విమానంపై పిడుగు!

41 Confirmed Dead After Russian Aeroflot Plane Lands With Fire - Sakshi

రష్యాలో 41 మంది మృతి

మాస్కో: రష్యా రాజధాని మాస్కోలో ఆదివారం రాత్రి సంభవించిన ఘోర విమాన ప్రమాదంలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విమానప్రమాదానికి పిడుగుపాటే కారణమని విమాన పైలట్‌ డెనిస్‌ యెవ్‌డొకిమొవ్‌ చెప్పారు. ఈ ప్రమాదంలో ఆయన ప్రాణాలతో బయటపడ్డారు. తాము బయలుదేరిన కొద్దిసేపటికే సంభవించిన పిడుగుపాటు కారణంగానే తమ విమాన సమాచార వ్యవస్థలు దెబ్బతిన్నాయనీ, తాము అత్యవసర నియంత్రణ పద్ధతిలోకి మారినప్పటికీ సమాచారాన్ని సరిగ్గా చేరవేయలేక పోతుండటంతో మాస్కోకు తిరిగొచ్చామని చెప్పారు.

అయితే పిడుగు నేరుగా విమానంపైన పడిందా లేదా పక్కన ఎక్కడైనానా అనే విషయాన్ని ఆయన స్పష్టం చేయలేదు. కూలిపోయిన సమయంలో తమ విమాన ఇంధన ట్యాంకులు పూర్తిగా నిండి ఉన్నాయనీ, ఈ కారణంగానే మంటలు అంటుకుని ఉండొచ్చని అన్నారు. ఈ ప్రమాదంపై రష్యా ప్రభుత్వం ఇప్పటికే దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేయగా, అననుకూల వాతావరణం, పరికరాలు సరిగ్గా పనిచేయకపోవడానికితోడు పైలట్లకు తగినంత అనుభవం లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తాము ప్రాథమికంగా భావిస్తున్నట్లు వారు చెప్పారు.

ప్రమాదంలో 41 మంది చనిపోగా 11 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. వారిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. మాస్కోలోనే అత్యంత రద్దీ విమానాశ్రయమైన షెరెమెటయెవో ఎయిర్‌పోర్ట్‌లో ఈ దుర్ఘటన జరిగింది. మాస్కో నుంచి ముర్‌మాన్స్‌క్‌కు వెళ్లేందుకు ఏరోఫ్లోట్‌ విమానయాన సంస్థకు చెందిన సుఖోయ్‌ సూపర్‌జెట్‌ 100 విమానం (ఎస్‌యూ–1492) సాయంత్రం 6.02 గంటలకు (రష్యా కాలమానం ప్రకారం) బయలుదేరింది. ఆ సమయంలో విమానంలో 73 మంది ప్రయాణికులతోపాటు ఐదుగురు సిబ్బంది ఉన్నారు.

విమానం బయలుదేరిన కొద్దిసేపటికే సమాచార వ్యవస్థలు దెబ్బతినడంతో మళ్లీ 6.30 గంటలకు మాస్కోకు తిరిగొచ్చింది. విమానాశ్రయంలో ల్యాండింగ్‌కు పైలట్లు ప్రయత్నిస్తుండగా రన్‌ వే పైనే కూలి మంటలు అంటుకున్నాయి. విమానం లోపల నుంచి దట్టమైన పొగలు బయటకు రావడం మొదలైంది. పైలట్‌తో పాటు కొంతమంది ప్రయాణికులు అత్యవసర మార్గాల ద్వారా బయటపడగా, మరికొంత మంది సకాలంలో బయటకు రాలేక మంటలకు ఆహుతయ్యారు. అధికారులు బ్లాక్‌ బాక్స్‌లను బయటకు తీసి దర్యాప్తు జరుపుతున్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top