
దావోస్ : భారత్ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నప్పటికీ విద్యావిధానంలో సమూల మార్పులు రావాల్సిన అవసరముందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ అన్నారు. ‘మనం యువతరాలను మాత్రమే నిర్మించగలుగున్నాం. కానీ, ప్రపంచంతో పోటీ పడేవిధంగా వారిని తయారు చేయలేకపోతున్నాం’ అని వ్యాఖ్యానించారు. దేశ భవిష్యత్‌కు అతి ముఖ్యమైన ‘మానవ వనరుల అభివృద్ధి’ అనే అంశాన్ని సరిగా పట్టించుకోవడం లేదన్నారు. మానవ వనరుల అభివృధ్ది శాఖ (హెచ్చార్డీ)కు అత్యంత సమర్థులు మంత్రిగా కొనసాగాలని ఆకాక్షించారు.
నాణ్యమైన విద్యతోనే భారత యువత అన్ని రంగాల్లో దూసుకుపోతుందని చెప్పారు. దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం(డబ్ల్యూఈఎఫ్) లో పాల్గొనేందుకు వచ్చిన రాజన్ ఓ జాతీయ మీడియాతో ఈ విషయాలు వెల్లడించారు. డబ్ల్యూఈఎఫ్ సదస్సులో ఆయన మాట్లాడుతూ.. ‘భవిష్యత్‌లో భారత్ చైనా ఆర్థిక వ్యవస్థను కూడా దాటిపోవచ్చు. మౌలిక వసతుల కల్పనలో ఆ దేశం కంటే మెరుగైన స్థానంలో నిలవొచ్చునని, దేశాల మధ్య ఇలాంటి పోటీ మంచిదే’ అని రాజన్ అన్నారు. ఆర్బీఐ గవర్నర్‌గా రాజన్ మూడేళ్ల పాటు పనిచేసిన సంగతి తెలిసిందే.