వందేళ్లలో మరో మానవగ్రహం! | Another human rocket to be started by Hundered years | Sakshi
Sakshi News home page

వందేళ్లలో మరో మానవగ్రహం!

Sep 29 2016 2:43 AM | Updated on Sep 5 2018 4:26 PM

వందేళ్లలో మరో మానవగ్రహం! - Sakshi

వందేళ్లలో మరో మానవగ్రహం!

భూమి మీకు బోర్ కొట్టేసిందా? అరుణగ్రహంలో కాపురం పెట్టేయాలని అనుకుంటున్నారా?

భూమి మీకు బోర్ కొట్టేసిందా? అరుణగ్రహంలో కాపురం పెట్టేయాలని అనుకుంటున్నారా? అయితే మీ ఆశలు నెరవేరే టైమ్ దగ్గర్లోనే ఉంది. ఎందుకంటే...  ఆ గ్రహాన్ని కనీసం పది లక్షల మంది మానవులతో నింపేస్తానని అంటున్నాడు ఎలన్ మస్క్! ఎవరీయన అంటే.. అమెరికాలో టెస్లా అని ఓ కంపెనీ ఉంది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా ప్రయాణించగల ఎలక్ట్రిక్ కార్లు తయారు చేస్తుందీ కంపెనీ. మస్క్ ఈ కంపెనీ యజమాని మాత్రమే కాదు.. హైపర్‌లూప్ పేరుతో అతి చౌకైన మరో రవాణా వ్యవస్థను ప్రపంచానికి అందించేందుకు ప్రయత్నిస్తున్న టెక్ విజర్డ్ కూడా. తన ‘స్పేస్ ఎక్స్’ కంపెనీతో ఇప్పటికే మళ్లీమళ్లీ వాడుకోగల రాకెట్లను అభివృద్ధి చేసిన మస్క్ మరో అడుగు ముందుకేసి వీటిసాయంతో మనుషుల్ని అంగారకుడిపైకి కూడా పంపుతానని ప్రకటించారు.
 
ఇందుకు సన్నాహకంగా 2018లో ఆ గ్రహంపైకి తన డ్రాగన్-2 స్పేస్ రాకెట్‌ను ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నాడు. మెక్సికోలో జరిగిన ఇంటర్నేషనల్ ఆస్ట్రోనాటికల్ కాంగ్రెస్‌లో మాట్లాడుతూ వందమందిని మోసుకెళ్లగల వ్యోమనౌకలతో ఇది సాధ్యమేనని ఆయన అన్నారు. దాదాపు 42 ఇంజిన్లతో కూడిన ఈ వ్యోమనౌకలను భవిష్యత్తులో 200 మందిని మోసుకెళ్లేలా తీర్చిదిద్దుతారట ఆయన. బూస్టర్‌తో కూడిన వ్యోమనౌక 18 బోయింగ్ 737 విమానాలు విడుదల చేసేంత శక్తితో అవి పైకి ఎగిరి భూ వాతావరణాన్ని దాటుతాయి. ఆ తరువాత బూస్టర్ విడిపోయి మళ్లీ భూమిని చేరుతుంది. వ్యోమనౌక మరింత దూరం వెళ్లి... అక్కడే కక్ష్యలో తిరుగుతున్న భారీ ట్యాంకు నుంచి ఇంధనాన్ని నింపుకుని అంగార కుడికేసి దూసుకెళుతుంది. ఖాళీ అయిన ఇంధన ట్యాంకు భూమ్మీదకు చేరుకుని ఇంధనం నింపుకుని మళ్లీ కక్ష్యలోకి వెళ్లిపోతుంది.
 
మానవులతో కూడిన తొలి అంగారక యాత్ర 2022 నాటికి మొదలైనా...  ఆ తరువాత దశలవారీగా ఆ గ్రహాన్ని మానవ ఆవాస యోగ్యంగా మార్చేందుకు కనీసం వందేళ్లు పడుతుందని మస్క్ వివరిస్తున్నారు. రకరకాల టెక్నాలజీల సాయంతో ఆ గ్రహంపై మానవ నివాస యోగ్యమైన వాతావరణాన్ని సృష్టించాలన్నది ప్లాన్. దీన్నే టెరాఫార్మింగ్ అని పిలుస్తున్నారు.  మళ్లీమళ్లీ వాడుకోగల బూస్టర్లు, వ్యోమనౌకలను వాడుతూండటం వల్ల అంగారక యాత్రకు పెద్ద ఖర్చేమీ కాదని, ఒక్కొక్కరూ కోటిన్నర రూపాయలు చెల్లిస్తే చాలని మస్క్ అంచనా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement