అత్యాధునిక ఆయుధాలు.. చైనా ఆర్మీ పరేడ్‌!

China Army Gets Most Advanced Vehicle Mounted Howitzer - Sakshi

బీజింగ్‌: పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ(పీఎల్‌ఏ) 75వ గ్రూపులో అత్యాధునిక ఆయుధాలు వచ్చి చేరినట్లు చైనా అధికార మీడియా గ్లోబల్‌ టైమ్స్‌ వెల్లడించింది. దేశ వాయువ్య సరిహద్దులో అత్యంత అధునాతన పీసీఎల్‌-181 ఫిరంగి వాహనాలతో సైన్యం పరేడ్‌ నిర్వహించిందని.. ఇందుకు సంబంధించిన ఫొటోలను విడుదల చేసింది. వాయువ్య చైనాలోని ఎడారి ప్రాంతంలో నంజియాంగ్‌ హావోజియావో(హార్న్‌ ఆఫ్‌ సౌత్‌ బోర్డర్‌)లో ఆయుధాల ప్రారంభోత్సవ వేడుక నిర్వహించిందని వెల్లడించింది. ఈ మేరకు  సైన్యం మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేసినట్లు తెలిపింది. కాగా డోక్లాం విషయంలో భారత్‌- చైనాల మధ్య విభేదాలు తలెత్తిన సమయంలో ఇటువంటి ఆయుధాలను పీఎల్‌ఏ వెస్ట్రన్‌ థియేటర్ కమాండ్‌కు తరలించిన విషయం విదితమే. (చైనాతో తొలగుతున్న ఉద్రిక్తతలు)

ఇక తాజాగా తూర్పు లడఖ్‌ ప్రాంతంలో వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో వీటిని 75వ గ్రూపునకు అందించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదిలా ఉండగా.. దౌత్య, మిలిటరీ ఉన్నత స్థాయి చర్చల నేపథ్యంలో సైన్యం ఉపసంహరణ విషయంలో ఇరు దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదిరిన విషయం తెలిసిందే. దీంతో భారత్‌- చైనా బలగాలు సమస్యాత్మక ప్రాంతాల నుంచి వెనక్కి వెళ్లినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కాగా.. గతేడాది అక్టోబరు 1న నేషనల్‌ మిలిటరీ డే పరేడ్‌లో 155 మిల్లీమీటర్‌ కాలిబర్‌ వీల్‌ కలిగిన హవీజర్‌ వాహనాలను చైనా సైన్యం ప్రదర్శించిన విషయం తెలిసిందే. కేవలం 25 టన్నుల బరువు కలిగిన ఈ తేలికపాటి ఆయుధాల్లో డిజిటల్‌ కంట్రోల్‌ ప్యానెల్స్‌ ఉంటాయి. ఒక్కసారి బటన్‌ నొక్కితే చాలు లక్ష్యాలపై బాంబుల వర్షం కురిపిస్తాయి.(‘వాస్తవాధీన రేఖ’లో సామరస్యం) 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top