పాక్‌కు మరో షాక్‌ ఇచ్చిన ట్రంప్‌

America Cuts aid by $440 million To Pakistan - Sakshi

పాకిస్తాన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి గట్టి షాకిచ్చారు. ఆ దేశానికి ఇచ్చే ఆర్థిక సహాయంలో 440 మిలియన్‌ డాలర్ల కోత విధించారు. పాక్‌కు ఇప్పటి నుంచి కేవలం 4.1 బిలియన్‌ డాలర్లు మాత్రమే ఆర్థిక సహాయం చేస్తామని స్పష్టం చేశారు. అసలే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతోన్న పాక్‌కు ట్రంప్‌ తాజా నిర్ణయంతో మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లేనని పరిశీలకులు అంటున్నారు. ఇప్పటికే కశ్మీర్‌ వ్యవహారంలో అమెరికా నుంచి పాక్‌కు ఎదురుదెబ్బ తగిలింది. కశ్మీర్‌పై ఐక్యరాజ్యసమితి సమావేశంలో తమకు మద్దతివ్వాలని ట్రంప్‌ను పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ ఫోన్‌ ద్వారా సంప్రదించినా సరైన సమాధానం లభించలేదని తెలుస్తోంది.

భారత్‌, పాక్‌ దేశాలు ద్వైపాక్షిక చర్చల ద్వారా సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ట్రంప్‌ వ్యాఖ్యానించడంతో పాకిస్తాన్‌ చేసేదేమిలేక చైనాను ఆశ్రయించింది. ఇప్పుడు తాజాగా ఆర్థిక సహాయంలో కోత విధించడం పాకిస్తాన్‌కు నిజంగా శరాఘాతమే. ఇమ్రాన్‌ఖాన్‌ అమెరికా పర్యటనకు వెళ్లి వచ్చిన కొద్ది రోజుల్లోనే అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది. అమెరికా, పాక్‌ల మధ్య పెరుగుతున్న దూరానికి ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమేనని భావించవచ్చు. కాగా, తామిచ్చే నిధులు తీసుకొని ఉగ్రవాదంపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ ట్రంప్‌ పాక్‌పై సందర్భం వచ్చినప్పుడల్లా ఆగ్రహం వ్యక్తం చేస్తుండటం తెలిసిందే. దీంతో పాక్‌కు ఇంతకు ముందు కూడా ఆర్థిక సహాయంపై అమెరికా కోత విధించింది. గతేడాది 1 బిలియన్‌ డాలర్ల ఆర్థిక సహాయంతోపాటు 300 మిలియన్‌ డాలర్ల సైనిక సాయాన్ని తగ్గించింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top