కొత్త జిల్లాల నేపథ్యంలో ఆర్టీసీలో జోన్ల విధానాన్ని రద్దు చేశారు.
సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాల నేపథ్యంలో ఆర్టీసీలో జోన్ల విధానాన్ని రద్దు చేశారు. ఇక నుంచి రీజనల్ మేనేజర్లే నేరుగా ఎండీకి బాధ్యత వహిస్తారు. ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్లు (ఈడీ) ఆర్టీసీ పరిపాలనా కార్యాలయానికే పరిమితమవుతారు. హైదరాబాద్ సిటీ జోన్ మాత్రమే యథావిధిగా కొనసాగనుంది. కరీంనగర్ జోన్ ఈడీగా ఉన్న సత్యనారాయణకు ఆర్టీసీ అడ్మినిస్ట్రేషన్ బాధ్యత అప్పగించారు. ఆపరేషన్ ఈడీగా ఉన్న నాగరాజు ఇప్పటివరకు ఈ బాధ్యత నిర్వహించారు. గతంలో ఆర్టీసీ సమీక్ష నిర్వహించిన సమయంలో కొత్తగా రెవెన్యూ ఈడీ పోస్టును ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కానీ అది ఇప్పటివరకు అమలుకాలేదు.
తాజా మార్పుల్లో భాగంగా ఈడీ వేణుకు రెవెన్యూ ఈడీ పోస్టు కేటాయించారు. దీంతోపాటు ఆర్టీసీ బోర్డు కార్యదర్శి బాధ్యతను కూడా ఆయన నిర్వర్తించనున్నారు. ఇంజనీరింగ్ విభాగాన్ని పర్యవేక్షిస్తున్న రవీందర్‌కు ఇప్పటివరకు కార్యదర్శి బాధ్యత ఉండేది. ఇంజనీరింగ్ సివిల్, కొనుగోళ్లు యథావిధిగా ఎండీ వద్దే ఉన్నాయి. హైదరాబాద్ సిటీ జోన్ ఈడీగా ఉన్న పురుషోత్తం యథావిధిగా కొనసాగనున్నారు.