నోరువిప్పిన చైనా.. కమాండర్‌ మృతి! | China Says Commanding Officer Was Killed In Galwan Clash | Sakshi
Sakshi News home page

నోరువిప్పిన చైనా.. కమాండర్‌ మృతి!

Jun 22 2020 6:40 PM | Updated on Jun 22 2020 7:01 PM

China Says Commanding Officer Was Killed In Galwan Clash - Sakshi

బీజింగ్‌ : భారత్‌-చైనా సరిహద్దుల్లోని గల్వాన్‌ లోయలో ఈనెల 15న చోటుచేసుకున్న హింసాత్మక ఘటనపై చైనా నోరువిప్పింది. ఘర్షణకు సంబంధించి తొలిసారి ఓ మరణాన్ని అధికారికంగా ప్రకటించింది. గల్వాన్‌ ఘటనలో తమ సైన్యానికి చెందిన సీనియర్‌ కమాండింగ్‌ అధికారి మృతిచెందినట్లు తెలిపింది. ఈ మేరకు ఇరు దేశాల మధ్య జరుగుతున్న కమాండర్‌‌ స్థాయి అధికారుల చర్చల సందర్భంగా చైనా ఈ ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. అయితే మొత్తం ఎంతమంది సైనికులకు మృతి చెందారన్న దానిపై మాత్రం స్పందించేందుకు విముఖత వ్యక్తం చేసింది. అంతేకాకుండా గల్వాన్‌ లోయకు సంబంధించి పలు కీలక విషయాలను డ్రాగన్‌ పంచుకున్నట్లు తెలుస్తోంది. (సరిహద్దుల్లో సైన్యం మోహరింపు)

భారత సైనిక వర్గాల సమాచారం ప్రకారం గల్వాన్‌ హింసాత్మక ఘర్షణలో భారత్‌కు చెందిన 20 మంది సైనికులు మృతిచెందగా.. చైనాకు చెందిన 40 మంది జవాన్లు మరణించారు. అయితే భారత ఆర్మీ ప్రకటనను ఇప్పటికే చైనా తోసిపుచ్చింది. కాగా రెడ్‌ ఆర్మీ దాడిలో గాయపడిన 76 మంది భారత సైనికులు చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. వీరంతా త్వరలోనే కోలుకుని విధుల్లో చేరుతారని సైనిక వర్గాలు ప్రకటించాయి.

ఇదిలావుండగా ఓ వైపు ఇరు దేశాల సైనిక అధికారుల మధ్య చర్చలు సాగుతున్నా.. వాస్తవాధీన రేఖ వెంట మాత్రం చైనా దురాక్రమణ కొనసాతూనే ఉంది. తాజాగా అస్సాం సరిహద్దు ప్రాంతంలో చైనా సైన్యం చొరబాట్లకు పాల్పడినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ దాడిని భారత సైనికులు తీవ్రంగా ప్రతిఘటించినట్లు తెలుస్తోంది. తాజా ప్రతిష్టంభన నేపథ్యంలో ఇరు దేశాల నడుమ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. (భారత్‌- చైనా మధ్య చర్చలు ప్రారంభం)


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement