ష పైనే

Coronavirus Confirmed Cases Close to One Lakh Globally - Sakshi

హుబే ప్రాంతంలో క్వారంటైన్‌ ఎత్తివేత?

97 దేశాలకు విస్తరించిన కరోనా వైరస్‌

ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన

బీజింగ్‌: ప్రపంచవ్యాప్తంగా కోవిడ్‌ బాధితుల సంఖ్య శనివారం నాటి లెక్కల ప్రకారం లక్ష దాటిపోగా, 3500 మందికిపైగా చనిపోయారు. చైనాలోని వూహాన్‌ సిటీలో గత డిసెంబరులో తొలిసారి కరోనా వైరస్‌ను గుర్తించగా.. తాజాగా ఇది 97 దేశాలకు విస్తరించడం ప్రపంచ ఆరోగ్య సంస్థను ఆందోళనకు గురి చేస్తోంది. భూటాన్, కామరూన్, సెర్బియా, దక్షిణాఫ్రికాల్లో కొత్తగా కోవిడ్‌ కేసులు నమోదయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. వేసవి కారణంగా వైరస్‌ తీవ్రత తగ్గుముఖం పడుతుందన్న అంచనాలకు శాస్త్రీయ ఆధారాలేవీ లేవని, అన్ని దేశాలూ వైరస్‌ కట్టడికి చేస్తున్న ప్రయత్నాల తీవ్రతను తగ్గించరాదని డబ్ల్యూహెచ్‌ఓ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ మైఖేల్‌ రయన్‌ స్పష్టం చేశారు. అమెరికాలో కోవిడ్‌ కారణంగా 14 మంది, ఇటలీలో  233 మంది మరణించారు.  

చైనాలో కొత్త కేసులూ తగ్గుముఖం  
చైనాలో కోవిడ్‌ కారణంగా మరణించిన వారి సంఖ్య 3070కు చేరుకుందని చైనా ఆరోగ్య కమిషన్‌ అధికారులు శనివారం తెలిపారు. వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయిన వారి సంఖ్య 80,651గా ఉంటే ప్రపంచవ్యాప్తంగా ఇది 1.02 లక్షలకు చేరుకుందని  వివరించారు. చైనా మొత్తమ్మీద శుక్రవారం 28  మంది మరణించగా, కొత్తగా 99 మందికి వైరస్‌ సోకింది. ఒక రోజులో కొత్తగా వ్యాధి సోకిన వారి సంఖ్య వంద కంటే తక్కువగా ఉండటం ఇదే తొలిసారి. వ్యాధి తీవ్రత తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో హుబే ప్రాంతంలో క్వారంటైన్‌ (విడిగా ఉంచడం)ను ఎత్తివేయనున్నట్లు చైనా సూచన ప్రాయంగా తెలిపింది. చైనా పొరుగునే ఉన్న దక్షిణ కొరియాలో శనివారం నాటికి వ్యాధి బారిన పడ్డ వారి సంఖ్య ఏడు వేలకు చేరుకుంది. ఇరాన్‌ లో ఇప్పటివరకు 145 మంది మరణించారు. వ్యాధిసోకిన వారి సంఖ్య 5823కి చేరినట్లు అయింది.  

‘కోవిడ్‌’ భవనం కూలింది
కోవిడ్‌ బాధితులను చికిత్స కోసం ఉంచిన ఓ భవనం కూలింది. చైనాలోని ఫుజియాన్‌ ప్రావిన్సు క్వాన్‌ఝౌ నగరంలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. 80 గదులున్న ఓ హోటల్‌ను ప్రస్తుతం కోవిడ్‌ బాధితుల క్వారంటైన్‌ కోసం ఉపయోగిస్తున్నారు. ఇప్పటి వరకు 30 మందిని రక్షించామని, శిథిలాల కింద మరో 70 మంది చిక్కుకుని ఉంటారని అధికారులు తెలిపారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top