భారత్‌కు దౌత్య సిబ్బంది కొరత..!

Bharat Faced Problem With Diplomatic Staff - Sakshi

ఇతర దేశాలతో పోల్చితే తక్కువగా ఉండడంతో ఇబ్బందులు...

అంతర్జాతీయ స్థాయిలో నిర్దేశిత లక్ష్యాలు, ఆకాంక్షలను నెరవేర్చుకునే క్రమంలో భారత్‌కు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రపంచంలో స్థిరమైన ఆర్థిక వ్యవస్థలుగా ఎదుగుతున్న దేశాల్లో ముందు వరసలో ఉన్న మనదేశానికి దౌత్య సిబ్బంది కొరత ఓ ముఖ్య సమస్యగా మారింది. ఐరాస భద్రతా మండలిలో శాశ్వత స్థానం, న్యూక్లియర్‌ సప్లయిర్స్‌ గ్రూప్‌లో సభ్యత్వం, వివిధ దేశాల్లోని ప్రవాస భారతీయుల హక్కుల పరిరక్షణ వంటి ఇతర సమస్యలు ఎదురైనపుడు ఇదొక ప్రతిబంధకమైంది. వివిధ అంశాల్లో సహకారం, తదితరాల విషయంలో ఆసియా ఖండంలో చైనాకు ప్రత్యామ్నాయంగా ఇండియాను అమెరికా, ఇతర పశ్చిమదేశాలు ఎంచుకుంటున్న నేపథ్యంలో సరైన సంఖ్యలో దౌత్యసిబ్బంది అందుబాటులో లేకపోవడం ఇబ్బందులకు కారణమవుతోంది. ప్రపంచంలోనే ఓ ఆర్థికశక్తిగా ఎదుగుతున్న క్రమంలో ఇతర దేశాలతో సంబంధ బాంధవ్యాలు పెంచుకునేందుకు ఆయా దేశాల్లో తగినంతగా రాయబార కార్యాలయ సిబ్బంది  అవసరం ఎంతైనా ఉంది.

విస్తీర్ణం, వైశాల్యపరంగానే కాకుండా 130 కోట్లకు పైగా జనాభాతో రెండో అత్యధిక జనాభా దేశంగా ఉన్న భారత్‌కు 940 విదేశీ సర్వీసు అధికారులున్నారు. ఓ మోస్తరు పెద్ద దేశాలతో పోల్చితే ఈ సంఖ్య చాలా తక్కువ. చిన్నదేశాలైన సింగపూర్‌కు (దాదాపు 58 లక్షల జనాభా) 850 మంది అధికారులు, న్యూజిలాండ్‌కు (50 లక్షల జనాభా) 885 మంది అధికారులున్నారంటే మనదేశ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇక పెద్ద దేశాలైన చైనాకు ఏడున్నరవేల మంది, అమెరికాకు 14 వేల మంది, జపాన్, ఆస్ట్రేలియా వంటి దేశాలకు 6 వేలకు పైగా దౌత్యాధికారులున్నారు. ఈ కొరత కారణంగా రక్షణ, ఆర్థిక, ఇతర శాఖల అధికారులు, నిపుణులను డిప్యుటేషన్‌పై తెచ్చుకోవాల్సిన స్థితి ఏర్పడింది. స్పానిష్‌ భాష మాట్లాడే అధికారుల కొరత కారణంగా అనేక లాటిన్‌ అమెరికా దేశాల్లో భారత రాయబార కార్యాలయాలు ఏర్పాటు చేయలేకపోతున్నారు. విదేశాల్లోని అనేక దౌత్యకార్యాలయాలు అతి తక్కువ మంది అధికారులు, సిబ్బందితో పనులు చక్కపెట్టాల్సి వస్తోంది. గతంలో ఓ మంత్రిత్వశాఖలో స్టెనోగ్రాఫర్‌గా ఉన్న వ్యక్తిని ఉత్తర కొరియా రాయబారిగా నియమించాల్సి వచ్చిందంటే మనదేశ పరిస్థితి స్పష్టమవుతోంది. 

ప్రతిభగలవారు విదేశీ సర్వీసుకు బదులు ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్‌ఎస్‌ వంటి సర్వీసులను ఎంచుకుంటున్నారు. పోలీస్‌ లేదా  కస్టమ్స్‌ శాఖలో చేరే అవకాశాన్ని కోల్పోయిన వారే ఈ సర్వీస్‌ ఎంచుకుంటున్నారు. గత నాలుగేళ్లలో  అమెరికా, చైనాల్లో ఐదేసి సార్లు, రష్యా, జర్మనీల్లో నాలుగేసి సార్లు కలుపుకుని ప్రధాని నరేంద్రమోదీ దాదాపు 60 దేశాల్లో   పర్యటించారు. అయితే ఈ దేశాల్లో దౌత్యపరమైన సంబంధాలు కొనసాగించేందుకు, పర్యటన సందర్భంగా తీసుకున్న నిర్ణయాలు, ప్రణాళికలు అమలు చేసేందుకు అవసరమైన స్థాయిలో సిబ్బంది లేకపోవడం ఇబ్బందికరంగా మారింది.  ఈ నేపథ్యంలో పాతకాలం నాటి ఎంపిక విధానానికి బదులు, దౌత్యసిబ్బంది నియామక ప్రక్రియలో సంస్కరణలు తీసుకొచ్చి పరిమిత కాలానికి  కన్సల్టెంట్లు, నిపుణులను నియమించుకునేలా మార్పులు చేయాల్సిన అవసరముందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అంతర్జాతీయ స్థాయిలో దేశం అవసరాలు, మారుతున్న కాలానికి తగ్గట్టుగా పునర్‌వ్యవస్థీకరణతో పాటు కీలక మార్పులు చేపట్టాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు.

 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top