నియంతల గుండెల్లో నిద్రించిన యోధుడు! | Sakshi
Sakshi News home page

నియంతల గుండెల్లో నిద్రించిన యోధుడు!

Published Mon, Oct 9 2017 11:59 PM

Che Guevara 50th death anniversary

ఇక్కడ కనిపిస్తున్న ఈ బొమ్మను ఎన్నో సినిమాల్లో చూశాం. చాలామంది టీషర్టులపై చూశాం. కానీ... సినిమాలు చూసినవాళ్లలో, ఈ బొమ్మతో ఉన్న టీషర్టులు వేసుకున్నవారిలో ఎంతమందికి ఇతని గురించి తెలుసు?.. చే గువేరా ఏ దేశానికి చెందిన విప్లవ యోధుడు? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టమే. ఎందుకంటే చే.. ఒక ప్రాంతానికో, ఒక దేశానికో పరిమితమైన వ్యక్తి కాదు. యావత్‌ ప్రపంచానికి కొత్త శక్తినిచ్చిన నేత. ప్రపంచంలో ఎవరికి, ఎప్పుడు, ఎక్కడ ఏ అన్యాయం జరిగినా స్పందించాలని యువతకు దిశానిర్దేశం చేసి, ఆచరించి చూపించిన మార్గదర్శి.

ఊహించని శక్తిగా...
1928 జూన్‌ 14న అర్జెంటీనాలోని రోజలియాలో జన్మించిన చే గువేరా బాల్యంలో ఆస్తమా బాధితుడు. దీంతో పసివాడికి ఏమౌతుందో అని భయపడుతూ అతని తల్లిదండ్రులు నిద్రలేని రాత్రులు గడిపేవారు. అయితే ఆ పసివాడే పెరిగి పెద్దయ్యాక నియంతలకు నిద్ర లేకుండా చేస్తారని ఎవరైనా ఊహించగలరా? అవును. ఈ పసివాడే నియంతల గుండెల్లో నిద్రపోయాడు. వాళ్లకు నిద్ర లేకుండానూ చేశాడు.

జీవితాన్ని మార్చిన ప్రయాణం..
వైద్యవిద్యార్థిగా వున్నప్పుడే లాటిన్‌ అమెరికా మొత్తం పర్యటించాలని అతని మనసులో కోరిక కలిగింది. ఆ కోరిక బలంగా నాటుకుపోయింది. స్నేహితుడు ఆల్బర్టో గ్రనడోతో కలసి తన పాత మోటారు సైకిలుపై లాటిన్‌ అమెరికా మొత్తం చుట్టి రావాలనుకున్నాడు. ఆ ప్రయాణమే ఆయన జీవితాన్ని మార్చేస్తుందని కనీసం చే కూడా ఊహించలేదు. ఆ ప్రయాణం మొదలు పెట్టాక దారి మధ్యలో ఎన్నో అనుభవాలు ఎదురయ్యాయి. వలస సామ్రాజ్యవాదుల పాలనలో మగ్గిపోతూ కనీస అవసరాలైన తిండి, గూడు లేక ప్రజలు పడుతున్న ఇబ్బందులు, బానిస బతుకులు సరైన వైద్యం అందక ప్రాణాలు కోల్పోతున్న కోట్లాది ప్రజల బాధలను ఆకలిచావులను కళ్లారా చూశాడు. అప్పుడే లాటిన్‌ అమెరికాలోని బానిసల జీవితాలలో వెలుగులు నింపాలని నిర్ణయించుకున్నాడు.

సమాజానికి వైద్యం..
డాక్టర్‌ పట్టా చేతికొచ్చిన చే గువేరాను చూసి తల్లితండ్రులు ఎంతో ఆనందపడ్డారు. అయితే ఆయన ఆలోచనలు వేరుగా వున్నాయని వారికి తెలియదు. దోపిడీ చేస్తున్న నియంతృత్వాన్ని అంతమొందించి... బానిసత్వం నుంచి ప్రజలకు విముక్తి కల్గించాలని అనుకుంటున్నట్లు చే వారితో అన్నాడు. అనడమే కాదు, ఆ దిశగా అడుగులు వేశాడు. తన విప్లవానికి మొదట బొలీవియాను ఎంచుకున్నాడు. అక్కడ నుంచి అనేక దేశాల మీదుగా ప్రయాణిస్తూ క్యూబా గురించి క్యాస్ట్రో నాయకత్వంలో అక్కడ జరుగుతున్న పోరాటాల గురించి తెలుసుకున్నాడు. క్యూబా నియంతపై చే నడిపిన గెరిల్లా యుద్ధం విప్లవబాటకు కొత్త అడుగులు నేర్పింది. ఆ తర్వాత  క్యూబా పునర్నిర్మాణంలో చే పాత్ర మర్చిపోలేనిది. అందుకే క్యూబన్లు క్యాస్ట్రోని ప్రేమించినట్లే చేగువేరాను కూడా ప్రేమిస్తారు.


చే గువేరా వర్ధంతికి హాజరైన ఆయన అభిమానులు, మద్ధతుదారులు

ఘనంగా వర్ధంతి..
చే గువేరా 50వ వర్ధంతిని పురస్కరించుకొని హవానాలో సోమవారం జరిగిన కార్యక్రమంలో దాదాపు 60 వేల మంది క్యూబన్లు పాల్గొన్నారు. దేశాధినేత రౌల్‌ క్యాస్ట్రో స్వయంగా ఈ కార్యక్రమానికి హాజరై చె గొవేరాకు నివాళులర్పించారు.

Advertisement
 
Advertisement