గల్వాన్‌పై చైనాలో అసమ్మతి సెగ!

Chinese Citizens Anti-Government Posts on Galwan Clash - Sakshi

బీజింగ్‌: గల్వాన్‌ ప్రాంతంలో దురాక్రమణకు పాల్పడటం ద్వారా పొరుగుదేశం చైనా ఏం బావుకుందో ఏమో తెలియదుగానీ.. దేశంలోనే కాకుండా.. విదేశాల్లోని స్వదేశీయుల నుంచి అసమ్మతిని మాత్రం మూటగట్టుకుంటోంది. చైనాలో ప్రభుత్వం కనుసన్నలలో నడిచే మీడియా, సామాజిక మాధ్యమాల్లో భారత వ్యతిరేక వ్యాఖ్యానాలు చర్చలు కొనసాగుతున్నా.. ఇతర మాధ్యమాల్లో, విదేశాల్లోని చైనీయుల మధ్య జరుగుతున్న ఆన్‌లైన్‌ సంభాషణల్లోనూ గల్వాన్‌ లోయలో చైనా వ్యవహారంపై పలువురు ఆగ్రహంగా ఉన్నారు.

ఇప్పటికే పూర్తయి వివరాలు వెల్లడి కావాల్సిన ఓ ఆన్‌లైన్‌ సర్వే ద్వారా ఈ విషయం తెలుస్తోందని జాతీయ స్థాయి టెలివిజన్‌ చానల్‌ ఒకటి ఒక కథనాన్ని ప్రచురించింది. సుమారు 75 వేల మంది సామాజిక మాధ్యమాల్లో చేసిన పోస్ట్‌లను విశ్లేషించడం ద్వారా తాము ఈ అంచనాకు వచ్చినట్లు సెక్‌ల్యాబ్‌ అండ్‌ సిస్టమ్స్‌ అనే సంస్థ చెబుతోంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. చైనా ప్రభుత్వం మద్దతుతో నడిచే కొన్ని వ్యూహాత్మక సంస్థల్లో పనిచేసే వారు కూడా ప్రభుత్వం తీరు సరికాదని వ్యాఖ్యానించడం.

సెక్‌ ల్యాబ్‌ అండ్‌ సిస్టమ్స్‌ సోషల్‌మీడియా నెట్‌వర్క్‌లను గణిత శాస్త్ర సూత్రాల ఆధారంగా విశ్లేషించింది. ప్రవాస చైనా జర్నలిస్టుల సోషల్‌ మీడియా పోస్టుల్లో గల్వాన్‌ విషయంలో చైనా వైఖరిపై అసంతృప్తి వ్యక్తమవుతూండగా.. అదృశ్య శక్తి ఒకటి ఒకటి వీటన్నింటి వెనుక ఉందని చైనా ప్రభుత్వం ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని వీరు భావిస్తున్నారు. వీరే కాకుండా.. హాంకాంగ్, తైవాన్‌లలో ప్రజాస్వామ్యానికి మద్దతుగా ఆందోళనలు నిర్వహిస్తున్న వారు, ఇతర మద్దతుదారుల్లోనూ ఇదే తరహా సెంటిమెంట్లు నడుస్తున్నాయి.

ట్విట్టర్‌లో సుమారు 34 వేల మంది ఫాలోయర్లు ఉన్న జర్నలిస్ట్, చైనీస్‌ కుమిన్‌టాంగ్‌ విప్లవ కమిటీ సభ్యుడు డెంగ్‌ యూవెన్‌ భారత్‌తో సరిహద్దు గొడవలు చైనా నేతలకు ఏమాత్రం తగని పని అని ఒక కథనంలో వ్యాఖ్యానించారు. భారత్‌ చైనాల మధ్య యుద్ధం అసాధ్యమని గతంలో అనుకునేవాళ్లమని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని యూవెన్‌ వ్యాఖ్యానిస్తున్నారు. ట్విట్టర్‌లో రెండు లక్షల కంటే ఎక్కువమంది ఫాలోయర్లు ఉన్న హు పింగ్‌ కూడా యూవెన్‌ అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే చైనాలోనే కొంతమంది పౌరులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యానాలు చేస్తూండటం గమనార్హం. ప్రభుత్వ పెద్దల మధ్య అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయని, కమ్యూనిస్టు పార్టీ అంతర్గత సమావేశాల రికార్డింగ్‌లు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని వాంగ్‌ కియాన్‌కిన్‌ ఒక ట్వీట్‌ చేశారు.

కొంత కాలానికే ఈ ట్వీట్‌ డెలిట్‌ కావడం గమనార్హం. భారత్‌ అత్యవసరంగా రష్యా నుంచి 33 యుద్ధ విమానాలను కొనుగోలు చేస్తూండటం వారి సంబంధాలు చైనా కంటే ఆ దేశంతోనే బాగున్నాయని నిరూపిస్తున్నాయని ట్వీట్‌ ద్వారా వ్యాఖ్యానించారు. ఇలాంటి ప్రభుత్వ వ్యతిరేక వ్యాఖ్యలు, ట్వీట్లు, ఆలోచనలు ఒక పద్ధతి ప్రకారం వస్తున్నవి ఏమీ కావని, ప్రస్తుతానికి వీటిని గుసగుసలుగానే పరిగణించాలని సెక్‌ల్యాబ్స్‌ నిర్వహించిన సర్వే చెబుతోంది. సామాజిక మాధ్యమాల్లో ఊపిరిపోసుకుని ఆ తరువాత ఓ వ్యవస్థీకృత ఉద్యమంగా మారిన పలు ఉద్యమాలు కూడా ఇలాంటి చెదురుమదురు అసంతృప్తికర వ్యాఖ్యలతోనే మొదలైన విషయాన్ని గుర్తించాలని చెబుతోంది.  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top