శ్వేతజాతీయుల నిరసనలో హింస | Sakshi
Sakshi News home page

శ్వేతజాతీయుల నిరసనలో హింస

Published Mon, Aug 14 2017 1:37 AM

శ్వేతజాతీయుల నిరసనలో హింస - Sakshi

అమెరికాలోని చార్లట్స్‌విల్‌లో ఘటన  
► గుంపులోకి కారు దూసుకురావడంతో ఒకరి మృతి
►  సమీపంలో పోలీసు హెలికాప్టర్‌ కూలి ఇద్దరి దుర్మరణం
► అంతర్యుద్ధ కమాండర్‌ విగ్రహం తొలగింపు ప్రతిపాదనపై  శ్వేతజాతీయుల నిరసన
► వారికి వ్యతిరేకంగా మరో వర్గం ప్రజల ఆందోళన


వాషింగ్టన్‌: అమెరికాలో వర్జీనియా రాష్ట్రంలో శ్వేతజాతీయవాదులు చేపట్టిన నిరసన ప్రదర్శన హింసాత్మకంగా మారింది. గుంపులోకి ఓ కారు దూసుకురావడంతో ఒక మహిళ మృతిచెందగా, 19 మంది గాయపడ్డారు. మరోపక్క.. ఆందోళనను గమనిస్తున్న పోలీసు హెలికాప్టర్‌ ఘటనాస్థలానికి సమీపంలో కూలిపోవడంతో అందులోని ఇద్దరు పోలీసు అధికారులు చనిపోయారు. అమెరికా అంతర్యుద్ధంలో పాల్గొన్న కాన్ఫెడరేట్‌ కమాండర్‌ రాబర్ట్‌ లీ విగ్రహాన్ని తొలగించాలన్న అధికారుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ వేలాది శ్వేతజాతీయవాదులు, నయా నాజీలు శనివారం ఆ విగ్రహం ఉన్న చార్లట్స్‌విల్‌ నగరంలోని పార్కును ఆక్రమించుకుని నిరసనకు దిగారు.

ఈ సందర్భంగా నిరసనకారులకు, వారు పార్కును ఆక్రమించుకోవడాన్ని వ్యతిరేకిస్తున్న ప్రజలకు మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఇరుపక్షాలు పిడిగుద్దులు, రసాయనిక స్ప్రేలు, వాటర్‌బాటిళ్లతో పర స్పర దాడులు చేసుకున్నాయి. ఘర్షణలు సద్దుమణిగాక శ్వేతజాతీయులకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న జనంలోకి ఒక కారు వేగం గా దూసుకొచ్చి, మళ్లీ వెనక్కి వెళ్లిపోయింది. ఈ ఘటనలో 32 ఏళ్ల మహిళ ఒకరు మృతిచెందారు. కారును నడిపిన ఒహాయో రాష్ట్రవాసి జేమ్స్‌ ఫీల్డ్స్‌(20)ను పోలీసులు అరెస్ట్‌ చేసి హత్యాభియోగాలు నమోదు చేశారు.

ఘర్షణల్లో మరో 15 మంది గాయపడ్డారు. నగరంలో శాంతిభద్రతలను అదుపుచేస్తున్న బలగాలకు సాయపడుతున్న హెలికాప్టర్‌ ప్రమాదవశాత్తూ కూలిపోవడంతో అందులోని ఇద్దరు పోలీసులు దుర్మరణం చెందారు. ఉద్రిక్తత నేపథ్యంలో అధికారులు వర్జీనియా రాష్ట్రంలో ఎమర్జెన్సీ విధించి, పెద్ద సంఖ్యలో భద్రతా బలగాలను మోహరించారు. ఇటీవలి కాలంలో తాము నిర్వహించిన అతిపెద్ద ర్యాలీ ఇదేనని శ్వేతజాతీయవాదులు చెప్పారు.

హింసకు అమెరికాలో చోటులేదు: ట్రంప్‌
చార్లట్స్‌విల్‌లో జరిగిన హింస భయంకర ఘటన అని దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పేర్కొన్నారు. ‘దారుణమైన విద్వేషాన్ని, దురభిమాన ప్రదర్శనను, హింసను గట్టిగా ఖండిస్తున్నాం.. ఇలాంటివి మన దేశంలో చాలా కాలం నుంచి సాగుతున్నాయి. వీటికి అమెరికాలో స్థానం లేదు. అమాయకుల ప్రాణాలను రక్షించి, శాంతిభద్రతలను త్వరగా పునరుద్ధరించడమే తక్షణ కర్తవ్యం’ అని ఆయన న్యూజెర్సీలో విలేకర్లతో అన్నారు.  ఆందోళనకారులు తిరిగి ఇళ్లకు వెళ్లాలని చార్లట్స్‌విల్‌ మేయర్‌ మైక్‌ సింగ్‌ కోరారు.

ఇది ప్రజాస్వామ్యంపై దాడి అని విపక్ష డెమోక్రటిక్‌ పార్టీ అధినేత టామ్‌ పెరెజ్‌ వ్యాఖ్యానించారు. జాత్యహంకారులను నియంత్రించడానికి అన్ని చర్యలూ తీసుకోవాలని భారత సంతతికి చెందిన కాంగ్రెస్‌ సభ్యుడు రాజాకృష్ణమూర్తి.. అటార్నీ జనరల్‌ జెఫ్‌ సెషన్స్‌ను కోరారు. ఈ ఉదంతంపై విచారణ జరిపించాలని మానవ హక్కుల నేత వనితా గుప్తా.. ఎఫ్‌బీఐని డిమాండ్‌ చేశారు. 50వేల జనాభా ఉన్న చార్లట్స్‌విల్‌లో పరిమిత సంఖ్యలో భారతీయ అమెరికన్లు కూడా ఉన్నారు. 

Advertisement
Advertisement